ఇది మరీ టూమచ్‌: జనసేనకి కేంద్ర మంత్రి పదవి.!

భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో పాత మిత్రుడే మళ్ళీ కొత్తగా దొరికాడు. ఆయనెవరో కాదు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ఇసుక పోరాటం అన్నాడు.. రాజధాని అమరావతి కోసం ఉద్యమం అన్నాడు.. ఇంకేవేవో చెప్పాడు.. చివరికి, భారతీయ జనతా పార్టీ అడుగులో అడుగులేసుకుంటూ పయనమవడానికి సిద్ధమయ్యాడు జనసేనాని. ఇదేమీ అనూహ్యమైన విషయం కాదు.

ఎప్పుడో ఒకప్పుడు బీజేపీలోనో, టీడీపీలోనే జనసేన కలవాల్సిందేనని చాలామంది చాలా కాలంగా చెబుతూనే వున్నారు. ఎటూ టీడీపీ పుంజుకునే పరిస్థితి లేదు గనుక, జనసేనాని ముందు జాగ్రత్తగా బీజేపీతో చేతులు కలిపినట్లు అర్థమవుతోంది.

ఇంతకీ, బీజేపీతో కలవడం వల్ల జనసేనకు వచ్చిన లాభమేంటి.? అంటే, ఇప్పటికైతే ఏమీ లేదుగానీ.. ముందు ముందు జనసేనకు భారీ 'లబ్ది' చేకూరబోతోందంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. చిరంజీవికి కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర మంత్రి పదవి ఇచ్చినట్లు, బీజేపీ.. జనసేనకు కేంద్ర మంత్రి పదవి ఆఫర్‌ చేసిందన్నది ఆ గాసిప్స్‌ సారాంశం. తనకు బీజేపీ పెద్దలు ఎప్పుడో పదవుల్ని ఆఫర్‌ చేశారనీ, వాటికి తాను తలొగ్గలేదనీ గతంలో పవన్‌ కళ్యాణ్‌ చెప్పుకున్నారు.సో, ఆయన ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చిన పదవుల్ని వ్యక్తిగతంగా తీసుకోకపోవచ్చేమో.!

కానీ, జనసేన పార్టీలో ఈ మధ్య అత్యుత్సాహం ఎక్కువగా ప్రదర్శిస్తోన్న నాగబాబుకి మాత్రం పదవీ వ్యామోహం వుండకుండా వుంటుందా.? పైగా, బీజేపీ - జనసేన కలిశాక నాగబాబు ట్విట్టర్‌లో చెలరేగిపోతున్నారు. 'అవాకులు చెవాకులు' అనేది చిన్నమాటే ఇక్కడ. ఇంతలా నాగబాబు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటే, బీజేపీ ఆయనకు ఏదో ఒక పదవి ఇచ్చే అవకాశం వుండడం వల్లేనని అంటున్నారు.

ఆ పదవి కేంద్ర మంత్రి పదవేనంటూ అప్పుడే జనసైనికులు సోషల్‌ మీడియాలో హంగామా షురూ చేసేస్తుండడం గమనార్హం. కానీ, బీజేపీ.. అంతలా జనసేనకు ప్రాధాన్యత ఇస్తుందా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. జనసేన, ఆంధ్రప్రదేశ్‌లో జీరో.. ఓ ఎమ్మెల్యే ఆ పార్టీకి వున్నా లేనట్లే లెక్క. 'పదవుల గురించి జనసేన ఆశిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.. బేషరతుగానే ఆయన బీజేపీకి మద్దతివ్వడానికి వచ్చారు.. మేమేమీ ఆయన వద్దకు వెళ్ళలేదు..' అని బీజేపీ నేత ఒకరు బాహాటంగానే వ్యాఖ్యానిస్తుండడం కొసమెరుపు.

దేవుళ్ళని కూడా రోడ్డుమీదకి లాగుతున్నాడు

Show comments