పంద్రాగస్ట్ ఇక్కడేనట...!?

విశాఖ పేరుకు రాజధాని కాకపోయినా కొన్ని ముచ్చట్లు అలా తీరాయి. రాజధానిలో జరిగే అసెంబ్లీ సమావేశాలు ఎపుడో అంటే ఇప్పటికి 66 ఏళ్ళ క్రితమే జరిగాయి.

అంటే 1954 మే నెలలో విశాఖలోనే అప్పటి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు నెల రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. మే నెల మండుటెండలో చల్లదనాన్ని ఇచ్చే విశాఖలో వాతావారణం ఆనాడే ప్రభుత్వ పెద్దలకు నచ్చింది.

ఇక మంత్రివర్గ సమావేశాల ముచ్చటను కూడా మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు తీర్చేశారు. విభజన తరువాత నవ్యాంధ్ర తొలి సీఎం గా బాబు మొదటి సమావేశాలను విశాఖ వేదికగా నిర్వహించడం విశేషం. ఇక ఆయనే 2015లో విశాఖలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కూడా జరిపారు.

జగన్ సీఎం అయ్యాక గత ఏడాది ఆగస్ట్ 15 వేడుకలను విశాఖలో జరపాలనుకున్నారు. అయితే అది ఎందుకో కుదరలేదు. ఇక రిపబ్లిక్ దినోత్సవ వేడుకలను విశాఖలో జరపాలని గట్టిగానే తీర్మానించుకున్నారు. రాజకీయ పరిణామాల నేపధ్యంలో చివరి నిముషలో ఆ వేడుకలను విజయవాడలోనే జరిపారు.

ఇక మరో ఎనిమిది నెలల్లో జరగనున్న స్వాతంత్ర వేడుకలు మాత్రం విశాఖలోనే నిర్వహిస్తారని అంటున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు గట్టిగానే భరోసా ఇస్తున్నారు. అప్పటికి విశాఖ పరిపాలనా రాజధానిగా ఉంటుందని, దాంతో పంద్రాగస్ట్ విశాఖలోనే ఘనంగా జరుపుతామని అంటున్నారు.

ఓ విధంగా చూస్తే విశాఖ రాజధాని కాకపోయినా వైభవాలకు ఎపుడూ కొదవ లేకుండా ఉంది. ఇక మూడు రాజధానుల ప్రతిపాదనలు సాకారమైతే పూర్తి అధికారిక దర్జాతో విశాఖలో మువ్వన్నెల జెండా ఎగురుతుందేమో చూడాలి.

Show comments