ఎమ్బీయస్‌: ఆర్‌బిఐ - ఆర్థికశాఖ రగడ - 1/2

కేంద్ర ఆర్థికశాఖకు, రిజర్వు బ్యాంకుకు మధ్య గొడవలు జరిగి రచ్చకెక్కిన విషయం అందరికీ తెలుసు. దాని గురించి వివరంగా చర్చించే ముందు సాంకేతిక విషయాల జోలికి పోకుండా జరుగుతున్నదేమిటో సింపుల్‌గా చెప్పేస్తాను.

చాలా ఏళ్లగా ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ బ్యాంకులను కామధేనువులుగా చూస్తున్నాయి. ఏ పార్టీకి చెందిన ప్రభుత్వమైనా సరే, కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వరంగ సంస్థలన్నిటిలో జోక్యం చేసుకుని తనకు కావలసిన వాళ్లని అధిపతులుగా నియమించి, వాళ్ల చేత తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేట్లా చేసి, వాటి నిర్వహణ చెడగొట్టి మూతపడే స్థితికి తీసుకుని వచ్చి అప్పుడు వాటిని ప్రయివేటు రంగానికి అప్పగించేస్తున్నారు. తద్వారా ప్రభుత్వరంగం అంటే ప్రజాధనం మేసేసే తెల్ల ఏనుగని, ప్రయివేటు రంగమంటే సామర్థ్యానికి మారుపేరని ప్రజల్లో అభిప్రాయం కలిగిస్తున్నారు.

ఉదాహరణకి చెప్పాలంటే ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్సు రెండింటిని విలీనం చేశారు. చేసేముందు యుపిఏ ప్రభుత్వం వాటి చేత విడివిడిగా బోల్డు విమానాలు కొనిపించేసింది. విలీనం తర్వాత వాటి నిర్వహణాభారం తలకు మించిన భారమై నష్టాల బారిన పడింది. ఇప్పుడు దాని వైఫల్యాన్ని ప్రభుత్వరంగ సంస్థల నెత్తిన చుడుతున్నారు. అంతమాత్రం చేత దాని సిబ్బందికి సామర్థ్యం లేదని అర్థం కాదు. ప్రభుత్వ జోక్యం వలననే యిలాటి పరిస్థితి దాపురించింది.

అదే విధంగా ప్రభుత్వ బ్యాంకులు. బ్యాంకు సిబ్బంది ఎంతో సామర్థ్యంతో నిజాయితీగా పనిచేసినా, వాటికి నష్టాలు రావడానికి కారణం - ప్రభుత్వజోక్యం! బ్యాంకు డైరక్టర్లను, అధినేతలను నియమించే అధికారం ఆర్థికశాఖ ద్వారా ప్రభుత్వం తన దగ్గరే అట్టేపెట్టుకుంది. తనకు కావలసిన వాళ్లందరికీ ఋణాలు యిప్పించుకుంటూ వచ్చింది. ఓ స్థాయి అధికారులు వాటిని వసూలు చేయబోతే అడ్డుకుంటూ వచ్చింది. వారిని నియంత్రించడానికి తను నియమించిన అధినేతలను, డైరక్టర్లను వాడుకుంది. వీళ్లు ప్రభుత్వానికి అనుకూలురుగా వున్న పారిశ్రామికవేత్తలకు, ప్రయివేటు రంగానికి మేలు చేస్తూ పోయారు.

ఒక తాజా ఉదాహరణ చూస్తే అర్థమవుతుంది. స్టేటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత కొన్ని సంవత్సరాలుగా అనేక బడా డిఫాల్టర్ల బాకీలను రద్దు చేసేసింది. అనేక మంది ఋణాలు చెల్లించకపోయినా ఏ చర్యా తీసుకోకుండా ఊరుకుంది. ఆ విధంగా ప్రయోజనం పొందినవారిలో రిలయన్సు కూడా ఉంది. స్టేటుబ్యాంక్‌కు 4 సంవత్సరాలు అధినేతగా పని చేసి రిటైరైన అరుంధతీ భట్టాచార్యను ఏడాది తర్వాత కృతజ్ఞతాపూర్వకంగా రిలయన్సు 5 సం.ల పాటు తన సంస్థలో ఇండిపెండెంటు డైరక్టరుగా నియమించింది. 

