మోడీ యాక్షన్: ఓటీటీకి ఎక్కువ.. థియేటర్ కి తక్కువ

లద్దాక్ లో ప్రధాని మోడీ ఆకస్మిక పర్యటన టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. అనుకోకుండా మోడీ హెలికాప్టర్ లో చైనా, భారత్ సరిహద్దుకి వెళ్లడం, అక్కడ సైనికులతో కూర్చుని మాట్లాడటం.. వెనువెంటనే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం అన్నీ చకచకా జరిగిపోయాయి. సినిమా ప్రమోషన్ లో ముందు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, ఆ తర్వాత టీజర్, ట్రయిలర్, సింగిల్స్ రిలీజ్ చేసినట్టు.. మోడీ కవరేజీని కూడా అంతే పద్ధతిగా మీడియా ఫ్రెండ్లీగా చేశారు.

మొదట ఫొటోలు, ఆ తర్వాత ప్రధాని హుందాగా నడచి వచ్చే వీడియో, ఆ తర్వాత ఆయన ప్రసంగం... ట్వీట్లు, రీట్వీట్లతో సోషల్ మీడియా హోరెత్తింది. యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న సమయంలో ధైర్యంగా మోడీ సరిహద్దులో పర్యటించి సైనికుల్లో సమరోత్సాహాన్ని నింపారని ఆకాశానికెత్తేశారంతా. ఇదంతా నాణేనికి ఓవైపు.

మరోవైపు మోడీ ప్రచార ఆర్భాటాన్ని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. హెలికాప్టర్ దిగినప్పట్నుంచి, మోడీ కనపడిన ప్రతి ఫొటోను స్టార్ హీరో సినిమా స్టిల్ లా కనిపిస్తుంది. దీనికి తోడు సైనికులే చేతిలో కెమెరా పట్టుకుని ప్రధానిని ఫొటోలు తీయడం లాంటి సీన్లన్నింటినీ హైలెట్ చేస్తూ మోడీ వ్యతిరేక వర్గం విమర్శలు ఎక్కుపెట్టింది. చివరకు దేశ రక్షణను, సైన్యాన్ని కూడా ప్రచారానికి  వాడుకోవాలా అని చీవాట్లు పెట్టారు నెటిజన్లు.

ఇక చైనా దాడిలో గాయాలతో బాధపడుతున్న సైనికులకు మోడీ పరామర్శ మరో ప్రహసనం. ఆస్పత్రి బెడ్స్ మధ్య ప్రధాని చేతిలో మైక్ పట్టుకుని వారికేదో ఉపశమన వాక్యాలు చెబుతున్నట్టు మరికొన్ని ఫొటోలు బైటకొచ్చాయి. ఆ వెంటనే వీడియో కూడా. అసలా ఆస్పత్రి సెట్టింగ్ వేసినవాడికి ముందు జోహార్లు చెప్పాలంటూ సోషల్ మీడియాలో జోకులు పేలాయి. ఎంత సైనిక ఆస్పత్రి అయినా, కనీసం అక్కడి వాతావరణం చూస్తే ఆస్పత్రిలా కనిపించదు. ఏదో మోడీ వస్తున్నారు కాబట్టి అప్పటికప్పుడు అరేంజ్ చేసిన సెట్ అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. 

మొత్తమ్మీద సైనికుల క్యాప్ పెట్టుకుని, సైనికుల క్యాంప్ లో మోడీ గడిపిన సమయమంతా మాంచి రసవత్తరమైన ఎపిసోడ్ గా మారింది. సైనికుల త్యాగాల్ని కించపరచాలనే ఉద్దేశం ఎవరికీ లేదు. కానీ ఆ త్యాగాన్ని గుర్తించి, మెచ్చుకునే పద్ధతి ఇలా ప్రమోషన్ లా కాకుండా మరో విధంగా ఉంటే బాగుండేది. ఇండో-చైనా బోర్డర్ ని ప్రధాని సందర్శించడం బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం లాభదాయకమో అప్పుడే చెప్పలేం కానీ.. ఫొటోల రచ్చ మాత్రం మోడీని మరోసారి ప్రైమ్ మినిస్టర్ అలియాస్ పబ్లిసిటీ మినిస్టర్ అని విమర్శల పాలుచేసింది. ఆయన యాక్షన్ ఓటీటీకి ఎక్కువ, థియేటర్ కు తక్కువగా ఉందని సెటైర్లు పడుతున్నాయి.

ఇక నుంచి నో లంచం నో దళారీ

రఘురామకృష్ణంరాజు దిగజారిపోయాడు

Show comments