ఐక్యరాజ్యసమితిలో ఆవు కథ చెప్పిన చంద్రబాబు

అవు కథపై ట్రేడ్ మార్క్ జోక్ ఒకటుంది. దీని గురించి అందరికి తెలిసిందే. ఏ టాపిక్ గురించి అడిగినా చుట్టుతిరిగి మళ్లీ ఆవు గురించే చెప్పే జోక్ అది. ఎందుకంటే అతడికి ఆవు గురించి తప్ప మరో మేటర్ తెలీదు. అందుకే దీనిని అవు కథ అంటారు. సరిగ్గా ఇలాంటి 'ఆవుకథ'నే ఐక్యరాజ్యసమితిలో వినిపించారు చంద్రబాబు. 

ప్రకృతి వ్యవసాయం.. జీరో బడ్జెట్ సేద్యం.. చెప్పుకోడానికి ఈ రెండు పదాలు చాలా బాగున్నాయి. చంద్రబాబుకు కూడా ఈ రెండు పేర్లే నచ్చినట్టున్నాయి. అందుకే వీటి చుట్టూనే ప్రసంగం అల్లుకున్నారు. అలాఅని వీటి గురించి చెప్పేంత స్టఫ్ బాబు దగ్గర లేదు. అందుకే మరోసారి తన దగ్గరున్న పాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నే మార్చి కొత్తగా వినిపించారు. 

"ఏపీకి పొడవైన తీరరేఖ ఉంది. ఐటీని రెండు దశాబ్దాలుగా ప్రమోట్ చేసింది నేనే. 60శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయానికి ఏపీ హబ్ గా మారింది. మేం ప్రపంచానికి ఆదర్శంగా మారాం. ప్రకృతి వ్యవసాయం చేస్తే ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుంది. టెక్నాలజీని, ప్రకృతిని కలిపి అద్భుతాలు సాధించవచ్చు. ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు ఏపీ నుంచే వస్తున్నారు."

ఇలా సాగింది చంద్రబాబు ప్రసంగం. ప్రతిది నేనే చేశానని చెప్పే ఊకదంపుడు ప్రసంగం తప్పిస్తే అందులో పనికొచ్చే విషయం, ప్రపంచానికి ఏపీ ఎందుకు ఆదర్శం అనే విషయాన్ని పైపైన టచ్ చేసి వదిలేశారు బాబు. ఆవు మూత్రం, పేడ ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం చేస్తామన్నారు తప్ప, అది ఎలా అమలవుతుందో చెప్పలేదు. జీరో బడ్జెట్ సేద్యం గురించి ప్రస్తావించారు తప్ప, రాష్ట్రంలో అది ఎలా అమలవుతుందో బాబు చెప్పలేదు. 

నిజానికి చంద్రబాబు ఇంతకంటే చెప్పేది కూడా ఏం లేదు. జీరో బడ్జెట్ సేద్యం అని ఘనంగా చెప్పారు బాబు. కానీ ఏపీలో జరిగింది మాత్రం జీరో రుణమాఫీ. ప్రకృతి సేద్యం అనే పదాన్ని విచ్చలవిడిగా వాడారు. కానీ దాని విధివిధానాల్ని ఆయన చెప్పలేరు. మితిమీరిన ఎరువుల వాడకంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని భూములు ఎలా నిర్వీర్వం అయ్యాయో అందరికీ తెలుసు. ఎరువుల అతివాడకం, నకిలీ విత్తనాలు, కత్తి ఎరువుల్ని నిరోధించలేని బాబు.. ప్రకృతి వ్యవసాయం గురించి ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడగలరు.

ఓవరాల్ గా జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (ZBNF) మూల సూత్రాలంటూ చంద్రబాబు చెప్పినవి, వందల ఏళ్ల నుంచి మన పూర్వీకులు పాటిస్తున్న వ్యవసాయ పద్ధతులే. వీటినే తను కనిబెట్టినట్టు, రాష్ట్రంలో విస్తారంగా అమలు చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పుకున్నారు. ఈ మాత్రం దానికి బాబు టార్గెట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. రెండేళ్లలో 30శాతం, ఐదేళ్లలో వందశాతం వ్యవసాయ భూమిని ZBNF కిందకు తీసుకొచ్చేస్తానని, ఐరాస పెద్దల ముందు గొప్పలు చెప్పారు. 

ఏపీలో ఒక డాలర్ పెట్టుబడి పెడితే, 13 డాలర్లు వస్తాయని మధ్యమధ్యలో లెక్కలు చెప్పిన చంద్రబాబు.. టెక్నాలజీని, ప్రకృతిని కలిపేస్తున్నానంటూ తనదైన ఇంగ్లిష్ లో డైలాగులు కొట్టారు. అరుదైన అవకాశం అంటూ ఇటు చంద్రబాబు, అటు టీడీపీ వర్గాలు గొప్పగా చెప్పుకుంటున్న ఈ సమావేశాన్ని బాబు ఇలా పూర్తిగా నీరుగార్చారు.

Show comments