ఇది దశాబ్దాలుగా సాగుతున్న వ్యవహారం. దీనివలన నిరర్ధక ఆస్తులు (ఎన్‌పిఏలు) పెరుగుతూ పోయాయి. ఋణాలు యివ్వవద్దని బ్యాంకులకు చెప్పలేం. వాటి పనే అది. అప్పులిచ్చి వడ్డీలు సంపాదించి, వాటితోనే డిపాజిట్లు పెట్టినవారికి వడ్డీ లివ్వగలుగుతారు. అయితే అప్పులిచ్చి కాళ్లు జాపుకుని కూర్చుంటే కుదరదు. వాటిని వసూలు చేయాలి. వసూలు చేయాలంటే అప్పులిచ్చేటప్పుడు సకల జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లు హామీగా పెట్టే ఆస్తుల విలువను సరిగ్గా మదింపు వేయాలి. ఖాతా ఖాయిలా పడుతూంటే మేలుకొని వసూలు చేసేయాలి. ఋణగ్రస్తుడి ఆస్తులు జప్తు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అయితే యిది జరగకుండా ప్రభుత్వంలోని పెద్దలు అడ్డుపడుతూ వచ్చారు.

తనఖా పెట్టిన ఆస్తుల విలువ ఎక్కువ చేసి చూపమని, హామీలు లేకుండా అప్పులివ్వమని, కఠిన చర్యలు తీసుకుంటూంటే వద్దని, యిలా అడుగడుగునా బ్యాంకు యాజమాన్యాలకు సంకెళ్లు వేస్తూ పోయారు. నాయకుల ప్రాపకం కోసం బ్యాంకు అధినేతలు, డైరక్టర్లు వాటికి తల వూపుతూ పోయారు. ఇవి బ్యాంకులను నష్టాల ఊబిలోకి దింపుతూ పోయాయి. నిజానికి కింది స్థాయి బ్యాంకు ఉద్యోగుల సామర్థ్యం కారణంగా ఆపరేటింగ్‌ లాభాలు వచ్చినా యీ నిరర్ధక ఆస్తుల కారణంగా, చావుబాకీల కారణంగా నష్టాలు వాటిల్లాయి. అయినా సరే, తమకు కావలసిన వాళ్లకి అప్పులు యిప్పిస్తూ పోయారు. 

మరి దీన్ని పర్యవేక్షించేవాళ్లు, అడ్డుకునేవాళ్లు లేరా? అనే ప్రశ్న వస్తుంది. బ్యాంకులకు బ్యాంకు సెంట్రల్‌ బ్యాంకు (మన దేశంలో రిజర్వ్‌ బ్యాంకు అంటారు) కాబట్టి అదే నియంత్రిస్తుంది అనుకుంటారు. కానీ మనకున్న పెద్ద యిబ్బందేమిదేమిటంటే ప్రభుత్వ బ్యాంకులు బ్యాంకింగ్‌ చట్టం కిందకు వస్తాయి. అంటే కేంద్ర ఆర్థిక శాఖదే అధికారం. ఆర్‌బిఐ ప్రతినిథి (నామినీ) ఒకరు బ్యాంకు బోర్డులో ఉంటారంతే. బ్యాంకు అధినేతలను లేదా డైరక్టర్లను మార్చాలన్నా, బ్యాంకు లైసెన్సు రద్దు చేయాలన్నా, విలీనం చేయాలన్నా ఆర్‌బిఐ ఏమీ చేయలేదు. అదే ప్రయివేటు బ్యాంకులైతే కంపెనీ యాక్టు కింద రిజిస్టరై వుంటాయి కాబట్టి ఆ పనులు ఆర్‌బిఐ చేయగలదు. ప్రభుత్వబ్యాంకులను కూడా ఆర్‌బిఐ పరిధిలోకి తీసుకుని వస్తే తప్ప పర్యవేక్షణ చేయలేమని ఆర్‌బిఐ గవర్నర్లు దశాబ్దాలుగా మొత్తుకుంటూనే ఉన్నారు. పర్యవేక్షణ సరిగ్గా చేస్తే తమకు ముప్పని ప్రభుత్వం తన గుప్పిట్లో నుంచి పోనీయటం లేదు.

