పవన్‌ ఆర్థిక సంక్షోభంలో ఉన్నాడా?

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ స్టార్‌డమ్‌ ఉచ్ఛస్థితిలో ఉండగానే అంతా వదులుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. జనసేన పార్టీ స్థాపించాడు. పార్టీ ఎలా ఉందనే విషయం అలావుంచితే, ప్రస్తుతం ఆయన తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. హీరోగా అత్యంత ఆడంబర జీవితం గడిపిన పవన్‌ ఇప్పుడు చాలా నిరాడంబరంగా ఉన్నాడు. అప్పటి హీరో పవన్‌కు, ఇప్పటి రాజకీయ నాయకుడు పవన్‌కు పోలికలేదు.

ఒకప్పుడు ఏడు నక్షత్రాల హోటళ్లలో బస చేసిన పవన్‌ ఇప్పుడు తన పోరాటయాత్రలో కళ్యాణ మండపాల్లో, సత్రాల్లో బస చేస్తున్నాడు. ఒకప్పుడు ప్రయివేట్‌ జెట్‌ విమానాల్లో తిరిగిన ఈ హీరో ఇప్పుడు కార్లలో రోడ్డు మార్గాన ప్రయాణిస్తున్నాడు. ఆర్థిక బాధలంటే ఏమిటో తెలియని పవర్‌స్టార్‌ ఇప్పుడు ఆర్థిక పాఠాలు నేర్చుకుంటున్నాడట. చేతిలో నిధులు లేకపోవడంవల్లనే ఆయన పోరాటయాత్రకు నెలకు పైగా విరామం వచ్చింది.

ఆర్థిక సంక్షోభానికి తోడు మధ్యలో కంటి ఆపరేషన్‌ జరిగి యాత్ర మరింత ఆలస్యమైంది. పవన్‌ భారీ మొత్తాల్లో విరాళాలు స్వీకరించడంలేదని తెలుస్తోంది. ఆర్థిక సంక్షోభానికి ఇది ప్రధాన కారణంగా జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్‌ ఈ విధంగా వ్యవహరిస్తే పార్టీని నడపడం కష్టమంటున్నారు. సినిమాల్లో తాను సంపాదించినదంతా గత మూడేళ్లలో పార్టీకే ఖర్చుపెట్టాడని చెబుతున్నారు. పవన్‌ చేస్తున్న పోరాటయాత్ర ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

దీనికి రోజుకు ఐదులక్షలు ఖర్చవుతున్నాయి. రవాణా, బస, ఆహారం మొదలైన ఖర్చులన్నీ కలుపుకొని అదిరిపోతోందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది అంతా కలుపుకొని 160 మంది వరకు ఉన్నారు. వీరందరికీ జీతాలు చెల్లించాలి. ఇతర ఖర్చులు బోలెడు ఉన్నాయి. ఈయన ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చే విరాళాలు మాత్రమే ఆమోదిస్తున్నాడు. భారీ మొత్తాలను స్వీకరించడంలేదు.

ఏవో ఆశలతో, అంచనాలతో భారీ మొత్తాలు ఇవ్వబోతే తిరస్కరిస్తున్నాడు. ప్రజలు ఇచ్చే చిన్న విరాళాలు స్వీకరిస్తున్నాడు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పడంలేదు. ఈ కాలంలో రాజకీయ పార్టీని నడపడమంటే మాటలుకాదు. ప్రజాసేవ సంగతి తరువాత. ముందు ఆర్థికంగా బలంగా ఉంటేనే ఏదైనా చేయడం సాధ్యం. పార్టీ పెట్టేముందు పవన్‌ ఆర్థిక విషయాలు ఆలోచించలేదా? కేవలం ఆవేశంతో పార్టీ ప్రారంభించాడా? పవన్‌కు అనేక ఆదర్శాలు ఉండొచ్చు. ఉండాలి కూడా.

కాని అదే సమయంలో ఆర్థికంగా బలంగా లేకుంటే పార్టీని నడపడం కష్టమనే సంగతి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. టీడీపీ, టీఆర్‌ఎస్‌ సహా అనేక పార్టీలు ఆర్థికంగా బలంగా ఉన్నాయి. పేదల పార్టీలుగా చెప్పుకునే ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నాయి. త్వరలో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడకుంటే పాతికేళ్లు రాజకీయాల్లో ఉంటానని ఆయన చెప్పింది వాస్తవరూపం దాల్చదు. కాలానికి తగినట్లు పవన్‌ మారాలి.

Show comments