ప‌ట్టాభిని ఫుట్‌బాల్ ఆడుతున్న నెటిజ‌న్లు

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లేదా ఏవైనా ప్రైవేట్ సంస్థ‌లు అత్యుత్త‌మ క‌మెడియ‌న్ అవార్డు ఇవ్వాల‌నుకుంటే మాత్రం ...అది మ‌న టాలీవుడ్‌కే ద‌క్కుతుంది. క‌రోనా మ‌హ‌మ్మారి పంజా విసురుతూ లోకాన్ని ఏడిపిస్తూనే, ఓ అద్భుత‌మైన క‌మెడియ‌న్ టీడీపీ నేత ప‌ట్టాభి రూపంలో అందించింద‌ని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు. 

టీడీపీ నేత ప‌ట్టాభిలో నివురు గ‌ప్పిన హాస్య చ‌తుర‌త ...క‌రోనా పుణ్యాన ఒక్క సారిగా బ‌య‌టికొచ్చింది. ప‌ట్టాభిని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఫుట్‌బాల్ ఆడుకోడానికి దారి తీసిన ప‌రిస్థితుల గురించి తెలుసుకుందాం.

సీఎం ప‌ద‌వి నుంచి జ‌గ‌న్ వారం రోజులు త‌ప్పుకుని ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు బాధ్య‌త అప్ప‌గిస్తే క‌రోనా నుంచి రాష్ట్రాన‌ని ఎలా గ‌ట్టెక్కించాలో చేసి చూపిస్తార‌ని ప‌ట్టాభి ప్ర‌భుత్వానికి స‌వాల్ విసిరారు. ప‌ట్టాభి స‌వాల్‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. 

చంద్రబాబు అధికారంలో ఉంటే పరిస్థితులు మరింత దిగజారేవంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన విమర్శలపై స్పంద‌న‌గా ప‌ట్టాభి న‌వ్వు తెప్పించే స‌వాల్ విసిరారు. వారంపాటు అధికారం అప్పగిస్తే చంద్రబాబు సెట్‌రైట్‌ చేస్తారన్నారు.

హుద్‌హుద్‌ తుపాను, ఉత్తరాఖండ్‌ వరదల సమయంలో చంద్రబాబు ఏ విధంగా సేవలందించారో ప్రజలు చూశారని ప‌ట్టాభి చెప్పుకొచ్చారు. విపత్తు వచ్చినపుడు సమర్థంగా ఎలా ఎదుర్కోవాలి, ప్రజల్ని ఏ విధంగా కాపాడాలో చంద్ర‌బాబు చేసి చూపి స్తారని ప‌ట్టాభి అన్నారు.  

ప‌ట్టాభి స‌వాల్‌పై నెటిజ‌న్లు త‌మ‌దైన సృజ‌నాత్మక శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఇంకా న‌యం ప్ర‌ధాని మోడీని నెల రోజుల పాటు ప‌ద‌వి నుంచి త‌ప్పుకుని బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని డిమాండ్ చేయ‌లేద‌న్నారు. ఆ డిమాండ్ కూడా చేసి ఉంటే ఓ ప‌నైపోయేది క‌దా ప‌ట్టాభి అని సెటైర్లు విసురుతున్నారు. 

ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌డితే ఏకంగా దేశంలోనే ఎక్క‌డా క‌రోనా లేకుండా చేయొచ్చు క‌దా సార్ అని వెట‌క‌రిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌పంచ మేధావిగా కీర్తినార్జించిన చంద్ర‌బాబు సొంత కొడుకును సెట్‌రైట్ చేసుకోడానికి ఎంత కాలం ప‌డుతుందో చెప్ప‌క పోయావా ప‌ట్టాభి అని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు. 

చంద్ర‌బాబులో అంత స‌మ‌ర్థ‌తే ఉంటే క‌న్న కొడుకును, దిక్కూదిశా లేకుండా కొట్టుకుపోతున్న టీడీపీని ఉద్ధ‌రించుకోవాల‌ని నెటిజ‌న్లు ఉచిత స‌ల‌హాలివ్వ‌డం విశేషం. మొత్తానికి ప‌ట్టాభి బాబు భ‌క్తి ఆయ‌న్ను అప‌హాస్యం చేసిందనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

సొదుం ర‌మ‌ణ‌

Show comments