1991లో బ్యాంకింగ్‌ సంస్కరణలపై నివేదిక యిచ్చిన నరసింహం కమిటీ బ్యాంకులను ఒక సంస్థ అజమాయిషీలో పెట్టి దాన్ని ఆర్‌బిఐ కింద ఏర్పాటు చేయాలని సూచించింది. ఏ ప్రభుత్వమూ ఆ పని చేయలేదు. కాంగ్రెసు, జనతా, నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌, ఎన్‌డిఏ, యుపిఏ.. యిలా ఏ ప్రభుత్వమూ బ్యాంకుల పట్ల తన అజమాయిషీ వదలుకోలేదు, ఆర్‌బిఐను పర్యవేక్షణ చేయనీయలేదు. ప్రస్తుత ఎన్‌డిఏ ప్రభుత్వమూ అంతే.

అయితే నీరవ్‌ మోదీ విషయంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు పూర్తిగా మునిగిపోయినప్పుడు, ఆర్‌బిఐ పర్యవేక్షణా లోపం చేతనే యిది జరిగింది అని ఆర్థికమంత్రి అనడంతో ప్రస్తుత ఆర్‌బిఐ గవర్నరు ఊర్జిత్‌ పటేల్‌కు మండింది. తమ పరిమితులు ఫలానా అని నొక్కి వక్కాణించాడు. అయితే యిప్పణ్నుంచైనా మీకు అధికారాలు అప్పగిస్తాం, యిప్పణ్నుంచైనా సరిగ్గా చూడండి అని ఆర్థికమంత్రి అనడం లేదు. ఎన్‌పిఏలు పెరిగి పెరిగి కొండల్లా మారాయి. గత ఏడాది 8.40 లక్షల కోట్ల రూ.లున్నవి యిప్పుడు 10 లక్షల కోట్లయ్యాయి. అంటే కొత్తగా ఎన్‌పిఏలు వచ్చి చేరి వుండవచ్చు. లేదా పాత బాకీలు సరిగ్గా వసూలు చేయకపోయి వుండవచ్చు. ఋణాలు ఎగవేసినవారి పేర్లు బయటపెట్టండి అంటే ఆర్థిక శాఖ బయట పెట్టడం లేదు. పాత ప్రభుత్వం చిత్తమొచ్చినట్లు, ఒక్క ఫోన్‌ కాల్‌తో కోట్లాది ఋణాలు యిప్పించేసింది అని ఆరోపిస్తోంది, అది నిజమే కావచ్చు. ఇచ్చినంత మాత్రాన తిరిగి వసూలు చేసుకోకూడదని రూలు ఎక్కడా లేదు. బకాయిదార్ల పేర్లు దండోరా వేసి, పరువు బజారుకి యీడ్చి, ముక్కు పిండి వసూలు చేయవచ్చు. అది జరిగినట్లు లేదు. వాస్తవ పరిస్థితి తెలియాలంటే ఒక్కో ఋణం ఎప్పుడు మంజూరు చేశారు, ఎంత రాబట్టారు, ఎందుకు రాబట్టలేదు అన్నీ తెలియాలి. 

ఇప్పుడు ఎన్‌పిఏలు అలవికాని మేరకు పెరిగిపోవడంతో ఆర్‌బిఐ బిగించడానికి నిశ్చయించుకుంది. ఫిబ్రవరిలో ఒక సర్క్యులర్‌ జారీ చేసి, ఎన్‌పిఏలను వర్గీకరించింది. ఫలితంగా ఒకటి రెండు బ్యాంకులు తప్పించి తక్కినవన్నీ ప్రమాదకర పరిస్థితుల్లో పడ్డాయని ప్రభుత్వం ఫిర్యాదు. బ్యాంకులకు భారీగా బకాయి ఉన్న 12 పెద్ద సంస్థలపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత బ్యాంకులకు స్పష్టమైన సంకేతాలు యిచ్చింది. ఇలా ఆర్‌బిఐ బ్యాంకులపై ఆంక్షలు విధించి, వారిలో క్రమశిక్షణ తేవాలని చూస్తోంది. అది మోదీ సర్కారుకి నచ్చటం లేదు. ఎందుకంటే యిది ఎన్నికల సంవత్సరం. జనాల చేతిలో డబ్బు ఆడుతూంటేనే అంతా బాగుంది అనే అభిప్రాయం కలిగి ప్రభుత్వ వ్యతిరేకత తగ్గుతుంది. బ్యాంకుల చేతులు కట్టేస్తే ఋణాలు మంజూరు కావు, డబ్బు బయటకు రాదు. అందువలన 'ఆర్‌బిఐ యిన్నాళ్లూ కళ్లు మూసుకుని కూర్చుని, యిప్పుడు మేలుకుని అన్నీ ఆపేస్తే ఎలా?' అని ఆర్థికమంత్రి మండిపడుతున్నాడు.

