ఏపీలో కొత్తగా మరో 47 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 47 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 9136 శాంపిల్స్ ను పరీక్షించగా.. వీటిలో 47 మందికి పాజిటివ్ వచ్చినట్టు నిర్థారించారు. వీరిలో ఐదుగురు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఈ ఐదుగురిలో ముగ్గురిది చిత్తూరు కాగా.. ఇద్దరిది నెల్లూరు.

తాజా ఫలితాలతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2561కు చేరింది. వీరిలో 1778 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లగా.. 727 మందికి చికిత్స అందిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 56కు చేరింది.

కర్నూలు, చిత్తూరు, కృష్ణాలో అత్యథికంగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఆంక్షల్ని సడలించడంతో రాబోయే రోజుల్లో సమస్యాత్మక ప్రాంతాల నుంచి మరిన్ని కరోనా కేసులు పెరిగే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు.

అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కేసులు... కంటైన్మెంట్ జోన్ల నుంచే ఉండడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు ప్రజల్లో భయాందోళనలు తగ్గించేందుకు జిల్లాల వారీగా కేసుల సంఖ్యను, మృతుల సంఖ్యను వెల్లడించే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలిపివేసింది.

అపూర్వ ఘట్టానికి సంవత్సరం