తప్పదు.. హరీష్‌రావుకి వేరే ఛాన్స్‌ లేదు.!

రికార్డ్‌ స్థాయి మెజార్టీపై కన్నేసిన హరీష్‌రావు, రాజకీయాలపై ఒకింత వైరాగ్యం ప్రదర్శించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించారు. అయితే, ఇది 'భావేద్వగం' ఎక్కువైపోయి ఆయన నోట వచ్చినమాట తప్ప, ఇందులో వైరాగ్యం ఏమీలేదని టీఆర్‌ఎస్‌ నేతలు ఒకరొకరుగా హరీష్‌రావు వ్యాఖ్యల్ని 'కవరింగ్‌' చేసుకుంటూ వెళుతున్నారు. ఇంతకీ, హరీష్‌రావు ఎందుకలా వ్యాఖ్యానించారట.? 

'ఇంత ఆదరణ వున్నప్పుడే రాజకీయాల్లోంచి తప్పుకోవడం మంచిది..' అన్నది ఆయనగారి ఉవాచ. సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్‌రావుకి తిరుగులేదు. తెలంగాణలో ఏ నియోజకవర్గాన్ని తీసుకున్నాసరే.. సిద్ధిపేట నియోజకవర్గమే మిగతా అన్నింటికన్నా ప్రత్యేకమైనది. అక్కడ తమ ఎమ్మెల్యేని ఆరాధించే ప్రజలెక్కువ. ఈసారి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామంటూ ప్రజలే స్వచ్ఛందంగా హరీష్‌రావుకి 'జేజేలు' పలుకుతున్నారు. దేశ రాజకీయాల్లో చాలా అరుదుగా కన్పించే పరిస్థితి ఇది. 

ఇంతటి ప్రత్యేకమైన పరిస్థితుల్ని ప్రత్యక్షంగా చూస్తోన్న హరీష్‌రావు, అమితమైన ఆనందం పొందడం మామూలే. ఆ ఆనందం ఎక్కువైపోయి, కాస్తంత భావోద్వేగానికి గురై రాజకీయాల్లో ఎలాంటి మచ్చా పడకుండా వుండాలంటే, ఇంతటి ఫాలోయింగ్‌ వున్నప్పుడే రాజకీయాల్లోంచి తప్పుకోవడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేయడాన్ని తప్పుపట్టలేం. కానీ, అదొక్కటే హరీష్‌ వ్యాఖ్యలకు కారణం కాదన్నది ఓపెన్‌ సీక్రెట్‌. నిజానికి హరీష్‌రావుని పార్లమెంటుకి పంపేందుకు ప్రయత్నాలు చాలా చాలా గట్టిగా జరిగాయి కేసీఆర్‌ కుటుంబం నుంచే. అయితే పరిస్థితులు వికటిస్తాయని, పునరాలోచనలో పడింది కేసీఆర్‌ కుటుంబం. 

అసెంబ్లీకి కేటీఆర్‌తో పాటు కవిత కూడా పోటీ చేయాలని భావించారు. దానికి కేసీఆర్‌ కూడా సూత్రప్రాయంగా అంగీకరించారన్న ప్రచారం జరిగింది. హరీష్‌రావుని పార్లమెంటుకు పంపితే ప్రమోషన్‌ ఇచ్చినట్లుంటుంది, రాష్ట్ర రాజకీయాలకు దూరం చేసినట్లవుతుందనే భావనతోనే ఈ రాజకీయం నడిచింది. అది హరీష్‌కి తెలియకుండా వుంటుందా.? గ్రేటర్‌ ఎన్నికల వ్యవహారం కావొచ్చు, మొన్నీమధ్యన టీఆర్‌ఎస్‌ నిర్వహించిన ప్రగతి నివేదన సభ వ్యవహారం కావొచ్చు.. వాటిల్లో హరీష్‌ పాత్రని తక్కువ చేయడం వెనుక నడిచిన రాజకీయం అంతా ఇంతా కాదు. 

మళ్ళీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే హరీష్‌కి ఇంకోసారి మంత్రి అవడమూ వింతేమీ కాదు. కానీ, ప్రాధాన్యతగల శాఖ దక్కుతుందా.? అన్నది మాత్రం మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. ఇవన్నీ హరీష్‌ మనసులో వున్నాయి. కుట్ర రాజకీయాల్ని ఆయన ప్రస్తావించలేని పరిస్థితి. ఎందుకంటే, ఆ కుట్ర జరుగుతున్నది కేసీఆర్‌ కుటుంబం ద్వారానే కాబట్టి. పైకి ఆ కుట్రల గురించి చెప్పలేక, లోలోపల మదనపడ్తున్న హరీష్‌రావు నోట ఇలాంటి మాటలే వస్తాయి మరి.

Show comments