జ‌న‌సేన ఎమ్మెల్యేకి షోకాజ్ నోటీస్‌

జ‌న‌సేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌కి జ‌న‌సేన అధిష్టానం గురువారం షోకాజ్ నోటీస్ పంపింది. కాకినాడ‌లో పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన రైతు సౌభాగ్య దీక్ష‌కు ఎమ్మెల్యే హాజ‌రు కాక‌పోవ‌డంతో అధిష్టానం సీరియ‌స్ అయ్యింది. రెండురోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు. ఈ మేర‌కు జ‌న‌సేన అధ్య‌క్షుడి రాజ‌కీయ కార్య‌ద‌ర్శి పి.హ‌రిప్ర‌సాద్ మీడియాకు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాడు.

రెండురోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వ‌ని ప‌క్షంలో స‌స్పెండ్ చేసేందుకు వెనుకాడేది లేద‌ని హెచ్చ‌రించారు. త‌ల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి, సొంత లాభాల కోసం ప‌నిచేసుకునే వారు ఎవ‌రైనా, ఏ స్థాయిలో ఉన్న‌వారైనా స‌రే క్ష‌మించేది లేద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్  హెచ్చ‌రించిన‌ట్టు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. పార్టీని వీడి ఎంత మంది వెళ్లినా, మ‌ళ్లీ ఒక‌టి నుంచి మొద‌లు పెట్టి అధికారంలోకి వ‌చ్చేందుకు , ఎలాంటి త్యాగాల‌కైనా సిద్ధంగా ఉండాల‌ని కోరారు.

కాగా అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా బుధ‌వారం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల మాధ్య‌మం ప్ర‌వేశ పెట్ట‌డంపై జ‌న‌సేన ఎమ్మెల్యే మాట్లాడుతూ జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నాన‌ని చెప్పారు. ప్ర‌భుత్వ పాఠశాల‌ల్లో ఎక్కువ‌గా బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన పిల్ల‌లే చ‌దువుకుంటార‌ని, తాను ఓ ద‌ళిత ఎమ్మెల్యేగా జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యానికి బాస‌ట‌గా నిలుస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే అసెంబ్లీ సమావేశాల కార‌ణంగా తాను ప‌వ‌న్‌క‌ల్యాణ్ దీక్ష‌కు వెళ్ల‌లేనని ముందుగానే ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఈ నేప‌థ్యంలో ఒక‌వైపు రెండురోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరుతూనే, మ‌రోవైపు ఏ స్థాయి వ్య‌క్తులైనా క్ష‌మించేది లేద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌గా ఆ పార్టీ నేత హ‌రిప్ర‌సాద్ గురువారం ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Show comments