కష్టం రాష్ట్రాలది.. క్రెడిట్ మోడీది..!

లాక్ డౌన్ టైమ్ లో దీపాలు వెలిగించండి, గంట కొట్టండి, పూలు చల్లండి.. అంటూ స్టేట్ మెంట్లు ఇవ్వడానికి పదే పదే సోషల్ మీడియాలో కనిపించేవారు మోడీ. అయితే ఆయన ప్రయత్నాలకు ఫలితం లేకపోవడం, భారత్ లో భారీగా కేసులు పెరిగిపోవడం, 20లక్షల కోట్ల ప్యాకేజీ నవ్వులపాలు కావడంతో.. అన్ లాక్ విషయంలో ప్రమోషన్ బాగా తగ్గించేశారు. అన్ లాక్-2 తర్వాత పూర్తిగా చేతులెత్తేసారు మోడీ. మీ కష్టాలు మీరు పడండి అంటూ వ్యవహారం మొత్తం రాష్ట్రాల నెత్తిన పెట్టేసి తాను బరువు దించేసుకున్నారు.

లాక్ డౌన్ వేళ.. అందరూ కేంద్ర ప్రభుత్వం మాట వినాలని చెప్పిన మోడీ, అన్ లాక్ వేళ అంతా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమేనంటూ చేతులు దులుపుకున్నారు. అన్ లాక్ 2 తర్వాత మోడీ కరోనా గురించి మాట్లాడిందీ లేదు, జాగ్రత్తలు చెప్పిందీ లేదు, సమీక్షలు జరిపిందీ లేదు. ఈలోగా.. చైనాతో లొల్లి ఎన్డీఏ ప్రభుత్వానికి భలేగా దొరికింది. కరోనా విషయం పక్కనపెట్టేసి, చైనా యాప్స్ నిషేధిస్తూ కాలం గడిపేశారు.

తీరా ఇప్పుడిప్పుడే కరోనా విషయంలో కాస్త మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. గతంలో కేసుల నమోదులో భారత్ రికార్డులు సృష్టిస్తే.. ఇప్పుడు నయమవుతున్న కేసుల్లో రికార్డులు నమోదవుతున్నాయి. రోజురోజుకీ మరణాల సంఖ్య తగ్గుతోంది, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పడిపోయింది. ఈ దశలో మరోసారి ప్రధాని మోడీ తెరపైకి వచ్చారు. ముఖ్యమంత్రులతో మరోసారి వరుసగా వీడియో కాన్ఫరెన్సులు పెడుతున్నారు.

కరోనా విలయం మొదలైనప్పుడు ఇలా ముఖ్యమంత్రులతో మోడీ సమావేశమయ్యేవారు. మళ్లీ ఇన్నాళ్లకు.. రికవరీ రేటు పెరుగుతుండే సరికి మోడీ తెరపైకి వచ్చారు. కరోనా గురించి ఘనంగా మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా మరణాల రేటు తగ్గిందని, రికవరీ రేటు పెరిగిందని, రాష్ట్ర ప్రభుత్వాలు హాట్ స్పాట్ లపై మరింతగా దృష్టిపెట్టాలని సూచించారు.

ఒకరకంగా కష్టం రాష్ట్రాలది, ఫలితం మోడీది అన్నమాట. మోడీ అన్ లాక్ అంటూ లాకులెత్తేసినా.. ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేశాయి. కేసులు పెరిగే కొద్దీ.. ఏపీలో జిల్లా కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు సీఎం జగన్. నిన్నమొన్నటి వరకూ అన్ని జిల్లాల్లో మధ్యాహ్నం ఒంటిగంటవరకే అన్ లాక్ వెసులుబాట్లు ఉన్నాయి.

కరోనా కేసుల భయం క్రమక్రమంగా తగ్గడంతో ఏపీతో సహా ఇతర రాష్ట్రాల్లో సాధారణ జనజీవనం మొదలవుతోంది. 9, 10 తరగతి విద్యార్థులు స్కూళ్లకు వెళ్తున్నారు, ఎంసెట్ మొదలైంది, వాయిదా పడ్డ సచివాలయ పరీక్షలు సజావుగా జరిగాయి.

అంతా బాగుంది అనుకుంటున్న వేళ సడన్ గా మోడీ తెరపైకి వచ్చారు. భారత్ కరోనాని జయించిందని మాట్లాడుతున్నారు, క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష కోట్ల ప్యాకేజీ ఎటుపోయిందో కచ్చితంగా చెప్పలేని మోడీ.. కరోనా నియంత్రణ క్రెడిట్ ను మాత్రం కొట్టేయడానికి రెడీ అయిపోయారు. కరోనా వైరస్ నియంత్రణ క్రెడిట్ ఎవ్వరికైనా ఇవ్వాల్సి వస్తే అది పూర్తిగా వైద్యులు, వైద్యసిబ్బంది, క్షేత్రస్థాయి మున్సిపల్, రెవెన్యూ వర్కర్స్ కు మాత్రమే ఇవ్వాలి. ఇందులో మరో వాదనకు తావులేదు.

కొరటాల కథ కొట్టేసింది బోయపాటేనా?

పవన్, బాబు ఒకరికి ఒకరు

Show comments