ఎల్లో బ్యాచ్‌కు రుచించ‌ని వెంక‌య్య మాట‌లు

ఈ రోజు ఎంతో గొప్ప దినం. ఆంగ్లేయుల  నియంతృత్వ‌, వ‌ల‌స పాల‌న నుంచి బంధ విముక్తులైన త‌ర్వాత మ‌న దేశం 1949, న‌వంబ‌ర్ 26న సొంత రాజ్యాంగాన్ని అమ‌ల్లోకి తెచ్చుకుంది. ఇది మ‌నం స‌గ‌ర్వంగా చాటి చెప్పుకోవాల్సిన విష‌యం. 

బ‌హుశా ఈ చ‌రిత్రాత్మ‌క దినాన్ని దృష్టిలో పెట్టుకునే ఉప‌రాష్ట్ర‌ప‌తి, మ‌న తెలుగు బిడ్డ వెంక‌య్య‌నాయుడు రాజ్యాంగం గొప్ప‌త‌నాన్ని చాటి చెప్పేందుకు, కొన్ని రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల గురించి నిర్మొహ‌మాటంగా త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు.

ఉప రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య‌నాయుడు ఇప్పుడంటే రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్నారు. కానీ ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం అంతా బీజేపీలోనే సాగింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంక‌య్య‌నాయుడు అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా, అలాగే వివిధ మంత్రిత్వ‌శాఖ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు. 

రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రితో స్నేహం నెరప‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాష‌లపై ఆయ‌న‌కు మంచి ప‌ట్టుంది. ఏ అంశంపైనైనా, ఏ భాష‌లోనైనా అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల చాక‌చ‌క్యం, విష‌య ప‌రిజ్ఞానం, లౌక్యం ఆయ‌న‌కున్నాయి. ఇవే ఆయ‌న ఆస్తిపాస్తులు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే సామాజిక నేప‌థ్యం ప‌రంగా త‌మ వాడేన‌ని ఎల్లో బ్యాచ్ భావిస్తుంది. ఆయ‌న్ని అభిమానించ‌డంలో, ఆద‌రించ‌డంలో పార్టీ అనేది ప‌రిగ‌ణ‌లోకే రాదు. అలాంటి వెంక‌య్య‌నాయుడి నోట ఎల్లో బ్యాచ్‌కు రుచించ‌ని మాట‌లొచ్చాయి. అది కూడా తాము న‌మ్ముకున్న ఏకైక రాజ్యాంగ వ్య‌వ‌స్థపై వెంక‌య్య‌నాయుడు లాంటి మ‌రో రాజ్యాంగ వ్య‌వ‌స్థ అత్యున్న‌త ప‌దవిలో ఉన్న వ్య‌క్తి మాట్లాడ్డం ఎల్లో బ్యాచ్‌కు అస‌లు గిట్టే అవ‌కాశాలే లేవు.

గుజ‌రాత్‌లోని కెవాడియాలో బుధ‌వారం నిర్వ‌హించిన 80వ అఖిల భార‌త స‌భాప‌తుల స‌ద‌స్సులో ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు కీల‌క ఉప‌న్యాసం ఇచ్చారు. రాజ్యాంగానికి లోబ‌డే న్యాయ‌, శాస‌న‌, కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌స్థ‌లు త‌మ విధులు నిర్వ‌ర్తించాల్సి వుంద‌న్నారు. కొన్ని సంద‌ర్భాల్లో కోర్టులు చేస్తున్న వ్యాఖ్య‌లు త‌మ ప‌రిధి దాటి ప్ర‌వ‌ర్తిస్తున్నాయా? అనే అభిప్రాయాన్ని క‌లిగిస్తున్నాయ‌న్నారు.

స్వాతంత్య్రం వచ్చాక సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు అనేక కీలక తీర్పులిచ్చాయ‌ని కొనియాడారు. ఇదే క్రమంలో అవి తమ పరిధి దాటి కార్యనిర్వాహక, శాసనవ్యవస్థ విధుల్లోకి జొరబడుతున్నాయన్న ఆందోళనలను రేకెత్తించాయని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొన్ని అంశాలను ప్రభుత్వ శాఖలకే వదిలేయడం మంచిదేమోనని, కోర్టుల జోక్యం అనవసరమన్న చర్చ కూడా సాగిందని ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం. 

ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా న్యాయ వ్య‌వ‌స్థ‌లో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పై సాగుతున్న చ‌ర్చ‌ను, చాలా తెలివిగా ఆయ‌న ప్ర‌స్తావించార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రీ ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇలాంటి చ‌ర్చ పెద్ద ఎత్తున సాగుతున్న విష‌యం తెలిసిందే.

అయితే వెంక‌య్య‌నాయుడు కేవ‌లం అభిప్రాయాలుగా మాత్ర‌మే కాకుండా, కోర్టులు త‌మ ప‌రిధులు ఎలా దాటుతున్నాయో ఉద‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం. ఇందులో భాగంగా  ముఖ్యంగా జడ్డీల నియామకాల్లో కార్యనిర్వాహక వ్యవస్థను కాదని కొలీజియాలే నిర్ణయా లు తీసుకోవడం, జాతీయ న్యాయ నియామక సంస్థ ఏర్పాటును తిరస్కరించడం వంటి వాటిని ఆయన ప్రస్తావించారు.

కోర్టు తీర్పులు, ఆదేశాల‌పై ఒక‌వేళ ఎవ‌రైనా అభిప్రాయాలు వెల్ల‌డిస్తే చాలు ...న్యాయ‌స్థానాల‌పై దాడి అని గ‌గ్గోలు పెట్టే టీడీపీ, ఎల్లో మీడియా , మ‌రి వెంక‌య్య‌నాయుడి మాట‌ల‌పై అదే మాట అన‌గ‌ల ద‌మ్ముందా? జ‌నాభిప్రాయాన్నే వెంక‌య్య‌నాయుడి మాట‌లు ప్ర‌తిబింబించాయి.

నిజానికి ఒక కీల‌క సంద‌ర్భంలో కోర్టుల‌పై వెంక‌య్య‌నాయుడు త‌న అభిప్రాయాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు వెల్ల‌డించ‌డం రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌కు ఎంతో మంచిద‌ని చెప్పొచ్చు. గుజ‌రాత్‌లోని అదే స‌ద‌స్సులో వెంక‌య్య‌నాయుడు మాట్లాడుతూ రాజ్యాంగంలోని మూడు మూల‌స్తంభాలూ స‌మాన‌మేన‌ని, ఏదీ త‌న‌ది పైచేయి అనుకోరాద‌ని చెప్పారు. 

రాజ్యాంగ‌మే స‌ర్వోన్న‌త‌మ‌న్నారు.  వెంక‌య్య‌నాయుడైనా, మ‌రే ప్ర‌జాస్వామిక వాది చెప్పినా... రాజ్యాంగాన్ని ర‌క్షించుకుంటే, అదే మ‌న‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంగా ఉంటుంది.  

గ్రేటర్ గెలుపు ఎవరిది

Show comments