పవర్ స్టార్ కాదు... హంగ్రీ స్టార్

పవన్ తమ్ముడూ రా.. కలసి పోటీచేస్తాం, నీ తరపున నేను ప్రచారం చేస్తా, లక్షమంది జనాలను తీసుకొస్తానంటూ గతంలో జనసేనానిని ఆప్యాయంగా పిలిచిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఇప్పుడు ఆయన్ని చెడుగుడు ఆడుకున్నారు. బీజేపీతో జనసేన పొత్తుపై జనసైనికుల కంటే ఎక్కువ ఆగ్రహంతో స్పందించారు పాల్. 

సహజంగా కేఏపాల్ మాటల్ని ఎవరూ లెక్కలోకి తీసుకోరు కానీ.. 2019 ఎన్నికల్లో మాత్రం ఆయనో కామెడీ పీస్ గా మిగిలిపోయారు. కేవలం వైసీపీని ఓడించే ఒకే ఒక లక్ష్యంతో ఆ పార్టీ అభ్యర్థుల పేర్లను పోలిఉన్న అభ్యర్థులను రంగంలోకి దించి పరోక్షంగా టీడీపీకి సహాయం చేశారు పాల్. ఎన్నికల తర్వాత విదేశాలు పట్టుకు తిరుగుతున్న పాల్ అప్పుడప్పుడూ ఫేస్ బుక్ లైవ్ లతో హడావిడి సృష్టిస్తున్నారు. తాజాగా జనసేన, బీజేపీ పొత్తుపై మాట్లాడేందుకు సోషల్ మీడియాలోకి వచ్చిన పాల్.. పవన్ అధికార కాంక్షపై మండిపడ్డారు. 

పవన్ కి పవర్ హంగ్రీ అంటూ ధ్వజమెత్తారు కేఏ పాల్. 2019 ఎన్నికలకు ముందు మాయావతి కాళ్లు పట్టుకున్న పవన్, ఆమె ప్రధాని అయితే, తాను ముఖ్యమంత్రి అయిపోవచ్చనే ఆలోచన చేశారని, ఇప్పుడు ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా జగన్ పాలన బాగుందని, జగన్ కి సపోర్ట్ చేయడం మన విధి అంటూ సలహా ఇచ్చారు కూడా. 

గతంలో జగన్ ని వాడు వీడు అన్న పాల్.. ఇప్పుడెంతో మర్యాదగా మాట్లాడటం ఆశ్చర్యకరం. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో జగన్ కి సపోర్ట్ చేస్తానని, జిల్లాల్లోని ప్రధాన పట్టణాల్లో హైటెక్ సిటీలు కట్టేందుకు సహకరిస్తానని వేల కోట్ల ఆదాయం తెచ్చిపెడతానని కూడా రెచ్చిపోయారు. పాల్ మాటలు ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ.. పవన్ కల్యాణ్ కి మాత్రం సరైన ట్యాగ్ ఇచ్చారు. పవర్ హంగ్రీ స్టార్ అనేశారు.

Show comments