రూ.50 వేల జ‌రిమానా... ఏపీ హైకోర్టు షాక్!

కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో ఏపీ హైకోర్టు సీరియ‌స్‌గా స్పందించింది. వాయిదాకు ఆల‌స్యంగా వ‌చ్చిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక‌శాఖ కార్య‌ద‌ర్శి స‌త్య‌నారాయ‌ణ‌పై హైకోర్టు చ‌ర్య‌ల‌కు ఆదేశించింది. ఈ ప‌రంప‌రలో స‌త్య‌నారాయ‌ణ‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీతో పాటు అదుపులోకి తీసుకోవాల‌ని ఆదేశించి హైకోర్టు గ‌ట్టి షాక్ ఇచ్చింది.

కృష్ణా జిల్లా క‌లిదిండి పంచాయ‌తీ కార్య‌ద‌ర్శికి బ‌కాయిలు చెల్లించాల‌ని గ‌తంలో ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి స‌త్య‌నారాయ‌ణ‌కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల‌ను ఆయ‌న అమ‌లు చేశారు. కానీ గ‌త వాయిదాకు ఆయ‌న కోర్టుకు ఆల‌స్యంగా వెళ్లారు. దీంతో కోర్టు ధిక్క‌ర‌ణ‌కు స‌త్య‌నారాయ‌ణ పాల్ప‌డిన‌ట్టు హైకోర్టు భావించింది. కేసు విచార‌ణ జ‌రుగుతుంటే... ఆల‌స్యంగా రావ‌డం ఏంటంటూ కోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఈ నేప‌థ్యంలో వారెంట్‌ రీకాల్‌ కోసం సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. జైలు శిక్షతో పాటు రూ.50వేల జరిమానా ఉంటుందని తేల్చి చెప్పింది. రూ.50వేల జరిమానాను న్యాయవాదుల సంక్షేమ నిధికి చెల్లించాలని హైకోర్టు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. దీంతో స‌త్య‌నారాయ‌ణ షాక్‌కు గుర‌య్యారు. 

శిక్ష నిలిపివేయాలంటూ సత్యనారాయణ, ఆయన తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని అభ్య‌ర్థించారు. వారి అభ్య‌ర్థ‌న‌ను లంచ్‌ తర్వాత పరిశీలిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు నిర్ణ‌యం ఎలా ఉంటుందోన‌నే ఆస‌క్తి నెల‌కుంది. ఇటీవ‌ల ప‌లువురు ఏపీ ఐఏఎస్ అధికారులు వ‌రుస కోర్టు ధిక్క‌ర‌ణ కేసుల‌ను ఎదుర్కోవ‌డం చ‌ర్చ‌కు దారి తీస్తోంది. 

Show comments