ఆమె వస్తానంటోంది.. ఎవరూ పిలవట్లేదు!

జయప్రద అంటే.. ఒకప్పట్లో భారతీయ సినీ ప్రేక్షకుల కలలరాణి. అందాల అభినేత్రి. తెలుగు ప్రేక్షకులలో ఒక తరాన్ని ఊపేసిన కథానాయిక హిందీ చిత్రపరిశ్రమకు వెళ్లిన తర్వాత.. అటునుంచి అటే.. ఉత్తరాదిలోనే స్థిరపడింది.

సినీరంగానికి దూరమైన తర్వాత ఉత్తరాది రాజకీయాల్లోనే సెటిలైంది. రకరకాలుగా పార్టీలు మారి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతోంది. హేమమాలిని వంటి నిన్నటితరం అగ్రకథానాయికలకు ఎంపీ టికెట్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ జయప్రద విషయం పట్టించుకోలేదు. కానీ జయప్రద మాత్రం.. తనను ఎవరైనా పిలిస్తే వెళ్లి పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయాలని అనుకుంటోంది. 

జయప్రద తాజాగా తిరుమల దైవదర్శనానికి వచ్చింది. ప్రతి రాజకీయ నాయకుడూ తిరుమలకు వచ్చి.. దర్శనం కాగానే.. రాష్ట్రమంతా బాగుండాలని దేవుడిని కోరుకున్నా అంటూ అబద్ధాలతో బతికేస్తుంటారు. నిజంగా దేవుడిని తాము కోరుకున్నది ఏమిటో ఎవ్వరూ నిజం చెప్పరు.

జయప్రద కూడా అదేరీతిగా బంగారు ఆంధ్రప్రదేశ్ తయారుకావాలని, ఏపీకి ప్రత్యేకహోదా రావాలని శ్రీవారిని ప్రార్థించానంటూ కాకమ్మ కథలు చెప్పుకొచ్చారు. అయినా రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలంటే ప్రార్థించాల్సింది శ్రీవారిని కాదు.. శ్రీమాన్ మోడీని అనే సంగతి జయప్రదకు తెలియదనే అనుకోవాలా? 

ఆ సంగతి పక్కన పెడితే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తనను ఆహ్వానిస్తే ఏపీలో ఎన్నికల ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా జయప్రద చెప్పుకొచ్చారు.

పాపం జయప్రద ఖాళీగా ఉన్నారు. ఎవరూ ప్రచారానికి కూడా పిలవడం లేదు. ప్రచారం చేస్తూ ఉంటే తప్ప, ప్రజల్లో కనిపిస్తూ ఉంటే తప్ప తాము స్టార్లం అనే సంగతి ప్రజలు మర్చిపోతారని వారికి భయం. ఆమెకు ఉత్తరాదిలో ఎంతమాత్రం ప్రజల ఫాలోయింగ్ ఉన్నదో తెలియదు గానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆమెను కలలరాణిగా భావించిన తరం ఒకటి ఇప్పటికీ ఉంది.

అయినా సరే.. అటు ఏపీ బిజెపి నేతలు కాదు కదా.. గెలుపు కోసం సీరియస్ గా తలపడుతున్న తెలంగాణ బిజెపి నేతలు కూడా ఆమెను ప్రచారానికి ఆహ్వానించడం లేదు ఎందుకోమరి?

Show comments