ఆ గాయ‌ని ఛిద్ర‌మైన జీవితంలో వెలుగులు నింపిన బాలు

గాన గంధ‌ర్వుడు, త‌న మ‌ధుర కంఠంతో సంగీత ప్ర‌పంచాన్ని ఓల‌లాడించిన ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం భౌతికంగా ఇక లేర‌నే వాస్త‌వాన్ని జీర్ణించుకోవ‌డం క‌ష్టంగా ఉంది. బాలు స్వ‌రం నుంచి జాలు వారిన మ‌ధుర గీతాల‌ను ఆస్వాదించ‌ని ప్రాణి లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఎంతో మంది వ‌ర్త‌మాన గాయ‌కుల‌ను వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించిన ఆ మంచి హృద‌యం మ‌న మ‌ధ్య నుంచి శాశ్వ‌తంగా వీడ్కోలు తీసుకుందంటే న‌మ్మ‌శ‌క్యం కావ‌డం లేదు.

ఎస్పీ బాలు మృతితో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భార‌తీయుల హృద‌యాలు బ‌రువెక్కాయి. సామాన్యులు మొద‌లుకుని సెల‌బ్రిటీల వ‌ర‌కు త‌మ కుటుంబ స‌భ్యుడిని కోల్పోయిన ఆవేద‌నలో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా బాలుకు సంతాప సందేశాలు వెల్లువెత్తు తున్నాయి. బాలుతో త‌మ‌కున్న ఆత్మీయానుబంధాల‌ను గుర్తు చేసుకుంటున్నారు.  ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ గాయ‌ని సునీత బాధాత‌ప్త హృద‌యంతో ఘ‌టించిన నివాళి ప్ర‌తి ఒక్క‌ర్నీ క‌దిలిస్తోంది.

"నా ఛిద్రమైన జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి. నాకు పాట మీద ప్రేమ కలిగించి, పాడాలనే తపన పెంచి, నా బాగోగులు గమనిస్తూ, నాకు బాసటగా నిలుస్తూ, జీవితం మీద మమకారం పెంచిన వ్యక్తి. నా ఆత్మబంధువు. నా మావయ్య. భౌతికంగా లేరు అంతే" అని గాయని సునీత నివాళుల‌ర్పించారు.

సునీత వ్య‌క్తిగ‌త జీవితంలో అనేక ఆటుపోట్లు ఉన్న విష‌యం తెలిసిందే. బ‌హుశా ఆ క‌ష్ట‌కాలంలో ఆమెకు కొండంత అండ‌గా బాలు నిలిచార‌ని ఈ వాక్యాల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. "నా బాగోగులు గ‌మ‌నిస్తూ, నాకు బాస‌ట‌గా నిలుస్తూ, జీవితం మీద మ‌మ‌కారం పెంచిన వ్య‌క్తి, ఆత్మ బంధువు" అని గాయ‌ని సునీత త‌న నివాళి సందేశంలో బాలు గురించి చెప్పిన వాక్యాల్లోని భావం స‌ముద్రం లోతంత‌. ప్ర‌తి అక్ష‌రం  హృద‌యాల‌ను తాకేలా ఉంది. అంతేకాదు, బాలు గొప్ప మాన‌వ‌తా వాది అని చెప్పేందుకు సునీత చెప్పిన ఆ రెండు వాక్యాలు చాలు.

Show comments