'నిర్భయ' దోషుల ఉరి ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్‌...!

'నిర్భయ' కేసులో దోషులకు ఉరిశిక్ష ఎపిసోడ్‌ అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా మరో ట్విస్ట్‌ ఇందులో చోటు చేసుకుంది. ఉరిశిక్ష తప్పించుకోవడానికి, దీన్ని యావజ్జీవ శిక్షగా మార్పించుకోవడానికి  నలుగురు దోషులు ఇప్పటివరకు అనేక ప్రయత్నాలు చేశారు. వారు చేసిన ప్రయత్నాలన్నీ వీగిపోయి  చివరగా ఈరోజు ఫిబ్రవరి ఒకటో తేదీన ఉదయం 6 గంటలకు నలుగురినీ ఉరి తీయాలని డెత్‌ వారెంట్‌ జారీ అయింది. ఈ వారెంట్‌ జారీ కాగానే మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా తాజాగా సుప్రీం గడప తొక్కాడు. 2012 డిసెంబరు 16న ఢిల్లీలో నిర్భయ దారుణం జరిగింది. 

కేసు సుదీర్ఘ విచారణ తరువాత 2019 డిసెంబరు 16 దోషులను ఉరి తీస్తారని వార్తలు వచ్చాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం నలుగురు దోషులు అక్షయ్‌ సింగ్‌, ముఖేష్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మలను డిసెంబరు 16వ తేదీ తెల్లవారుజామున ఉరి తీయాల్సివుంది.  కాని అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ తన మరణశిక్షపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయడంతో ఉరి శిక్ష ఆగిపోయింది. ఆ తరువాత రివ్యూ పిటిషన్లు, క్యూరేటివ్‌ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయగా అవన్నీ తిరస్కరణకు గురయ్యాయి. న్యాయపరమైన అన్ని దారులు మూసుకుపోయాయి కాబట్టి జనవరి 22వ తేదీన ఉరి శిక్ష అమలు చేయాలని డెత్‌ వారెంట్‌ జారీ అయింది. 

మరో ఐదు రోజుల్లో ఉరిశిక్ష అమలు చేయాల్సివుండగా ఉరిశిక్షను వాయిదా వేయాలంటూ ముఖేష్‌ సింగ్‌ రాష్ట్రపతికి పిటిషన్‌ పంపాడు. ఆయన దాన్ని తిరస్కరించారు. దీంతో ఢిల్లీ కోర్టు శిక్ష అమలును ఫిబ్రవరి ఒకటో తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, గత నెలలోనే  (డిసెంబరు) దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా  హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశాడు. 'నేరం జరిగిన 2012 డిసెంబరు 16 నాటికి నేను మైనర్‌ను' అని ఇతని వాదన. అప్పుడు తాను మైనర్‌ని కాబట్టి తనను జువైనల్‌ చట్టం ప్రకారం విచారించాలన్నాడు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కోర్టుకు సమర్పిస్తామని ఇతని తరపు లాయరు ఏపీ సింగ్‌ చెప్పాడు. 

మరి పాపం తాను ఆ సమయంలో మైనర్ననని చెబుతున్నాడు కదా అనుకున్న కోర్టు ఈ కేసు విచారణకు తీసుకుంది.  తమకిక న్యాయం జరిగే అవకాశం లేదని నిర్భయ తల్లి కోర్టులో రోదించినప్పుడు పటియాల కోర్టు జడ్జి సతీష్‌ కుమార్‌ ఆమెను అనునయిస్తూ 'మీ పట్ల పూర్తి సానుభూతి ఉంది. మీ ఆవేదన అర్థం చేసుకోగలను. కాని వీళ్లకూ (దోషులకు) హక్కులుంటాయి. నేను చట్టానికి కట్టుబడి ఉండాలి' అన్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు పవన్‌ గుప్తా పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో అతను సుప్రీం కోర్టులో ఈ రోజు పిటిషన్‌ వేశాడు. 

ఉరితీత తేదీ ఫిబ్రవరి ఒకటో తేదీ కాబట్టి ఈలోగా సుప్రీ కోర్టు పవన్‌ గుప్తా పిటిషన్‌ విచారించి కొట్టేస్తుందేమో...! విచారణలో జాప్యం జరిగితే ఫిబ్రవరి ఒకటో తేదీ కూడా మార్చాల్సివస్తుంది. ఈ కేసులో మొత్తం దోషులు ఆరుగురు కాగా, నేరం జరిగిన సమయానికి ఒకడు మైనర్‌ కావడంతో వాడిని మూడేళ్లు జువైనల్‌ హోంలో ఉంచి విడుదల చేశారు. అలా అదృష్టంకొద్దీ వాడు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇక రామ్‌సింగ్‌ 2013లో జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి మిగిలిన నలుగురిని జైలు అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. 

Show comments