ఆ మాట చెప్పడం మోడీకే అవమానం!

మోడీ సాగించిన రాజకీయ ప్రసంగం మొత్తం పక్కన పెట్టండి. ఆయన చంద్రబాబునాయుడు ఇచ్చిన స్క్రిప్టును చదివారా? లేదా ఆ స్క్రిప్టు రచయిత మరొకరా? అనేది కూడా మనకు అనవసరం. ఆయన జగన్ ఏయే తిట్లు తిట్టారు.. ఏయే కౌంటర్లు ఇవ్వాలి అనేది కూడా కాసేపు పక్కన పెడదాం. రాజకీయాలన్నీ వొదలేసి కేవలం రాష్ట్ర ప్రయోజనాల  గురించి ఆయన చెప్పిన ఒక్క మాట గురించే మాట్లాడదాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం 15 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని అయినా సరే ఆ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని నరేంద్రమోడీ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అవుతుందని ఆయనే అంటున్నారు. అలాంటి జీవనాడి ప్రాజెక్టుకు పది సంవత్సరాల తన పాలనకాలంలో ముష్టి విదిలించినట్టుగా పదిహేను వేల కోట్లు మాత్రం ఇచ్చి.. అక్కడితో ‘పూర్తిచేయలేదే’ అని నిందిస్తే.. జనం నవ్వుతారని, అలాంటి మాటలు తన పరువు తీస్తాయని మోడీకి అనిపించలేదా? అనేది ప్రజల సందేహం.

అసలు పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత? దాని నిర్మాణానికి సంబంధించిన పూర్తి బాధ్యత ఎవరిది? ఈ విషయాల గురించి మోడీకి అవగాహన ఉన్నదా అనేది ఆలోచించాలి. 50 వేల కోట్ల రూపాయలకంటె అధికంగా అంచనా వ్యయం ఉన్న ప్రాజెక్టు అది.

ఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా రెండు ముక్కలు చేసినప్పుడు.. అవశేష ఆంధ్రప్రదేశ్ కు దక్కిన ఏకైక చెప్పుకోదగ్గ ఎడ్వాంటేజీ పోలవరం ను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం. నిర్వాసితులకు పరిహారం సహా.. ప్రతిరూపాయి కూడా పూర్తిగా కేంద్రమే చెల్లించాలి. అయితే గత పదేళ్లుగా మోడీనే ప్రధానిగా ఉన్నారు. 50 వేల కోట్లకు మించిన బడ్జెట్ అవసరమైన ప్రాజెక్టుకు 15 వేల కోట్లు, అది కూడా పదేళ్ల వ్యవధిలో ఇచ్చానని చెబుతూ, ఆ విషయం తమ చేతగానితనం కిందికి వస్తుందని ఆయన తెలుసుకోలేకపోతున్నారు. ఆ మాత్రం చిల్లర సొమ్ముతో ఆ ప్రాజెక్టు మొత్తం ఎలా పూర్తయిపోతుందని అనుకున్నారో తెలియడం లేదు.

Readmore!

మరో కోణం కూడా గమనించాలి. మోడీ చెబుతున్న 15 వేల కోట్లలో తొలి అయిదేళ్లలో వచ్చినదెంత, జగన్ సీఎం అయ్యాక వచ్చినదెంత? ఆ వివరాలు కూడా ఆయన చెబితే బాగుంటుంది. ప్రాజెక్టు పూర్తి కాలేదంటే.. ఇప్పుడు ఆయన పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు వైఫల్యం ఎంత? ఇప్పుడున్న జగన్ వైఫల్యం ఎంత అనేది కూడా తెలియాలి కదా? ప్రధాని నరేంద్రమోడీ అంతటి స్థాయి గల వ్యక్తి.. ఇలాంటి అబద్ధపు ప్రకటనలతో ప్రజలను దారితప్పించాలని చూడడం, మభ్యపెట్టాలని చూడడం బాగాలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

Show comments