మామ, బేబి మధ్యలో నేను

వచ్చేనెల ఏడోతేదీకి సమంత, అక్కినేని కోడలిగా మారి ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆమె ఎన్నో కొత్త అనుభూతులు చవిచూసింది. సమంతగా కాకుండా, అక్కినేని కోడలు అనే సరికొత్త ఇమేజ్ ను, ఇంకెంతో బాధ్యతను అందుకుంది. నాగచైతన్యను పెళ్లాడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కొన్ని వ్యక్తిగత విషయాల్ని ప్రేక్షకులతో పంచుకుంది. 

"అప్పుడే ఏడాది అయిపోతుందంటే నమ్మలేకపోతున్నాను. నిన్ననే చైతూతో పెళ్లయినట్టు ఉంది. చైతూను ఇంట్లో బేబి అని పిలుస్తాను. తను కూడా నన్ను బేబి అనే పిలుస్తాడు. తెలుగు, తమిళ భాషలు రెండూ ఇంట్లో మాట్లాడం. ఇద్దరం ఇంగ్లిష్ లోనే మాట్లాడుకుంటాం. ఎందుకో అది మొదట్నుంచి అలవాటు అయిపోయింది."

ఇలా తన వ్యక్తిగతానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర వివరాల్ని షేర్ చేసుకుంది సమంత. ఇక మామగారి గురించి చెబుతూ, నాగార్జునను తను ఇంట్లో మామ అని పిలుస్తానని, బయట మాత్రం నాగ్ సర్ అని పిలుస్తానని చెప్పుకొచ్చింది. నాగార్జున అనే చెట్టు నీడ కింద చల్లగా ఉన్నానని, ఓ అమ్మాయికి ఇంతకంటే భరోసా ఇంకేం కావాలంటోంది సమంత. 

"మామ గురించి నేను మాటల్లో చెప్పలేను. నేను ఆశించిన దానికంటే వంద రెట్లు ఎక్కువ మంచిగా చూసుకుంటున్నారు. ఎంత సపోర్ట్ అందిస్తున్నారో మాటల్లో చెప్పలేను. ప్రతి విషయంలో ఓ ఫ్రెండ్ లా సపోర్ట్ చేస్తారు. ఎన్నో మంచి మంచి సలహాలు ఇస్తుంటారు."

తొలి వివాహ వార్షికోత్సవ వివరాల్ని మాత్రం బయటపెట్టలేదు సమంత. ప్రస్తుతం చైతూ, తను తమతమ సినిమాల విజయాల్ని ఆస్వాదిస్తున్నామని చెప్పింది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, వీళ్లిద్దరికీ ఎంతో ఇష్టమైన గోవా వెళ్లి ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయింది ఈ జంట. వీళ్ల పెళ్లి కూడా గోవాలోనే జరిగింది.

Show comments