పిరికి ఎంపీగారి సిగ్గులేని మాటలు!

రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన వారు ఎక్కడ ఉంటారో ఎక్కడ ఏం పనులు చేస్తుంటారో సాధారణంగా ప్రజలెవ్వరూ పట్టించుకోరు! కానీ లోక్ సభ ఎంపీల విషయం అలా కాదు. వాళ్లను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. మళ్లీ మళ్లీ గెలవాలంటే వాళ్లు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉండాలి కూడా. 

కానీ.. ఎంపీగా ఎన్నికైన తర్వాత.. కొన్నేళ్లుగా తనను గెలిపించిన ప్రజలకు మొహం కూడా చూపించకుండా.. నియోజకవర్గంలో అడుగు పెడితే తన పరిస్థితి ఏమైపోతుందో అని భయపడుతూ బతుకుతున్న ఒక తెలుగు ఎంపీ.. తాజాగా తన పిరికితనానికి అందమైన ముసుగు వేయడానికి ప్రయత్నించడం.. ఆ ముసుగులో తన ప్రత్యర్థులను నిందించడం చిత్రంగా కనిపిస్తోంది.

అనగనగా ఒక ఎంపీగారు..! పేరు చివర ఉన్న తోక కారణంగా తాను క్షాత్రానికి, శౌర్యానికి వీరత్వానికి ప్రతీక అని ఆయన భ్రమల్లో బతుకుతూ ఉంటారు. ఆయన గురించి ఆయన ఎన్ని భ్రమలు పెట్టుకున్నా పరవాలేదు. ప్రపంచానికి నష్టమేమీలేదు. కానీ.. ప్రజలందరూ కూడా తన భ్రమల్ని నమ్మాలని ఆయన కోరుకుంటారు. 

ఆయనను తెలుగు ప్రజలు గెలిపించారు. వైఎస్ జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచాడు. ఈగోకు పోయి పార్టీతో సున్నం పెట్టుకున్నాడు. తమ పార్టీ చాలా గొప్పది అంటూ ఉంటాడు. ప్రభుత్వం చాలా చెడ్డది, దుష్టమైనది అని తిడతాడు. మా పార్టీ అధ్యక్షుడు మహానుభావుడు, కానీ ముఖ్యమంత్రి జగన్ దుష్టుడు అంటూ.. వినేవాళ్లకి పిచ్చెక్కించే ప్రయత్నం చేస్తుంటాడు. 

ఎటూ పూర్తిస్థాయిలో పార్టీతో సున్నం పెట్టుకున్నాడు గనుక.. మళ్లీ తన మొహాన టికెట్ దక్కే చాన్సు ఎటూ లేదు గనుక.. రాజకీయ జీవితం ఇక్కడితో ముగిసినట్టే గనుక.. ఎడాపెడా తిట్ల, చౌకబారు విమర్శల పర్వం కొనసాగిస్తూ ఉంటాడు. అంతా ముసుగు వెనక నుంచే.. ఎక్కడా బహిరంగంగా తారసపడి.. తలపడి మాట్లాడే ధైర్యం మాత్రం ఉండదు. 

యూట్యూబుల్లో మాట్లాడుకుంటూ.. అక్కడ వ్యూస్ చూసుకుని అదంతా తన  హీరోయిజమే అనుకునే భ్రమల్లో బతుకుతుంటాడు. అంతే తప్ప.. కొన్నేళ్లుగా తనను గెలిపించిన ప్రజలున్న సొంత నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టకుండా.. పిరికిగా దాక్కుని బతుకుతూ ఉంటాడు. 

అలాంటి ఎంపీగారు తాజాగా ఒక వీడియోలో తన గురించి.. తన అనుచరుల గురించి డప్పు కొట్టుకున్నారు. ‘‘భీమవరంలో కార్యక్రమానికి వెళ్లాలని అనుకున్నారట. రైలు కూడా ఎక్కారట. కానీ.. ఆయన రాబోతున్నారని పోలీసులు భయపడిపోతున్నారో ఏమో గానీ.. అక్కడున్న ఆయన అనుచరులందరినీ జైళ్లలో పెట్టేసి కొడుతున్నారట. మీ నాయకుడిని రావద్దని చెప్పండి.. లేపోతే మీమీద కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారట. తన అనుచరుల తల్లిదండ్రులకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారట.’’ 

నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి ఇన్నేళ్లుగా ధైర్యంలేని ఎంపీ.. ఇప్పుడు రైలెక్కడమే ఒక కామెడీ. టెక్నాలజీ ఎడ్వాంటేజీలు బాగా తెలిసిన ఆయన తన అనుచరులకు, వారి తల్లిదండ్రులకు కూడా ఎదురవుతున్న ఫోను బెదిరింపుల గురించి ఒక్క ఆడియో రికార్డయినా లేకుండా బురద చల్లేయడం ఇంకో కామెడీ. 

ఇదంతా కూడా ఆయన తనలోని పిరికితనానికి తగిలించుకుంటున్న మరో కొత్త ముసుగు అని ప్రత్యేకంగా వేరే చెప్పాలా? ఆయన చేస్తున్న కామెడీని ఇన్నాళ్లుగా చూస్తున్న ప్రజలు ఆ మాత్రం గుర్తించలేరా?

Show comments