బాబు హామీల‌పై జ‌గ‌న్ మాటే నిజం!

చంద్ర‌బాబునాయుడు విశ్వ‌స‌నీయ‌త లేని నాయ‌కుడ‌ని, ఆయ‌న హామీల‌ను న‌మ్మొద్ద‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌దేప‌దే చెబుతున్న మాటే నిజ‌మ‌య్యే ప‌రిస్థితి. ఇంకా అధికారంలోకి రాకుండానే చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ తామిచ్చిన హామీల‌ను అట‌కెక్కించార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. ఇటీవ‌ల చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌లిసి మేనిఫెస్టో ప్ర‌క‌టించారు.

ఈ మేనిఫెస్టోతో త‌మ‌కెలాంటి సంబంధం లేద‌ని బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం తేల్చి చెప్ప‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇదే సంద‌ర్భంలో మేనిఫెస్టో అమ‌లు బాధ్య‌త టీడీపీ, జ‌న‌సేనదే అని చంద్ర‌బాబు ప్ర‌క‌టించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. దీంతో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ మేనిఫెస్టో కేంద్రంలో మోదీ స‌ర్కార్ మ‌ద్ద‌తు లేకుండా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అమ‌లుకు నోచుకోద‌నే సంకేతాలు వెళ్లాయి.

టీడీపీ, జ‌న‌సేన ఉమ్మ‌డి మేనిఫెస్టోకు జ‌నం నుంచి స్పంద‌న క‌రువైంది. మ‌రోవైపు చంద్ర‌బాబు విశ్వ‌స‌నీయ‌త‌పై జ‌గ‌న్ ఓ రేంజ్‌లో చీల్చి చెండాడుతున్నారు. ప్ర‌తి ఎన్నిక‌ల స‌భ‌లోనూ 2014 మేనిఫెస్టో అమ‌లుపై జ‌గ‌న్ తూర్పార‌ప‌డుతున్నారు. నాడు కూట‌మి ఇచ్చిన 650 హామీల్లో ఏ ఒక్క హామీని చంద్ర‌బాబు అమ‌లు చేయ‌లేద‌ని, ఒక్కో స్కీమ్ గురించి వివ‌రిస్తున్నారు. చంద్రబాబు కేవ‌లం రాజ‌కీయ అవ‌స‌రాలు తీర్చుకోడానికే ఉత్తుత్తి హామీలు ఇస్తుంటార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో త‌మ ఉమ్మ‌డి మేనిఫెస్టో ఓట్ల‌ను రాల్చ‌ద‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు అర్థ‌మైంది.

ఈ క్ర‌మంలో త‌మ మేనిఫెస్టోపై ప్ర‌చారం చేయ‌డం మానేసి, మోదీ పేరు చెప్పుకుని ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తున్నారు. ఇందులో భాగంగా మోదీ గ్యారెంటీకి తాము క‌ట్టుబ‌డి ఉన్నామంటూ ప్ర‌తి రోజూ ...బీజేపీ ప‌థ‌కాల‌ను ప్ర‌ధాని పేరుతో ప్ర‌చారం చేసుకుంటుండం గ‌మ‌నార్హం. అయితే ఈ ప్ర‌చారంలో ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఫొటోను క‌నీస మ‌ర్యాద కోస‌మైనా వాడ‌డం లేదు. కేవ‌లం మోదీ ఫొటోతో రాజ‌కీయంగా సొమ్ము చేసుకోవాల‌నే త‌ప‌న బాబు, ప‌వ‌న్‌లో క‌నిపిస్తోంది.

Readmore!

టీడీపీ, జ‌నసేన మేనిఫెస్టోలోని ప‌థ‌కాల్లో నాలుగు వేల పింఛ‌న్‌కు ఆ పార్టీ యాడ్‌లో క‌త్తెర వేసిన‌ట్టు జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. టీడీపీ, జ‌న‌సేన ఉమ్మడి మేనిఫెస్టో విడుద‌ల చేసిన‌ప్ప‌టికీ, ఆ రెండు పార్టీలు కూడా స‌క్ర‌మంగా ప్ర‌చారం చేసుకోవ‌డం లేదు. కేవ‌లం బాబును మ‌ళ్లీ ర‌ప్పిద్దాం అంటూ మొక్కుబ‌డిగా ఒకే ఒక్క స్కీమ్‌ను ప్ర‌చారం చేసుకుంటున్నారు. అస‌లేం జ‌రుగుతున్న‌దో కూట‌మి నేత‌ల‌కు అర్థం కావ‌డం లేదు. ఇక ప్ర‌జ‌ల‌కు ఏం తెలుస్తుంది. ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌వుతున్న‌దల్లా ... చంద్ర‌బాబు ఉత్తుత్తి హామీలు ఇచ్చార‌ని.

Show comments