అలాగే వడ్డీ రేట్లు తగ్గించి, చిన్న తరహా ఋణాలు భారీగా యిప్పించి, కొన్ని రంగాల అప్పులు రద్దు చేయించి, ఎలాగైనా జనంలోకి డబ్బు అప్పురూపేణా ప్రవహింప చేయాలని మోదీ సర్కారు తాపత్రయం. కానీ ఊర్జిత్‌ పటేల్‌ ససేమిరా అంటున్నాడు. దాంతో సర్కారు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రూ.3.16 లక్షల కోట్ల ఋణాలను రద్దు చేయించేసింది. బ్యాంకుల నిల్వలు తగ్గిపోవడంతో తన ఖజానాలోంచి 2.11 లక్షల కోట్లు రీకాపిటలైజేషన్‌ పేరుతో యిచ్చేసింది. ఇప్పుడు ఆ మొత్తాన్నీ ఆర్‌బిఐ దాచుకున్న నిధుల నుంచి లాక్కుందామని చూస్తోంది. దానికి ఊర్జిత్‌ అస్సలు ఒప్పుకోలేదు. 

ఇక ప్రభుత్వం భగభగ మండిపోయి, సెక్షన్‌ 7 అమలు చేసి, ఆర్‌బిఐను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూస్తోంది. సెక్షన్‌ 7 (1) ప్రకారం ప్రభుత్వం ఆర్‌బిఐకు ఆదేశాలివ్వవచ్చు. అయితే దానికి ముందు ఆర్‌బిఐ గవర్నరుతో సంప్రదింపులు జరపాలి. ఆయన ఒప్పుకోకపోతే సెక్షన్‌ 7 (2) ప్రకారం ప్రభుత్వం డిప్యూటీ గవర్నర్లను, డైరక్టర్లను, ఆఖరికి గవర్నరును కూడా మార్చేయవచ్చు. ఇలా బెదిరించి తనను లొంగదీసుకోవాలని చూస్తున్న ప్రభుత్వంపై ఊర్జిత్‌కు విసుగు పుట్టింది. సెక్షన్‌ 7 అమలు చేస్తారన్న పుకారు రాగానే ఆయన రాజీనామా చేస్తాడన్న పుకారు కూడా పుట్టింది. ఐఎంఎఫ్‌ కూడా కంగారు పడి ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే కేంద్ర బ్యాంకు స్వయంప్రతిపత్తితో రాజీ పడడాన్ని తాము అనుమతించబోమని తెలిపింది. దాంతో ప్రభుత్వం కాస్త తమాయించింది. 

ఇదీ స్థూలంగా జరిగిన విషయం. మనమందరం రూల్సు పాటించాలని లెక్చర్లిస్తాం. కానీ మనకు ఎమర్జన్సీ వచ్చిందనుకోండి, రెడ్‌ లైటు ఉన్నపుడు కూడా ఆగకుండా వెళదామని చూస్తాం. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ రూల్సు వల్లిస్తే కోపగించుకుంటాం. 'మామూలుగా పట్టించుకోవు కానీ నా దగ్గరకు వచ్చేసరికే అన్నీ రూల్సు చెప్తావ్‌' అని వాదిస్తాం. మోదీ సర్కారు యిప్పుడు అదే చేస్తోంది.

