రోజాకు కాదు... జ‌గ‌న్‌కు వెన్నుపోటు!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా న‌గ‌రిలో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం చోటు చేసుకుంది. మంత్రి ఆర్కే రోజాకు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్న వైసీపీ నేత‌లు ఎట్ట‌కేల‌కు పార్టీని వీడారు. టీడీపీలో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇంత వ‌ర‌కూ బాగానే వుంది. అయితే ఇంత‌కాలం వైసీపీలోనే వుంటూ, రోజాకు వ్య‌తిరేక రాజ‌కీయాల‌ను న‌గ‌రిలో చేస్తూ వ‌చ్చారు. త‌ద్వారా వైసీపీలో మ‌రో నాయ‌కుడికి చోటు లేకుండా దెబ్బ‌కొట్టారు.

వైసీపీలో ప‌ద‌వులు అనుభ‌వించి, కీల‌క స‌మ‌యంలో రోజా పేరు సాకుగా చూపి పార్టీని వీడ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. న‌గ‌రికి చెందిన రెడ్డివారి చ‌క్ర‌పాణిరెడ్డికి శ్రీ‌శైలం బోర్డు పాల‌క మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కింది. అలాగే పార్టీ వీడ‌కుండా, ఇప్ప‌టికీ వైసీపీలో ఉంటున్న కేజే కుమార్ దంప‌తుల‌కు కూడా కీల‌క ప‌ద‌వులు ద‌క్కాయి. అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆర్థికంగా రోజా వ్య‌తిరేకులంతా బ‌ల‌ప‌డ్డారు.

వీరికి సొంత పార్టీలోని పెద్ద‌ల అండ ఉంద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు కూడా తెలుసు. కానీ న‌గ‌రి వైసీపీ అస‌మ్మ‌తి నేత‌లంతా తాము వెన్నుపోటు పొడుస్తున్న‌ది జ‌గ‌న్‌కు అని గ్ర‌హిస్తే మంచిది. రోజాను ఓడించ‌డం వ‌ల్ల ఆమెకు వ్య‌క్తిగ‌తంగా క‌లిగే రాజ‌కీయ న‌ష్టం కంటే, వైసీపీ న‌ష్ట‌పోయేదే ఎక్కువ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప్ర‌తి సీటు ముఖ్య‌మైందే. 

ప్ర‌తి అసెంబ్లీ సీటు గెలిస్తేనే మ‌రోసారి వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. రోజాను రాజ‌కీయంగా దెబ్బ తీసే క్ర‌మంలో, ఇంత కాలం అధికారం అనుభ‌వించ‌డానికి కార‌ణ‌మైన వైసీపీకి న‌ష్టం చేస్తున్నామ‌ని గ్ర‌హించాల‌ని ఆ పార్టీ నేత‌లు హిత‌వు చెబుతున్నారు.

Readmore!

చ‌క్ర‌పాణిరెడ్డి, వ‌డ‌మాల‌పేట జెడ్పీటీసీ స‌భ్యుడు ముర‌ళీధ‌ర్‌రెడ్డి త‌దిత‌రులు వైసీపీని వీడి, టీడీపీని గెలిపించ‌డం ద్వారా ఎవ‌రికి ప్ర‌యోజ‌నం క‌లిగించాల‌ని అనుకుంటున్నారో ఆలోచించాల‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

Show comments