నాగ‌బాబులో కొర‌వ‌డిన విచ‌క్ష‌ణ‌, వివేకం

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్న‌, ఆ పార్టీ నాయ‌కుడు నాగ‌బాబు మ‌ధ్య ‘జీరో’... ట్వీట్ వార్‌కు దారి తీసింది. బీజేపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో జ‌న‌సేనాని నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు చేగువేరా అంటూ తాను క‌మ్యూనిస్టుల కంటే పెద్ద క‌మ్యూనిస్టున‌ని చెప్పుకుంటూ వ‌చ్చాడు. చేగువేరా ఫిలాస‌ఫీకి విరుద్ధ భావ‌జాల‌మైన బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డంపై వామ‌ప‌క్షాలు, వైసీపీ విమ‌ర్శ‌ల దాడి మొద‌లు పెట్టాయి.

ఇందులో భాగంగా విజ‌య‌సాయిరెడ్డి ఓ ట్వీట్ చేశాడు.

‘గుండు సున్నా దేనితోనైనా క‌లిసినా, విడిపోయినా ఫ‌లితం జీరోనే. సున్నాను త‌ల‌పైన ఎత్తుకున్నా, చంక‌లో పెట్టుకున్నా జ‌రిగేద‌దే. ఇది ప‌దేప‌దే నిరూపిత‌మ‌వుతూనే ఉంటుంది. అయినా ప్ర‌యోగాల‌కు సాహ‌సించే వారు ప్ర‌య‌త్నిస్తూనే ఉంటారు. దెబ్బ‌తింటుంటారు. మ‌నం పాపం అనుకుంటూ వ‌దిలేయాలి’ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ ప‌వ‌న్ అన్న నాగ‌బాబుకు కోపం తెప్పించింది. ట్వీట్‌కు ఆయ‌న ప్ర‌తి ట్వీట్ చేశాడు. ఇంత‌కూ ఆయ‌న ట్వీట్ ఏంటంటే..

‘జీరో విలువ తెలియ‌ని వెధ‌వ‌ల‌కి మ‌నం ఏం చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం వూదిన‌ట్టే. ఈ రోజు సైన్స్ అండ్ మ్యాథ్స్ అండ్ కంప్యూట‌ర్స్ ఇంత డెవ‌ల‌ప్ అయ్యాయి అంటే సున్నా మ‌హ‌త్య‌మేరా చదువుకున్న జ్ఞానం లేని స‌న్నాసుల్లారా?’ అని పేర్కొన్నాడు.

విమ‌ర్శ‌కు ప్ర‌తివిమ‌ర్శ చేయ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు. రాజ‌కీయాల్లో అవ‌న్నీ స‌ర్వ‌సాధార‌ణం. కానీ నాగ‌బాబు హ‌ద్దులు దాటాడు. ఆయ‌న ట్వీట్‌లో విచ‌క్ష‌ణ‌, వివేకం కొర‌వ‌డ్డాయి.

ముఖ్యంగా ఆయ‌న ట్వీట్‌లో ....వెధ‌వ‌ల‌కి, మ‌హ‌త్య‌మేరా, స‌న్నాసుల్లారా అంటూ దూష‌ణ‌ల‌కు దిగాడు. ఇలాంటి ఆవేశపూరిత‌, అనాలోచిత ట్వీట్ల‌తో నాగ‌బాబు న‌వ్వుల‌పాల‌వుతున్నాడు. ఇప్ప‌టికైనా ఆయ‌న ఈ విష‌యాన్ని గ్ర‌హిస్తే మంచిది.

Show comments