బాబు చేస్తే రైటు.. జగన్‌ చేస్తేనే రాంగ్‌.!

భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు చేతులు కలిపితే అది రైటు.. అది నూటికి నూరుపాళ్ళూ రాష్ట్ర అభివృద్ధి కోసమే... 

బీజేపీతో తెగతెంపులు చేసుకుని, కాంగ్రెస్‌తో అంట కాగేందుకు చంద్రబాబు సిద్ధమైతే అదీ రైటే.. ఎందుకంటే బీజేపీ ప్రత్యేక హోదాపై మోసం చేసింది.. కాంగ్రెస్‌ పార్టీ, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిందన్న చంద్రబాబు మాటల్నే నమ్మి తీరాలి. 

తెలంగాణ రాష్ట్ర సమితితో స్నేహం కోసం చంద్రబాబు తహతహలాడితే, అది రాష్ట్రాల మధ్య సఖ్యత కోసం.! 

పవన్‌కళ్యాణ్‌తో టీడీపీ జతకట్టిన వేళ, అది లోక కళ్యాణం కోసమే.! 

ఇంతేనా, కథ ఇంకా చాలానే వుంది.. 

చంద్రబాబు కుటిల రాజకీయ నీతిని గుర్తెరిగి, టీడీపీకి బీజేపీ దూరమయ్యే క్రమంలో, వైఎస్సార్సీపీ వైపు కమలదళం చూస్తే, అది పెద్ద నేరం. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకే బీజేపీ - వైసీపీ జత కడ్తున్నాయని టీడీపీ చెబితే జనం నమ్మి తీరాలి. 

జగన్‌పై హత్యాయత్నాన్ని పవన్‌కళ్యాణ్‌ ఖండిస్తే.. వైసీపీ, జనసేన అంటకాగుతున్నట్లే లెక్క.! 

టీఆర్‌ఎస్‌ ఇప్పుడు, జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం ప్రయత్నిస్తూ, ఈ క్రమంలో జగన్‌తో సమావేశమైతే.. ఇంకేముంది, ఆంధ్రప్రదేశ్‌లో విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లే భావించాలట.! 

రాజకీయాల్లో దిగజారుడుతనానికి పరాకాష్ట అన్న మాట చంద్రబాబు విషయంలోనూ, టీడీపీ విషయంలోనూ ఒకటికి వందసార్లు కాదు, వెయ్యిసార్లు చెప్పుకున్నా తక్కువే. ఏ టీఆర్‌ఎస్‌ అయితే పోలవరం ప్రాజెక్ట్‌ని అడ్డుకుందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెబుతున్నారో, అదే కేసీఆర్‌కి విజయవాడలో ఇదే దేవినేని ఘనస్వాగతం పలకడమే కాదు, చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ 'ఉమ్మడి రాష్ట్రంలో విభజన సమైక్య ఉద్యమాలనాటి' జ్ఞాపకాల గురించి మాట్లాడుకున్నారు. 

నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోతే, ఆయన పార్దీవ దేహం సాక్షిగా 'చావు ఇంట్లో' తెలంగాణ రాష్ట్ర సమితితో మంతనాలు జరిపిన ఘనుడు చంద్రబాబు. నిజానికి వైఎస్‌ జగన్‌, ఎవరితోనూ మంతనాల కోసం వెళ్ళింది లేదు. అదే చంద్రబాబు విషయాన్నే తీసుకుంటే, పవన్‌కళ్యాణ్‌ ఇంటికి వెళ్ళారు.. నరేంద్రమోడీ పంచన చేరారు.. రాహుల్‌గాంధీని ఆలింగనం చేసుకున్నారు.. టీఆర్‌ఎస్‌తో మంతనాలకోసం నానా పాట్లూ పడ్డారు. ఇదంతా వాస్తవం. చంద్రబాబుగారి ఘనతలకు సంబంధించి వీడియోలు, ఆయనగారి ప్రసంగాలు అందుబాటులోనే వున్నాయి. ప్రత్యేక హోదా వద్దన్నదీ చంద్రబాబే.. మోడీని పొగిడిందీ చంద్రబాబే. ఇప్పుడు మోడీని తిడుతున్నదీ, కాంగ్రెస్‌ని పొగుడుతున్నదీ ఆ చంద్రబాబే. 

ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయమై చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే వున్నాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ విషయమై కేసీఆర్‌ తన ఆలోచనల్ని జగన్‌తో పంచుకోవడం మాత్రమే జరిగింది. ఇంకా ఆ ఫ్రంట్‌లో వైఎస్సార్సీపీ చేరనే లేదు. ఈలోగా చంద్రబాబు అండ్‌ టీమ్‌ గగ్గోలు పెడ్తున్న తీరు చూస్తోంటే, 'తాను చేస్తేనే శృంగారం, ఇంకెవరు చేసినా అది వ్యభిచారం' అన్నట్టుందని రాజకీయ విశ్లేషకులే కాదు, సాధారణ ప్రజానీకం కూడా ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది.

Show comments