బాబు మీడియా తాట తీసిన బొత్స

వైసీపీ మంత్రి బొత్స మరోసారి ఫైర్ అయ్యారు. ఇప్పటికే చంద్రబాబు అనుకూల మీడియాపై పలుమార్లు విరుచుకుపడిన ఈ సీనియర్ నాయకుడు, ఈరోజు మరోసారి తన విశ్వరూపం చూపించారు. 

ఛానెళ్ల పేర్లు చెప్పి మరీ వాళ్లు ప్రసారం చేస్తున్న అవాస్తవాల్ని మీడియా ముందుంచారు. హై-పవర్ కమిటీ, ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు బొత్స.

అవాస్తవం-1
అమరావతి రాజధానికి సంబంధంచి చెన్నై ఐఐటీ ఓ నివేదిక ఇచ్చిందంటూ ఏబీఎన్-ఆంద్రజ్యోతి 2 రోజులుగా ఊదరగొడుతోంది. ఈ నివేదికను కూడా పక్కనపెట్టి జగన్ సర్కార్ వ్యవహరిస్తోందంటూ అవాస్తవాలు ప్రసారం చేస్తోంది. దీనిపై ఘాటుగా స్పందించారు బొత్స. చెన్నై ఐఐటీకి లేఖ రాయాలని, అలాంటి నివేదిక ఇచ్చామని ఐఐటీ సమాధానం చెబితే తలదించుకొని వెళ్లిపోతానని సవాల్ చేశారు.

అవాస్తవం-2
అమరావతి ప్రాంతంలో చంద్రబాబు శాశ్వత భవనాలు నిర్మించారట. వందల కోట్లు పెట్టి నిర్మించిన శాశ్వత భవనాల్ని వీడి, రాజధానిని తరలించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఈటీవీ-ఈనాడు కథనాలు ఇచ్చింది. దీనిపై కూడా సీరియస్ అయ్యారు బొత్స. తన పదవీకాలంలో ఎప్పుడైనా చంద్రబాబు.. అమరావతి నిర్మాణాల్ని శాశ్వత భవనాలుగా చెప్పార్ అని సదరు మీడియా ప్రతినిధిని నిలదీశారు. ఏ ఒక్క సందర్భంలోనైనా చంద్రబాబు, ఏ ఒక్క నిర్మాణాన్నైనా చంద్రబాబు శాశ్వత నిర్మాణంగా చెప్పారా అని సవాల్ విసిరారు.

అవాస్తవం-3
రైతుల అభిప్రాయాల్ని లెక్కలోకి తీసుకోకుండానే రాజధాని అంశాన్ని జగన్ ముందుకు తీసుకెళ్తున్నారట. అమరావతి ప్రాంత రైతులతో ఒక్కనాడు కూడా సంప్రదించలేదట. ఈటీవీ, ఏబీఎన్ సంయుక్తంగా ప్రసారం చేసిన ఈ వార్తల్ని తిప్పికొట్టారు బొత్స. అభిప్రాయాలు చెప్పాల్సిందిగా ఈ-మెయిల్ ఇచ్చామని, వాటికి లెక్కలేనన్ని అభిప్రాయాలు వచ్చాయన్నారు. తను కూడా స్వయంగా 5 గ్రామాల ప్రజలతో సంప్రదింపులు జరిపానని, వాళ్ల అభిప్రాయాలు తెలుసుకున్నానని అన్నారు. కావాలంటే ఆ ఫొటోలు కూడా మీడియాలో వచ్చాయని, చూసుకోమని గడ్డిపెట్టారు. అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. 

అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను గాలికి వదిలేస్తారనే ప్రచారంపై కూడా బొత్స తీవ్రంగా స్పందించారు. 25శాతం దాటిన నిర్మాణాల్ని కొనసాగిస్తామని, వాటిని వాడుకలోకి కూడా తీసుకొస్తామని స్పష్టంచేశారు. అమరావతి ఎప్పటికీ లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉంటుందని, ఇక్కడ సౌకర్యాల కోసం ఆ భవనాల్ని వాడుకుంటామని, దేన్నీ వృధాగా వదిలేయమన్నారు.

ఇక అమరావతి రైతుల ఆందోళనపై కూడా బొత్స సత్యనారాయణ స్పందించారు. కమిటీ అభిప్రాయాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, రైతుల పట్ల జగన్ సానుకూలంగా స్పందించారని అన్నారు. రైతులకు మేలు జరిగే విధంగా, గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలకు అనుగుణంగా, అవసరమైతే అంతకంటే ఎక్కువగానే రైతులకు లబ్ది చేకూరేలా కార్యాచరణ సిద్ధంచేయమని ముఖ్యమంత్రి సూచించినట్టు తెలిపారు.

Show comments