ఈరోజు చంద్రబాబు డ్రామాలు సాగవు

అమరావతి కోసం జరుగుతున్న ఆందోళనలకు ఇప్పటివరకూ చంద్రబాబు అనుకున్నంత సింపతీ రాలేదు. అక్కడక్కడా అరెస్ట్ లు అయినా, వెంటనే వారిని విడుదల చేయడంతో పరిస్థితి చేయిదాట లేదు. గ్రామాల్లో పోలీసుల కవాతు జరిగినా, ఇతర ప్రాంతాల్లో చంద్రబాబు జోలె పట్టి విరాళాలు సేకరించినా.. ఓ వర్గం మీడియాలోనే వచ్చింది కాబట్టి ఎవరూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. 

ఇప్పుడు చంద్రబాబుకి బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ సమావేశాన్ని అడ్డుకుని ఆందోళనకారులతో అసెంబ్లీని ముట్టడించి నానా రభసా చేసి ఎలాగైనా దీన్ని జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలని అనుకుంటున్నారు బాబు. ఒకరోజు ముందుగానే దీనికోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఆదివారం ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర జరిగిన ఆత్మహత్య హైడ్రామా దీనికి శాంపిల్ మాత్రమే. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయని తెలుస్తోంది. పెట్రోల్ పోసుకుకోవడాలు, బిల్డింగ్ లు ఎక్కడాలు.. చాలా చాలా చేయాలనే టీడీపీ నేతలు పథక రచన చేశారు. 

అయితే వీటిని ఆచరణలో పెట్టడమే వీరికి అసాధ్యం అనిపిస్తోంది. ఈసారి బాబుకు అంత స్కోప్ దక్కకపోవచ్చు. ఎక్కడికక్కడ పోలీసులు రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. అల్లరి మూకల్ని, అలజడికి కారణం అవుతారనుకుంటున్న నేతల్ని ముందస్తుగానే హౌస్ అరెస్ట్ లు చేశారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రమే అసెంబ్లీలోకి ఎంట్రీ ఉంటుంది. వారు కూడా మరీ ఓవర్ యాక్షన్ చేస్తే అసెంబ్లీలోనే పెట్టి హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశాలు కూడా వెళ్లాయి. 

గతంలో ఆత్మకూరులో హత్యలు జరిగాయని చలో ఆత్మకూరు అనే కార్యక్రమానికి పిలుపునిచ్చి అభాసుపాలైంది టీడీపీ. అప్పట్లో చంద్రబాబుని కనీసం కారు కూడా దిగనీయలేదు పోలీసులు. ఇంటి గేట్లకు తాళం వేసి బైట పహారా కాశారు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీటవుతుంది అంటున్నారు. చంద్రబాబుకి ఏమాత్రం స్కోప్ లేకుండా శాంతియుతంగానే ఈ అలజడులన్నిటినీ అణచి వేయడానికి ఇటు పోలీసులు కూడా సిద్ధంగానే ఉన్నారు.

Show comments