ఉత్కంఠ: కాసేపట్లో కేబినెట్, వెంటనే అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రంలో కీలక మలుపునకు మరికాసేపట్లో బీజం పడబోతోంది. రాష్ట్రానికి 3 రాజధానుల అంశంపై మరికొద్దిసేపట్లో (9.30 గంటలకు) కేబినెట్ భేటీ కాబోతోంది. హై-పవర్ కమిటీ అందించిన తుది నివేదికపై చర్చిస్తుంది. నివేదికలోని అంశాల్ని కేబినెట్ ఆమోదిస్తుంది. ఆ వెంటనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమౌతాయి.

పరిపాలన-అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారు. దీనిపై చర్చను ప్రారంభిస్తారు. ఈ బిల్లులోనే 13 జిల్లాల అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలతో పాటు.. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా, న్యాయ రాజధానిగా కర్నూల్ ను ప్రతిపాదించే అంశాలున్నాయి. ఈ బిల్లు అసెంబ్లీలో పాస్ అయితే, రాష్ట్రానికి 3 రాజధానులు వచ్చినట్టే. ఇకపై జోన్ ల వారీగా పరిపాలన ఉంటుందన్నమాట. 

ప్రతిపక్ష పార్టీలన్నీ 3 రాజధానుల అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా టీడీపీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. తన స్వలాభం కోసం రాజధాని అంశాన్ని రాజకీయం చేసింది. అమరావతి ప్రాంత గ్రామ వాసుల్ని రెచ్చగొట్టి గడిచిన నెల రోజులుగా ఆందోళనలు చేయిస్తోంది. ఈ క్రమంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ. దీంతో అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. 

నిజానికి అమరావతి కేంద్రంగానే పాలన సాగించాలనేది ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశం. కాకపోతే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పరిపాలనను వికేంద్రీకరిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ, తాజాగా వచ్చిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. దాన్నే జగన్ అమలు చేస్తున్నారు. చంద్రబాబుకు మాత్రం ఇది ఇష్టంలేదు. విశాఖలో పరిపాలన రాజధాని పెడితే.. అమరావతిలో అతడి అస్మదీయుల రియల్ ఎస్టేట్ పడిపోతుందనేది బాబు భయం.

మూడు రాజధానులకు సంబంధించిన పరిపాలన-అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ చట్టాన్ని రద్దుచేసి, ఆ బాధ్యతల్ని విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి (VGMT)కి బదలాయించే చట్టం కూడా ఈరోజు అసెంబ్లీలో చర్చకు రానుంది. అసెంబ్లీలో ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఉంది కాబట్టి ఈ బిల్లులు చట్టాలుగా మారడం లాంఛనం మాత్రమే. 

అయితే మండలిలో మాత్రం జగన్ సర్కార్ కు కాస్త ఇబ్బందికర పరిస్థితులున్నాయి. అక్కడ టీడీపీకి కాస్త ఎక్కువ మెజారిటీ ఉండడం వల్ల బిల్లుల్ని అడ్డుకోవాలని టీడీపీ ఆలోచిస్తోంది. అయితే ఈ విషయంలో జగన్ మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. అవసరమైతే మండలినే రద్దుచేయాలని ఆలోచిస్తున్నారు. అదే కనుక జరిగితే పరిపాలన వికేంద్రీకరణను అడ్డుకోవడం ఇక ఎవరితరం కాదు.

Show comments