ఎట్ట‌కేల‌కూ ప‌వ‌న్ కు అధిష్టానం అపాయింట్మెంట్, ఏమ‌న్నారు?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఎట్ట‌కేల‌కూ ఢిల్లీలో ఊర‌ట ల‌భించింది. స‌ముద్రం ఎవ‌రి కాళ్ల వ‌ద్ద‌కూ వెళ్ల‌దు అంటూ ఆ మ‌ధ్య త‌న గురించి తాను చెప్పుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఢిల్లీలో రెండు రోజుల పాటు వేచి చూసి బీజేపీ జాతీయాధ్య‌క్షుడిని క‌ల‌వ‌గ‌లిగారు! .

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏమీ బీజేపీ నేత కాదు, ఆయ‌న ఏదో ప్ర‌జ‌ల ప‌ని మీద కూడా వెళ్ల‌లేదు, జ‌స్ట్ త‌మ పొత్తు గురించి మాట్లాడ‌టానికి, బీజేపీకి త‌ను స‌హకారం అందిస్తున్న విష‌యం గురించి గుర్తు చేయ‌డానికి వెళ్లారు. ఏపీలో బీజేపీ ప‌రిస్థితి కూడా ఏమిటో చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయినా ప‌వ‌న్ కు అపాయింట్ మెంట్ ఇవ్వ‌డానికి బీజేపీ నేత‌లు చాలా స‌మ‌య‌మే తీసుకున్న‌ట్టుగా ఉన్నారు!

బ‌హుశా రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన నేత‌లా ప‌వ‌న్ ను ట్రీట్ చేశారేమో బీజేపీ వాళ్లు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ ఢిల్లీ వెళ్లింది తిరుప‌తి ఉప ఎన్నిక అభ్య‌ర్థిత్వాన్ని జ‌న‌సేన‌కు కోర‌డానికే అని స్ప‌ష్టం అవుతూనే ఉంది. ప‌వ‌న్ కూడా ఆ అంశం గురించి స్పందించారు.

తిరుప‌తి ఉప ఎన్నిక‌లో అభ్య‌ర్థి ఎవ‌ర‌నే అంశం గురించి ఇరు పార్టీల ఉమ్మ‌డి క‌మిటీ నిర్ణ‌యిస్తుంద‌ట‌! ఇదీ ప‌వ‌న్ చెప్పిన మాట‌! ఉమ్మ‌డి అభ్య‌ర్థిత్వం గురించి ఇలా ఉమ్మ‌డిగా ఆలోచిస్తార‌ట‌. మ‌రి ఆ ప్ర‌క‌ట‌న కూడా ఉమ్మ‌డిగా చేయాల్సింది. కానీ ప‌వ‌న్ త‌న మ‌టుకు త‌ను ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే తిరుప‌తి ఉప ఎన్నిక విష‌యంలో బీజేపీ త‌న ప‌ని త‌ను చేస్తోంది. 

ఎక్క‌డా జ‌న‌సేన‌ను సంప్ర‌దించిన దాఖ‌లాలు లేవు. అయితే ప‌వ‌న్ మాత్రం త‌నే ఢిల్లీ వెళ్లి.. ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ అంటూ  త‌నే ప్ర‌క‌ట‌న చేసుకున్నారు. తిరుప‌తి బై పోల్ టికెట్ జ‌న‌సేన‌దే అని ప‌వ‌న్ ధీమాగా చెప్ప‌లేదు.

ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌, ఉమ్మ‌డి ఆలోచ‌న అంటూ ఏదైనా ఉంటే.. ఆ ప్ర‌క‌ట‌న కూడా ఉమ్మ‌డిగా జ‌రిగి ఉంటే కాస్తో కూస్తో న‌మ్మేలా ఉండేది. ప‌వ‌న్ మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే.. తిరుప‌తి బై పోల్ విష‌యంలో జ‌న‌సేన‌కు బీజేపీ అధిష్టానం స్ప‌ష్టంగానే చెప్పిన‌ట్టుగా ఉంది. క‌వ‌ర్ చేసుకోవ‌డానికి ప‌వ‌న్ క‌ల్యాణ్.. అభ్య‌ర్థి గురించి ఉమ్మ‌డి చ‌ర్చ అంటున్నారని స్ప‌ష్టం అవుతోంది.

Show comments