కోటలో మోత మోగించిన గీత!

ఆమె ఇంటి పేరులోనే రోషానికి ప్రతీక లాంటి మీసాలు ఉన్నాయి. అసలు కొసరు పేరు కలిపితే ఆమె మీసాల గీత అవుతారు.  ఆమెలో పౌరుషం అలాంటిదే మరి. టీడీపీ నుంచి రెబెల్ ఎమ్మెల్యేగా పోటీలో ఉంది పార్టీ సస్పెండ్ చేసినా ఆమె బెదరలేదు. తన మీద నమ్మకంతో దూకుడుగా విజయనగరం అసెంబ్లీ సీట్లో ప్రచారం చేస్తున్నారు.

గాజు గ్లాస్ గుర్తు ఆమెకు రావడంతో రెట్టించిన ఉత్సాహంలో రేసులో ముందుకు వస్తున్నారు. బుధవారం గీతకు మద్దతుగా  విజయనగరంలో నిర్వహించిన భారీ బైకు ర్యాలీ టీడీపీకి దడ పుట్టించేలా సాగింది. రాజుల కోటలో మోతెక్కించేసింది.

ఈ సందర్భంగా మీసాల గీత మాట్లాడుతూ 2014 నుంచి 2019 దాకా విజయనగరం ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరోసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశమివ్వాలని కోరారు. తాను స్వార్థం కోసం కాకుండా సేవా భావంతో పోటీ చేస్తున్నానని ఆమె చెప్పడం విశేషం.  విజయనగరంలో విద్య వైద్య ఆరోగ్య సౌకర్యాలు కోసం కృషి చేస్తానన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు.

గాజు గ్లాస్ గుర్తు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఆ గుర్తుని ఒక బలమైన సామాజిక వర్గం సొంతం చేసుకున్న నేపధ్యం ఉంది. ఆ సామాజిక వర్గం సంఖ్య విజయనగరం మొత్తం ఓటర్లలో మూడవ వంతు ఉంది. అంటే అక్షరాలా డెబ్బై వేలకు పై చిలుకు ఓటర్లు వారే ఉన్నారు.

Readmore!

వారంతా విజయనగరంలో తమ సామాజిక వర్గం జెండా ఎగరాలని పట్టుబట్టి కూర్చున్నారు. ఇలా ఒక బలమైన చీలిక టీడీపీలోనూ సామాజిక వర్గంలోనూ రావడంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అదితి గజపతిరాజుకు ఇది ఇబ్బందికరంగా మారింది అని అంటున్నారు. ఈ మధ్యలో జరిగే ఓట్ల చీలిక వైసీపీ అభ్యర్ధి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి పూర్తిగా అనుకూలంగా మారుతుందని అంటున్నారు.

Show comments