లెజెండ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూత

లెజెండరీ సింగర్, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇక లేరు. ఈ రోజు మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతూ, ఈరోజు ఆయన కన్నుమూశారు.

ఆగస్ట్ 5న కరోనాతో బాధపడుతూ చెన్నైలోని ఓ హాస్పిటల్ లో చేరారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. అప్పట్నుంచి ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే ఉన్నారు. చాలా రోజులుగా ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ.. ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయన ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి.

చివరికి కరోనాపై ఆయన విజయం సాధించారు. ఈనెల 7న నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. అదే టైమ్ లో ఆయన లేచి కూర్చున్నారు. నోటితో ఆహారం కూడా తీసుకున్నారు. అంతేకాదు.. హాస్పిటల్ లోనే తన పెళ్లి రోజు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు.

అయితే కరోనా తగ్గినప్పటికీ.. ఆయన ఊపిరితిత్తులు మాత్రం రికవర్ అవ్వలేదు. వెంటిలేటర్ సహాయంతోనే ఆక్సిజన్ తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో గడిచిన 24 గంటలుగా ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు ప్రకటించారు. పరిస్థితి విషమంగా ఉందని నిన్న సాయంత్రమే ప్రకటించిన వైద్యులు.. ఈరోజు మధ్యాహ్నం బాలు తుదిశ్వాస విడిచినట్టు తెలిపారు.

ఓ లెజెండరీ సింగర్ ను ఈ దేశం కోల్పోయింది. తన పాటలతో భారతీయ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన ఆ స్వరం శాశ్వతంగా మూగబోయింది. #RIPSPB 

కొరటాల కథ కొట్టేసింది బోయపాటేనా?

Show comments