హీరో యేస్సాలు వద్దు బాబోయ్-వెన్నెల కిషోర్

ఒకప్పుడు బ్రహ్మానందం స్క్రీన్ మీద కనిపిస్తే చాలు నవ్వులు కురిసేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. వెన్నెల కిషోర్ స్క్రిన్ మీదకు వస్తున్నాడు అని జస్ట్ అనిపిస్తే చాలు నవ్వులతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. వెన్నెల సినిమాతో వచ్చి, వెన్నెల కిషోర్ గా మారిన ఈ తరం ఏస్ కమెడియన్ ఇప్పుడు ఫుల్ బిజీ. ఉదయం ఆరు నుంచి రాత్రి ఏడువరకు షూటింగ్ లే షూటింగ్ లు. ఈ బిజీలోనే శైలజారెడ్డి అల్లుడు ప్రమోషన్లలో కూడా పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగాలోనే వెన్నెల కిషోర్ తో చిన్న చిట్ చాట్.

కంటినిండా నిద్రపోతున్నారా? మేకప్ తీసే టైమ్ వుంటోందా?
ఆ పోదురూ.. మరీ బడాయి. సాయంత్రం ఏడు దాటితే ఖాళీయేగా. బిజీగా వున్నాను. అది ఒప్పుకుంటున్నాను. కానీ మరీ పిచ్చెక్కిపోయేంత కాదు.

అమెరికా నుంచి ఉద్యోగం వదిలి సినిమాల్లోకి వచ్చేటపుడు ఈ స్టేజ్ ను ఊహించారా?
అస్సలు లేదు. అంతెందుకు, వెన్నెల తరువాత ఓ పక్క సినిమాలు చేస్తూనే, మరోపక్క ఇక్కడ పార్ట్ టైమ్ సాప్ట్ వేర్ జాబ్ చేసాను. ఎందుకయినా మంచిది అని. కాస్త ధైర్యం వచ్చిన తరువాత మానేసాను.

ఇప్పుడు ఈ స్టేజ్ కు థాంక్స్ చెప్పాలంటే..
చాలా మందికే చెప్పాలి. ముఖ్యంగా దేవాకట్టా, శ్రీనువైట్ల, ఇంద్రగంటి, ఇలా ఇంకో ఒకరిద్దరికి చెప్పాలి.

ఇంత ఇమేజ్ వచ్చేసింది. ఇంకా హీరో వేషాలు వేయడం లేదేమిటి?
నేను రాఘవేంద్రరావుగారికి మాట ఇచ్చానండి. హీరో వేషాలు వేయనని. కావాలంటే మీకు, లేదా ఎవరికి కావాలంటే వాళ్లకి కూడా రాసి ఇస్తానండీ. హీరో వేషాలు వేయను అని.

మరీ అంతగా భయపడుతున్నారా? జాగ్రత్తనా?
మీరేమన్నా అనుకోండి. ఒకప్పుడు అంటే రాజేంద్రప్రసాద్ గారు కామెడీ హీరోగా వున్న రోజులు వేరు. ఇప్పుడు వేరు.

ఇంతకీ మీకు హీరో ఆఫర్లు వస్తున్నాయా?
అబ్బో.. అలా వచ్చేవాళ్లందరికీ ఒకటే చెబుతున్నా. మీ సినిమాలో ఫుల్ లెంగ్త్ కమెడియన్ రోల్ ఇవ్వండి చేసిపెడతా. వెరెవరినైనా హీరోగా పెట్టుకోండి అని.

వెన్నెల కిషోర్ కు సినిమాలతో పాటు మరేవంటే ఇష్టం?
జనంతో ఇంట్రాక్ట్ కావడం. ఎక్కడ మాంచి పుడ్ దొరికినా వెదుక్కుంటూ వెళ్లి మరీ తినడం.

జనాలతో ఇంట్రాక్ట్.. అందుకోసమేనా ట్విట్టర్ లో అంత యాక్టివ్ గా వుంటారు.
అవునండీ.. నాకు జనాలతో ముచ్చటించడం అంటే సరదా. అందుకే ట్విట్టర్లో కాస్త హుషారుగా వుంటాను.

