బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. బాబుకు క‌లిసిరాని కాలం!

ఎలాగైనా ఈ ఎన్నిక‌ల్లో గెల‌వాల‌నేది చంద్ర‌బాబునాయుడి ల‌క్ష్యం. బాబుకు వ‌య‌సు పైబ‌డ‌డం, దాదాపు ఇవే చివ‌రి ఎన్నిక‌లు కావ‌డం, వార‌సుడైన లోకేశ్ ఇంత వ‌ర‌కూ నాయ‌క‌త్వ స‌మ‌ర్థ‌త‌ను చాటుకోక‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో ఎన్నిక‌ల్లో గెలుపు ఒక్క‌టే టీడీపీని స‌జీవంగా నిలుపుతుంద‌ని చంద్ర‌బాబు విశ్వ‌సించారు. దీంతో ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఎదుర్కోవ‌డం త‌న ఒక్క‌డి వ‌ల్ల కాద‌ని బాబు ఒక అభిప్రాయానికి వ‌చ్చారు.

ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్నారు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్‌ను ఎదుర్కోగ‌ల‌మ‌నే న‌మ్మ‌కం క‌ల‌గ‌లేదు. వ్య‌వ‌స్థ‌ల స‌హాయం కావాలంటే కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో పొత్తు త‌ప్ప‌నిస‌రి అని ఆయ‌న నిశ్చ‌యించుకున్నారు. ప‌వ‌న్ ద్వారా ప‌లు ద‌ఫాలు బీజేపీతో రాయ‌బారాలు జ‌రిపి, చివ‌రికి పొత్తు పెట్టుకోవ‌డంలో విజ‌యం సాధించారు. కానీ వ్య‌వ‌స్థ‌ల నుంచి త‌గిన స‌హ‌కారం ల‌భించ‌లేద‌నే ఆవేద‌న ముఖ్యంగా టీడీపీ నేత‌ల్లో వుంది.

బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్ల ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్‌రెడ్డి, డీజేపీ రాజేంద్ర‌నాథ్‌రెడ్డి వెంట‌నే మారిపోతార‌ని టీడీపీ ఆశించింది. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఎన్నిక‌ల‌కు కేవ‌లం వారం ముందు మాత్ర‌మే పోలీస్ బాస్ మారిపోయారు. కొత్త‌గా వ‌చ్చిన డీజీపీ హ‌రీశ్ గుప్తా కూడా ప్ర‌భుత్వ అనుకూల అధికారే అని టీడీపీ నేత‌లు అంటున్నారు. ముగ్గురు ఐఏఎస్‌, ఐదారుగురు ఐపీఎస్ అధికారుల‌పై వేటు వేసినా... కొత్త‌గా వ‌చ్చిన వారు కూడా వైసీపీకే అనుకూల‌మ‌నే రాజ‌గురువు ప‌త్రిక శివాలెత్తిన సంగ‌తి తెలిసిందే.

బీజేపీతో పొత్తు వ‌ల్ల రాజ‌కీయంగా టీడీపీకి లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌. టీడీపీకి ముస్లిం, క్రిస్టియ‌న్ మైనార్టీలు పూర్తిగా దూర‌మ‌య్యారు. అలాగే ద‌ళితుల ఓట్లు కూడా ఆశించిన స్థాయిలో ప‌డ‌వ‌ని అంటున్నారు. టీడీపీకి కాలం క‌లిసి రావ‌డం లేద‌నేందుకు కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు చెప్పుకుందాం.

Readmore!

వ‌లంటీర్ల విష‌యంలో టీడీపీ, జ‌న‌సేన కామెంట్స్ కూట‌మిని తీవ్రంగా న‌ష్టం తెచ్చాయి. వ‌లంటీర్ల‌కు రూ.10 వేల గౌర‌వ వేత‌నం ఇస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించినా, వాళ్లంతా జ‌గ‌న్ వైపే నిలిచారు. త‌మ ప‌దవుల‌కు రాజీనామాలు చేసి, వైసీపీకి రాజ‌కీయంగా ప‌ని చేయ‌డానికే మొగ్గు చూపారు. అలాగే నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ ద్వారా ఈసీకి వాలంటీర్ల ద్వారా పింఛ‌న్లు పంపిణీ  చేయ‌నివ్వ‌కుండా బాబు అడ్డుకున్నారు. ఇప్పుడు వాళ్లంతా చంద్ర‌బాబుకు వ్య‌తిరేకుల‌య్యారు.

తాజాగా ముస్లింల రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తామ‌న్న బీజేపీకి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ వంత పాడారు. దీంతో కూట‌మికి మ‌రింత న‌ష్టం కలిగించ‌నుంది. అలాగే వివిధ సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌కు నిధులు జ‌మ కాకుండా ఈసీ ద్వారా కూట‌మి అడ్డు ప‌డింద‌న్న స‌మాచారం జ‌నంలోకి బ‌లంగా వెళ్లింది. దీనిపై వైసీపీ న్యాయ‌పోరాటం చేసి, ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించింది. ఇవాళ రూ. .14,165 కోట్లు చొప్పున రైతులు, విద్యార్థులు, వివిధ ప‌థ‌కాల మ‌హిళా ల‌బ్ధిదారుల ఖాతాలకు జ‌మ కానుంది. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు రెండు రోజుల ముందు ... ఇంత భారీ మొత్తంలో ప్ర‌జ‌ల ఖాతాల్లో ప‌డ‌డం కూట‌మికి షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎల్లో మీడియా, అలాగే కేంద్రంలో బీజేపీని అడ్డు పెట్టుకుని వైసీపీని ఏదో చేయాల‌ని టీడీపీ, జ‌న‌సేన అనేక ర‌కాలుగా కుట్ర‌ల‌కు తెర‌లేపాయి. కానీ కాలం చంద్ర‌బాబుకు క‌లిసి రాలేదు. అందుకే ఎన్నిక‌ల ముంగిట టీడీపీ బొక్క బోర్లా ప‌డ్డ‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే కాలం క‌లిసి రాక‌పోతే, తాడే పామై క‌రుస్తుంద‌నే సామెత‌ గుర్తుకొస్తోంది.

Show comments