చిరంజీవిపై జ‌గ‌న్ ఆత్మీయ‌త‌

మెగాస్టార్ చిరంజీవిపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మ‌రోసారి ఆత్మీయత క‌న‌బ‌రిచారు. టాలీవుడ్ అగ్ర‌హీరోలు చిరంజీవి, నాగార్జున‌ల‌తో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు స‌న్నిహిత సంబంధాలున్నాయి. టాలీవుడ్ స‌మ‌స్య‌లు ఏవైనా చిరంజీవి వెళితే ప‌రిష్కారం అవుతాయ‌నే న‌మ్మ‌కం ఉంది. ఇందుకు కార‌ణం రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల‌తో చిరంజీవికి ఉన్న స‌న్నిహిత సంబంధాలే.

ఈ నేప‌థ్యంలో భీమ‌వ‌రంలో అల్లూరి జ‌యంతి వేడుక‌ల‌కు ప్ర‌త్యేకంగా చిరంజీవికి మాత్ర‌మే ఆహ్వానం, అలాగే ఆయ‌న పాల్గొన‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. స‌భ‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ "సోద‌రుడు" చిరంజీవి అంటూ సంబోధించ‌డంతో స‌భికుల నుంచి హ‌ర్ష‌ధ్వానాలు మిన్నంటాయి. చిరంజీవిపై మొద‌టి నుంచి జ‌గ‌న్ అభిమానం ప్ర‌ద‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఇంటికి చిరంజీవి దంప‌తులు వెళ్లి వారి ఆతిథ్యాన్ని స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ప‌లు సంద‌ర్భాల్లో సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు చిరంజీవి, నాగార్జున క‌లిసి రాజ‌మౌలి, మ‌హేశ్‌బాబు, ప్ర‌భాస్ త‌దిత‌ర సెల‌బ్రిటీల‌ను వెంట‌తీసుకెళ్లారు. చిరంజీవి త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో మాత్రం జ‌గ‌న్‌కు తీవ్ర‌స్థాయిలో విభేదాలున్నాయి. ఈ విభేదాలు రాజ‌కీయాల‌ను దాటి, వ్య‌క్తిగ‌త స్థాయిలో చోటు చేసుకున్నాయి.

త‌మ్ముడితో ఎలా ఉన్నా, అన్న మెగాస్టార్ చిరంజీవితో మాత్రం జ‌గ‌న్ స‌త్సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. చిరంజీవిని అభిమానంగా అన్నా అని జ‌గ‌న్ పిలుస్తుంటారు. ఇదే విష‌యాన్ని ప‌లు వేదిక‌ల మీదుగా చిరంజీవి ఆనందంతో ప్ర‌క‌టించారు. 

జ‌గ‌న్, చిరంజీవి మ‌ధ్య వ్య‌క్తిగ‌త సాన్నిహిత్యం ఉన్న నేప‌థ్యంలో... ఒక ద‌శ‌లో వైసీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు చిరంజీవి వెళ్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. దాన్ని చిరంజీవి ఖండించారు కూడా. ఏది ఏమైనా చిరంజీవితో మాత్రం సోద‌ర బంధాన్ని కొన‌సాగిస్తున్నార‌నేందుకు... ఇవాళ్టి భీమ‌వ‌రంలో స‌భ‌లో జ‌గ‌న్ సంబోధ‌నే నిద‌ర్శ‌నం.

Show comments