మరి ఈ మంచి ఫుడ్ కోసం వెదకడం ఏమిటి?
నాకు బేసిక్ గా మాంచి ఫుడ్ అంటే చాలాఇష్టం. ఇంత కష్టపడుతున్నాం? దేనికోసం? ఈ సంపాదన ఎందుకోసం? కడుపునిండా మనకు ఇష్టమైనది తినలేకపోయినపుడు ఇదంతా ఎందుకు? నేను చాలామంది హీరోయిన్లను చూస్తుంటాను. పాపం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతుంటారు. కానీ పాపం కడుపునిండా నచ్చిన ఫుడ్ తినలేరు. నేను మాత్రం ఎక్కడ మంచి వెరైటీ ఫుడ్ దొరుకుందా అని వెదుకుతుంటా. తెలుసుకుంటా. వెళ్లి తింటా.

కొన్ని ఎగ్జాంపుల్స్ వదలండి
చాలా... మీకు తెలుసా, సికిందారాబాద్ ఇసిఐఎల్ పక్క సందులో మష్ రూమ్ ఆమ్లెట్ దొరకుతుంది. సూపర్. కూకట్ పల్లి చట్నీస్ సందులో ఓ మాంచి రెస్టారెంట్ వుంది. కోయంబత్తూర్ నుంచి పోలాచ్చి వెళ్లే దారిలో ఓ దగ్గర అరిటాకులో ఓ ప్రత్యేకమైన బిరియానీ వడ్డిస్తారు. సూపర్.

ఎలా? ఇవన్నీ తెలుసుకున్నారు.
అందర్నీ అడిగి. మీకూ ఏవైనా మాంచి వెరైటీ ఫుడ్ దొరికే ప్లేస్ లు తెలిస్తే చెప్పండి.

కమింగ్ బ్యాక్ టు మూవీస్.. చి.ల.సౌ సినిమాలో నిజంగానే నాలుగు అంతస్తులు ఎక్కేసారా?

నిజం చెప్పనా? ఆ సినిమా కంప్లీట్ గా బడ్జెట్ లో తీసారు. అందుకే నాలుగు అంతస్తులు అయితే బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఒక్క అంతస్తులోనే తీసారు. దాన్నే వేరే వేరే యాంగిల్స్ లో తీసారు. నేను నాలుగు అంతస్తులు ఎక్కినంత హడావుడి చేసా.

మారుతిలో మూడో సినిమా. ఎలా వుండబోతోంది?
హీరో పిఎగా కనిపిస్తాను ఈ సినిమాలో. నాతో పాటు పృధ్వీ కూడా మంచి కామెడీ పండించారు సినిమాలో.

టాలీవుడ్ లో ఏ ప్లేస్ లో ఫిక్స్ కావాలనుకుంటున్నారు.
ఏ ప్లేస్ అని కాదు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిలా ఓ మంచి క్యారెక్టర్ కమ్ కమెడియన్ గా నిలదొక్కుకోవాలన్నది కోరిక.

చాలామంది కమెడియన్లు సీన్లు ఇంప్రూవైజేషన్ లో తమ చాకచక్యం చూపిస్తుంటారు. మీకూ అలాంటి అలవాటు వుందా?
అది డైరక్టర్ ను బట్టి వుంటుంది. కొందరు వారు చెప్పింది చేస్తే చాలు అనుకుంటారు. అక్కడ అలాగే వుంటాం. కొందరు ఇంప్రూవైజ్ చేయండి మీ స్టయిల్ లో అంటారు. అక్కడ అలాగే వుంటా.

మొన్న గూఢచారి, చిలసౌ, గీతగోవిందం హ్యాట్రిక్ కు ముందు వెన్నెలకిషోర్ కు పాత్రలు వున్నాయి కానీ ఫుల్ లెంగ్త్ పాత్రలు తక్కువ. ఇప్పుడు ఇకపై ఆ కొరత తీరుతుందని అనుకోవచ్చా?
అనుకుందాం. నాకు కూడా అలాగే చేయాలని వుంటోంది. మరీ ఐటమ్ కమెడియన్ గా కాకుండా. నా భాషలో చెప్పాలంటే అలా అలా లైట్ లైట్ గా కాదు. ఫుల్ మీల్స్ అన్నమాట.

ఇకపై అలాగే వుంటాయని ఆశిద్దాం.. థాంక్యూ

థాంక్యూ

Show comments