రాహుల్ సభ.. చప్పగా, టీడీపీతో బంధం!

ఏపీలో రాహుల్ గాంధీ సభ పరమ రొటీన్‌గా.. చాలా చప్పగా సాగింది. రాహుల్ తన ప్రసంగంలో ఈ మధ్య కాలంలో చెబుతున్న విషయాలను ఏకరువు పెట్టాడు. అందులో కూడా.. జాతీయ అంశాలనే రాహుల్ మాట్లాడాడు. స్థానిక సమస్యల ఊసే ఎత్తలేదు. ఒక్క ప్రత్యేకహోదా అంశం మాత్రమే ప్రస్తావించాడు. తమకు అధికారం ఇస్తే హోదా అని రాహుల్ అంటున్నాడు. అయితే ఈ విషయంపై ఏపీ ప్రజలకు నమ్మకం కలుగుతుందా? అనేది సందేహమే.

ఆ సంగతలా ఉంటే.. రాహుల్ ఏపీ ప్రభుత్వాన్ని కానీ, అధికార తెలుగుదేశం పార్టీని కానీ ఒక్కమాట కూడా అనకపోవడం విశేషం. సాధారణంగా జాతీయపార్టీ నేతలు వచ్చినప్పుడు.. కేవలం నేషన‌ల్ లెవల్లో అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడమే కాదు, స్థానిక ప్రభుత్వాలను కూడా కడిగేస్తూ ఉంటారు. లెక్క ప్రకారం చేస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంది. కాబట్టి ఏపీలో స్థానిక సమస్యలను ప్రస్తావించాల్సిన అవసరం, చంద్రబాబు ప్రభుత్వం తీరుపై స్పందించాల్సిన అవసరం చాలానే ఉంది.

అయితే రాహుల్ మాత్రం ఏపీ ప్రభుత్వం గురించి మాట మాత్రమైనా స్పందించలేదు. ఏపీ రాజధాని, ఇతర అవినీతి వ్యవహారాల ఊసే ఎత్తలేదు. చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న ఆరోపణలకు, బట్టబయలవుతున్న అవినీతి ఏమీ కొదవలేదు. మోడీ అవినీతి పరుడు అంటూ విరుచుకుపడిన రాహుల్.. బాబును మాత్రం ఒక్కమాట అనలేదు.

ఇక రాహుల్ పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ స్పందించిన తీరునుకూడా ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. గతంలో రెండున్నరేళ్ల కిందట రాహుల్ ఏపీకి వస్తే చంద్రబాబు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు. ఎందుకొస్తున్నాడు రాహుల్? అంటూ విరుచుకుపడ్డాడు. తెలుగుదేశం నేతలు కూడా రాహుల్ ను అప్పట్లో తీవ్రంగా విమర్శించారు.

అయితే ఇప్పుడు మాత్రం రాహుల్ సభ గురించి తెలుగుదేశం రియాక్ట్ అయ్యిందే లేదు. అయినా చెట్టాపట్టాలేసుకున్న పార్టీలు ఇంకెందుకు విమర్శించుకుంటాయిలే!

Show comments