చంద్రబాబు మీ ఇంటికొచ్చి మిమ్మల్ని కొడతాడు

చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు తెలంగాణ సీఎం కేసీఆర్. కాంగ్రెస్ ను అడ్డంపెట్టుకొని మరోసారి తెలంగాణ గడ్డపై అడుగుపెడుతున్న చంద్రబాబును తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పొరపాటున మహాకూటమికి అధికారం ఇస్తే.. చంద్రబాబు ఇంటికొచ్చి మరీ మనల్ని కొడతాడని ప్రజల్ని హెచ్చరించారు కేసీఆర్.

"నీళ్లు తీసుకోవద్దు, దిండి ప్రాజెక్టు, నక్కలగండి ప్రాజెక్టు కట్టొద్దని కేంద్రానికి లేఖలు రాసిండు చంద్రబాబు. అదే చంద్రబాబు ఇప్పుడు మీ ఊరొచ్చి మిమ్మల్ని కొడతా అంటున్నాడు. మీ ఇంటికొచ్చి మిమ్మల్ని కొడతా అంటున్నాడు. కాంగ్రెస్ ను అడ్డంపెట్టుకొని వస్తున్నాడు. ఇది ఎంత సిగ్గులేని పని. చంద్రబాబు విషయంలో జాగ్రత్తగా ఉండండి. తెలంగాణను మీరే కాపాడుకోండి."

మెదక్ జిల్లా దేవరకొండలో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో ఈ వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. చంద్రబాబును మరోసారి తెలంగాణకు తీసుకొస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతల్ని దంచికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

"చంద్రబాబు మనకు అవసరమా. చంద్రబాబును భుజాలపై మోసుకొస్తోంది ఎవరో అర్థం చేసుకోండి. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్లా చంద్రబాబుకు అప్పగిస్తారా. వచ్చినోడు(చంద్రబాబు) ఆంధ్రోడే. కానీ వాడ్ని తెచ్చినోడు మాత్రం తెలంగాణోడు. వాళ్లే ఈ కాంగ్రెస్ నాయకులు. వీళ్లను దంచికొడితే మొత్తం సాపు అయితది."

ఈ ఎన్నికల తర్వాత తను పూర్తిగా ఢిల్లీకే పరిమితమైపోతానంటూ వస్తున్న వార్తల్ని కేసీఆర్ ఖండించారు. హైదరాబాద్ లోనే ఉంటూ ఢిల్లీ రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టిపెడతానని ప్రకటించారు. తను మాత్రం తెలంగాణను విడిచిపోయేది లేదని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు.

"నేను ఈ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటా. దానర్థం నేను ఢిల్లీకి పోతానని కాదు. నేను ఇక్కడే ఉండి కేంద్ర రాజకీయాల్ని ప్రభావితం చేస్తా. ఎందుకంటే రాష్ట్రాల హక్కుల కోసం. మా రిజర్వేషన్లు ఇవ్వమంటే ఇవ్వడానికి నీకేం రోగం మోడీ? నీకేమైనా జబ్బు చేసిందా. నీ మెదకు ఏమైనా చెద పట్టిందా. రాష్ట్రాల హక్కులు హరించడానికి నువ్వెవరు."

రాష్ట్రాల్ని మున్సిపాలిటీలుగా మార్చి, ప్రజల హక్కుల్ని హరించి, న్యాయం జరగకుండా నరేంద్రమోడీ కర్రపెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్. ఈ స్థితి మారాలంటే కేంద్రం మీద ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలని.. కచ్చితంగా నాన్-బీజేపీ, నాన్-కాంగ్రెస్ ఫెడరల్ ఫ్రెంట్ రావడానికి తెలంగాణ ఎన్నికల తర్వాత కృషి చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. 

రెడ్డి గారికి తత్వం బోధపడిందా..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్

Show comments