గంటాను అంటిపెట్టుకుంటే తంటాయేనా?

మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు నియోజకవర్గాలను మార్చేస్తూ ఉంటారు అని పేరు. అలాగే ఆయన వెంట ఉన్న వారిని సైతం వాడుకుని సైడ్ చేసేస్తారని కూడా మరో పేరు. గంటా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా తన గెలుపు కోసం సాయం చేయమని స్థానిక నేతలను కోరుతారు.

గెలిస్తే వారికి తాను అండగా ఉంటాను అని ప్రామిస్ కూడా చేస్తారట. తీరా గంటా గెలిచాక మాత్రం వారి సంగతిని అసలు ఏ మాత్రం పట్టించుకోరు అన్నది ఆయన మీద ఆరోపణలుగా ఉన్నాయి. ఆయన అనకాపల్లి చోడవరం, విశాఖ ఉత్తరం లలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినపుడు తన కోసం వెంట తిప్పుకున్న వారు అంతా తరువాత కాలంలో ఏమీ కాకుండా పోయారు అని చాలా పేర్లే చెబుతున్నారు.

విశాఖ ఉత్తరంలో గంటా 2019లో పోటీ చేసినపుడు వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఒకరిని గోడ దూకించి మరీ తిప్పుకున్నారని తీరా గెలిచాక ఆయనని వదిలేశారని ఆ తరువాత ఆయన వైసీపీలోకి మళ్లీ వెళ్ళినా ఏమీ కాకుండా పోయారు అని అంటున్నారు. అలాగే ఒక మైనారిటీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అనకాపల్లిలో బలమైన సామాజిక వర్గానికి చెందిన మరో నేత ఇలా చాలా మంది గంటా మార్క్ పాలిటిక్స్ తో కరివేపాకులుగా మారిపోయారు అని ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు.

ఇదంతా ఎందుకు అంటే గంటా రెండవసారి భీమిలీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన 2014 టైం లో వాడేసిన వారు ఇపుడు జాగ్రత్త పడుతున్నారుట. అంతే కాదు గంటా వెంట తిప్పుకుంటున్న వారిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారుట. దీంతో ఈసారి ప్రచారంలో గంటా వెంట చిన్నా చితకా లీడర్లు తప్ప బడా నేతలు అంతగా కనిపించడం లేదు అని అంటున్నారు. దానికి కారణం ఆయన స్వీయ తప్పిదాలే అంటున్నారు.

Readmore!

భీమిలీ ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసి దక్కని ఒక సీనియర్ నేతతో సహా కొందరు ఇపుడు గంటా వెంట తిరిగేందుకు పెద్దగా ముందుకు రావడం లేదు అంటున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఆయన జోరుగా ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. ఈ పరిణామాలతో  గంటా ఈసారి భీమిలీ నుంచి గెలవడం నల్లేరు మీద బండి నడక అయితే కాదు అని అంటున్నారు.

Show comments