ఆర్‌బిఐ బ్యాంకులకు క్రమశిక్షణ గరపుతానంటే 'యుపిఏ హయాంలో యిదేం చేయలేదు కానీ, యిప్పుడు చేస్తానంటావా?' అని గద్దిస్తోంది. బ్యాంకులిచ్చే ఋణాలు ఏడాదికి సగటున 14% ఉంటాయని, కానీ యుపిఏ హయాంలో ఓ ఏడాది 31%కి ఎగబాకిందని, అప్పుడు ఆర్‌బిఐ ఎందుకు అడ్డుపడలేదని అడిగిన అరుణ్‌ జేట్లే మొన్నటికి మొన్న నవంబరు 11 న 'బ్యాంకులు భారీగా ఋణాలు యివ్వాలి' అంటూ స్టేటుమెంటు యిచ్చాడు. గత ఏడాది ఋణవితరణ 14%కు మించే ఉంది. ఇంకెంత యివ్వాలో మరి! ఋణాల వసూలు గురించి మాట్లాడటం లేదు. ఆర్‌బిఐ నుంచి నిధుల లాగేసుకుంటున్నారనే దానిపై విపరీతంగా విమర్శలు రావడంతో 'అబ్బే అదేం లేదు' అని కూడా అంటోంది ఆర్థికశాఖ. అంతిమంగా ఏం జరుగుతుందో తెలియదు కానీ యీ వివాదం ఎలా వచ్చిందో కాస్త వివరంగా చెప్పాలంటే -

నీరవ్‌ మోదీ వ్యవహారంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఆడిటింగ్‌, పర్యవేక్షణ విషయాల్లో లోపం కొట్టవచ్చినట్లు కనబడింది. నీరవ్‌ మోదీకి, నరేంద్ర మోదీకి లింకు కట్టి ప్రతిపక్షాలు విమర్శించడంతో అరుణ్‌ జేట్లే 'ఆర్‌బిఐ ఏం చేస్తోంది?' అంటూ సెటైర్లు వేశాడు. దాంతో ఊర్జిత్‌ నట్లు బిగించడం మొదలుపెట్టాడు. ఆర్‌బిఐ పర్యవేక్షణ స్థాయి పెంచి, కంట్రోలు పెంచింది. ఎన్‌పిఏల పరిష్కారానికి ప్రభుత్వం బ్యాంకు విలీనాలను నమ్ముకుంది. దాన్ని ఆపే హక్కు ఆర్‌బిఐకు లేదు. 'విలీనాలతో ఎన్‌పిఏ సమస్య తీరదు. పర్యవేక్షణ మెరుగుపరచనిదే అది తీరదు.' అంటూ ఆర్‌బిఐ 'ప్రాంప్ట్‌ కరక్టివ్‌ ఏక్షన్‌' (పిసిఏ) ఫ్రేమ్‌వర్క్‌ను బాగా కఠినం చేసింది. గతంలో పిసిఏను ఎవరూ గట్టిగా ఉపయోగించలేదు. ప్రైవేటు సెక్టారు బ్యాంకుల విషయంలో అనేక మంది సిఈఓల పదవీకాలాన్ని పెంచనివ్వలేదు. వాళ్లని పంపించేసేటప్పుడు మూటలు కట్టి యిస్తామంటే, యివ్వకుండా ఫ్రీజ్‌ చేసింది. 

పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల విషయంలో ద్రవ్యసంక్షోభాన్ని ఎదుర్కునేందుకు గాను 1.30 లక్షల కోట్ల తాత్కాలిక ఋణ సౌకర్యం యిస్తూనే, మరో పక్క కఠినతరమైన సత్వర దిద్దుబాటు చర్యలు (పిసిఎ)ను ప్రయోగించి, మొత్తం 21 కమ్మర్షియల్‌ బ్యాంకుల్లో 11 బ్యాంకుల డిపాజిట్లను ఆర్‌బిఐ తన దగ్గర పెట్టుకుంది. ఇది ప్రభుత్వానికి యిష్టం లేదు. అందువలన ఆ డిపాజిట్లను రిలీజ్‌ చేయాలని ఆర్‌బిఐ బోర్డులో తను నియమించిన డైరక్టర్ల ద్వారా ఊర్జిత్‌పై ఒత్తిడి తెస్తోంది. ఆయన ఊహూ అంటున్నాడు. విద్యుత్‌ రంగంలోని మొండి బకాయిలను ఆర్‌బిఐ సహకారంతో దివాలా ప్రక్రియ నుంచి బయటపడేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలా చేస్తే తక్కిన రంగాల్లోని పారిశ్రామిక వేత్తలు కూడా అలాటి వెసులుబాటు కోరతారు కదాని ఆర్‌బిఐ వాదన.  

