మేనిఫెస్టోపై జ‌గ‌న్ మ‌న‌సులో మాట ఏంటంటే!

ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని రాజ‌కీయ పార్టీల అధినాయ‌కులు అనుకుంటుంటారు. ఇందుకు చంద్ర‌బాబునాయుడు నిలువెత్తు నిద‌ర్శ‌నం. ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెట్టామా? లేదంటే మ‌రేదైనా చేశామా? అనేది బాబుకు అస‌లు ప‌ట్టింపే వుండ‌దు. అందుకే చంద్ర‌బాబు ఏమైనా చెబుతుంటారు. అయితే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాత్రం ఇందుకు విరుద్ధం. దానికి తాజా వైసీపీ మేనిఫెస్టోనే నిద‌ర్శ‌నం.

వైసీపీ మేనిఫెస్టోలో ఎలాంటి మెరుపులు, ఉరుములు లేవు. చేస్తాన‌ని న‌మ్మిన వాటినే జ‌గ‌న్ ప్ర‌క‌టించార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో మేనిఫెస్టోపై కొంత నిరుత్సాహం క‌నిపిస్తోంది. ఏవైనా ఆక‌ర్ష‌ణీయమైన ప‌థ‌కాలు ప్ర‌క‌టించే వుంటే బాగుండేద‌ని వారి అభిప్రాయం.

ఈ నేప‌థ్యంలో మేనిఫెస్టోపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌న‌సులో మాట ఏంట‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌న‌కు స‌న్నిహితులైన నాయ‌కుల వ‌ద్ద మేనిఫెస్టోపై మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టారు.

ఎటూ అధికారంలోకి వ‌చ్చేది మ‌న‌మే అని, అలాంట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా హామీలు ఇవ్వాల‌ని జ‌గ‌న్ అన్న‌ట్టుగా తెలిసింది. ఏదో ఒక‌టి చెప్పి, వాటిని చేయ‌లేక‌పోతే ప్ర‌జ‌ల ఎదుట దోషిగా నిల‌బ‌డాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న అన్నార‌ని స‌మాచారం.

అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశ‌మే లేని చంద్ర‌బాబునాయుడు ఎన్ని హామీలైనా ఇస్తార‌ని జ‌గ‌న్ బ‌హిరంగంగానే చెబుతున్నారు. బాబుకు బాధ్య‌త లేద‌ని, బ‌డ్జెట్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా, నోటికొచ్చిన‌ట్టు ప్ర‌జ‌ల్ని మ‌భ్య పెట్టాల‌ని చూస్తున్నార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తుతున్నారు. అయిన‌ప్ప‌టికీ విశ్వ‌స‌నీయ‌త త‌న‌కే వుంద‌ని జ‌గ‌న్ గాఢంగా న‌మ్ముతున్నారు. అందుకే కొత్త హామీలేవీ ఇవ్వ‌కుండా, పాత వాటినే కొన‌సాగించ‌డానికి జ‌గ‌న్ మొగ్గు చూపారు. ఇక ప్ర‌జ‌లదే అంతిమ నిర్ణ‌యం. 

Show comments