105 నియోజకవర్గాల్లో సర్వే...!

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎప్పుడు ఎలాంటి అనూహ్య నిర్ణయం తీసుకుంటారో ఎవరూ ఊహించలేరు. తాజాగా ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పార్టీలో అసమ్మతిని అరికట్టేందుకు, ప్రతిపక్షాలు నిలబెట్టే అభ్యర్థులపై మరింత బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకుగాను సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలు ప్రకటించిన రోజునే 105 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు.

ఈ జాబితాలోని కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి ప్రబలింది. అలాగే ఈ జాబితాలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలు ఎలాంటి అభ్యర్థులను నిలబెడతాయో చూసుకొని, వారికి దీటైన అభ్యర్థులను నిలబెట్టాలని అనుకుంటున్నారు. అందుకే ఈ నియోజకవర్గాల్లో సర్వే చేయబోతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్లు రానివారు అధికార పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబెల్స్‌గా పోటీ చేస్తామంటున్నారు. టిక్కెట్లు రాని కొందరు తాము మద్దతుదారులతో హైదరాబాదుకు వచ్చి బలం నిరూపించుకుంటామంటున్నారు.

అసమ్మతి నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 105 నియోజకవర్గాల నుంచి తనకు అందుతున్న సమాచారాన్ని విశ్లేషించకుంటున్న కేసీఆర్‌ ఈ అభ్యర్థుల్లో గెలుపు అవకాశాలు ఉన్నవారి గురించి మళ్లీ మదింపు చేస్తున్నారు. ఈ జాబితాలోని అభ్యర్థులే ఫైనల్‌ కాదని, మార్పులు చేసే అవకాశం ఉందని అభ్యర్థులకు సంకేతాలు ఇచ్చారు. 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పుడు వెంటనే నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేసుకోవాలని చెప్పిన కేసీఆర్‌ అవసరమైతే జాబితాలో మార్పులు చేసేందుకు విముఖంగా లేరు.

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ కొలాన్‌ హన్మంతరెడ్డికి టిక్కెట్‌ ఇవ్వలేదు. ఇతను గత ఎన్నికల్లో టీడీపీ చేతిలో ఓడిపోయాడు. అప్పుడు టీడీపీ తరపున గెలిచిన కేపీ వివేకానందకు టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఇవ్వడంతో హన్మంతరెడ్డి తిరుగుబాటు జెండా ఎగరేశాడు. తాను రెబెల్‌గా నిలబడి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడిస్తానంటున్నాడు. ఇలా తిరుగుబాట్లు జరుగుతున్న నియోజకవర్గాలు ఇంకా ఉన్నాయి. వీటిగురించి కేసీఆర్‌ ఆలోచిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో రెబెల్స్‌ లేనేలేరని కేటీఆర్‌ ఓ పత్రికకు చెప్పారు. కాని అది వాస్తవం కాదు. చాలా నియోజకవర్గాల్లో ఈ బెడద ఉంది.

టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు తిరుగుబాటు అభ్యర్థి రవీందర్‌ రెడ్డి సవాల్‌ విసురుతున్నాడు. జనగామ, మహబూబాబాద్‌లో ఈ సమస్య ఉందని చెబుతున్నారు. అసమ్మతివాదుల వాదనను కేసీఆర్‌ పరిగణనలోకి తీసుకోకపోతే చిక్కులు ఎదుర్కోవల్సివస్తుందని కొందరు నేతలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో టిక్కెట్లు రానివారు ఆగ్రహించడం, తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేయడానికి తయారుకావడం అన్ని పార్టీల్లో ఉన్న సమస్యే. ఇందుకు టీఆర్‌ఎస్‌ అతీతంకాదు.

Show comments