పిపిపి (ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్య ప్రాజెక్టులకు నిధులందించే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రూ. 90 వేల కోట్ల అప్పుల్లో మునిగి, కుప్పకూలింది. దాని ప్రభావం ఆ ప్రాజెక్టులపై పడడంతో బాటు, ఎన్‌బిఎఫ్‌సి (నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ)లపై పడి, వాటికీ నిధులు అందకుండా పోయాయి. వాణిజ్య బ్యాంకులకు బాకీ పడ్డప్పుడు వ్యాపారస్తులు వీళ్ల దగ్గర్నుంచి అప్పు తీసుకుని వాళ్లకు కట్టేసేవారు. ఇప్పుడు యివి కూడా చేతులెత్తేయడంతో మార్కెట్లో అనేక రంగాలకు డబ్బు టైట్‌ అయిపోయింది. ఎన్నికల సంవత్సరంలో యిది ప్రభుత్వానికి దెబ్బ కొడుతుంది, అందుకే నియమాలన్నీ సడలించి, ఎన్‌బిఎఫ్‌సిలకు నగదు యివ్వమని ప్రభుత్వం పట్టు, ఆర్‌బిఐ ఒప్పుకోవటం లేదు. 

ఈ లోగా ప్రభుత్వం సెప్టెంబరులో ఎకనమిక్స్‌ ఎఫయిర్స్‌ విభాగంలో సెక్రటరీగా ఉన్న సుభాష్‌ గర్గ్‌ (ప్రస్తుతం విరాళ్‌ ఆచార్యను తిడుతున్న ఆర్‌బిఐ డైరక్టరు) నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. పేమెంట్‌ రెగ్యులేటరీ బోర్డు అనే స్వతంత్ర నియంత్రణ సంస్థను  ఏర్పాటు చేసి ఈ-వాలెట్లు, కార్డులు ద్వారా జరుగుతున్న చెల్లింపులను దాని అధీనంలో ఉంచాలని, అలా అయితే అది ఆర్‌బిఐతో పోటీ పడి పనిచేస్తుందని, కస్టమర్లకు భద్రత, వ్యవస్థకు స్థిరత్వం కల్పిస్తుందని సిఫార్సు చేసింది. అది ఆర్‌బిఐకు నచ్చలేదు. వ్యాపార వర్గాల ఒత్తిడికి లొంగి ప్రభుత్వం తమ అధికారాలను నీరుగారుస్తోందని ఆర్‌బిఐ అభిప్రాయం. అందువలన పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ యాక్ట్‌, 2007కు చేయ తలపెడుతున్న మార్పులు బాగా లేవని, పేమెంట్స్‌ రెగ్యులేటరీ బోర్డు ఏర్పడితే అది ఆర్‌బిఐ గవర్నరు పరిధిలోనే ఉండాలనీ తన వెబ్‌సైట్‌లో పెట్టింది.

లిక్విడిటీ సమస్యను పరిష్కరించడంలో ఆర్‌బిఐ విఫలమైందనే విమర్శతో దాన్ని తన అజమాయిషీ కింద తీసుకోవాలని భావిస్తున్న ఆర్థిక శాఖ మరి తన వైఫల్యాల కారణంగా ఎవరి అజమాయిషీ కోరుకుంటోంది? బజెట్‌లో అంచనాలకు, వాస్తవాలకు పొంతన ఉండటం లేదు. నోట్ల రద్దు ద్వారా బ్లాక్‌ మనీ అరికడతామని, జిఎస్‌టి ద్వారా ఆర్థిక వికాసాన్ని కలిగిస్తామని చెప్పారు, కానీ అవేమీ జరగలేదు. దానికి ఎవరైనా జవాబుదారీ వహించి తమపై మరో రెగ్యులేటరును అనుమతిస్తారా? (ఫోటో - విరాళ్‌ ఆచార్య, ఇన్‌సెట్‌ గురుమూర్తి) (సశేషం) 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2018)
mbsprasad@gmail.com

ఎమ్బీయస్‌: ఆర్‌బిఐ - ఆర్థికశాఖ రగడ - 2/2

Show comments