ఏపీ ప్ర‌యోజ‌నలా... మోదీ ఏం హామీలిచ్చారు బాబూ!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా వాడుకుంటున్న నాయ‌కుడెవ‌రైనా వున్నారంటే... చంద్ర‌బాబునాయుడు మాత్ర‌మే అని పౌర స‌మాజం నుంచి స‌మాధానం వ‌స్తోంది. ప్ర‌తిదానికీ రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు పొంద‌డం చంద్ర‌బాబుకు వెన్న‌తో పెట్టిన విద్య‌. నాలుగు ద‌శాబ్దాల పైబ‌డి చంద్ర‌బాబు జీవితంలో త‌న వ్య‌క్తిగ‌తం అంటూ ఏదీ లేద‌ని కొన్నేళ్ల పాటు జ‌నాన్ని న‌మ్మించి, రాజ‌కీయంగా రాణించ‌గ‌లిగారు.

అయితే ప్ర‌స్తుత మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఆయ‌న చెప్పిన‌వ‌న్నీ జ‌నం న‌మ్మ‌డం లేదు. బాబు చెబుతున్నాడంటే, అందులో ఏదో తిర‌కాసు వుంద‌ని ప్ర‌జ‌లు అనుమానించే ప‌రిస్థితి. గ‌తంలో ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం ఎన్డీఏ కూట‌మి నుంచి ఇదే చంద్ర‌బాబునాయుడు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకున్నారు. మోదీకి వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా ప్ర‌చారం చేశారు. అస‌లు ఈ దేశంలో మోదీ ఉండ‌డానికే అన‌ర్హుడ‌ని ఘాటు విమ‌ర్శ చేసిన ఏకైక నాయ‌కుడు చంద్ర‌బాబు.

అయితే ఏపీలో ఘోర ప‌రాజ‌యం ఎదురు కావ‌డంతో చంద్ర‌బాబు ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకున్నారు. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా బీజేపీ పెద్ద‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల స‌మ‌యానికి తాను అనుకున్న‌ట్టుగానే ఎన్డీఏ కూట‌మిలో చేర‌గ‌లిగారు. ఇప్పుడాయ‌న ఎన్డీఏ కూట‌మిలో చేర‌డానికి కూడా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే అని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

బాబు మార్క్ రాజ‌కీయానికి ఇదో నిద‌ర్శ‌నం. బీజేపీ అనుకూల జాతీయ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల కోస‌మే తిరిగి ఎన్డీఏలో చేరిన‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. ప్ర‌త్యేక హోదా అంశంపై గ‌తంలో బీజేపీతో విభేదించాన‌న్నారు. మ‌రి ఇప్పుడు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే ఎన్డీఏలో చేరిన‌ట్టైతే, ప్ర‌త్యేక హోదా ఇస్తాన‌ని బీజేపీ హామీ ఇచ్చిందా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

అలాగే వెనుకబ‌డిన జిల్లాల ప్ర‌త్యేక ప్యాకేజీ, విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మను విక్ర‌యించ‌మ‌ని, రాష్ట్రానికి రైల్వేజోన్‌పై కేంద్ర బీజేపీ హామీలు ఇచ్చిందా? అని రాష్ట్ర ప్ర‌జానీకం నిలదీస్తోంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించి ఎలాంటి హామీలు ఇచ్చిందో చెబితే బాగుంటుంద‌ని పౌర స‌మాజం అడుగుతోంది.

Show comments