తూకం రాళ్లు మర్చిపోయిన జర్నలిజం!

-తలా తోకా లేని ప్రాధాన్యాలు
-రాజకీయంగా వక్రబంధాలు
-వ్యాపారం కోసం ప్రమాణాలకు తిలోదకాలు

ఒక సంఘటన జరిగితే దాని ప్రాధాన్యాన్ని తూకం వేయడంలో, సదరు ఘటన యొక్క మంచి చెడులను నిర్ణయించడంలో.. దానికి ఏ స్థాయి ప్రచారం కల్పించాలో, ఎంతమేరకు, ఎంత త్వరగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే విషయంలో పాత్రికేయుల అనుభవం, పరిణతి బయటపడేది. కానీ, ప్రధానంగా రాజకీయాలతో ముడిపడిన అంశాల ప్రాధాన్యాల విషయంలో మనకు మీడియాలో చాలా తప్పులు కనిపిస్తుంటాయి. అన్ని ఛానళ్లలో సమానమైన అనుభవం, పరిణతి ఉన్నవారు ఉండకపోవచ్చు. అందువల్లనే ఒక మీడియాకు మరొక మీడియాకు మధ్య ప్రాధాన్యాల విషయంలో తేడా వస్తుంటుంది. ఎవరి పరిణతిని వారు సహజంగానే సమర్థించుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో పత్రికల్లో కథనాల్ని చూసినప్పుడు.. ప్రజలు విస్తుపోతుంటారు.

నిజానికి ప్రజలందరూ ఆశించే కవరేజీ ఒక రకంగా ఉంటుంది.. కానీ కొన్ని మీడియా సంస్థలు పూర్తి విరుద్ధంగా తమ కథనాల్ని అందిస్తుంటాయి. సాధారణ సంఘటనలకు రాజకీయ లింకులు ఉండేప్పుడు, అలాగే రాజకీయ వార్తల విషయంలో ఇలా తరచుగా 'తేడా' కొడుతుంటుంది. ఈ కోణంలోంచి చూసినప్పుడు తెలుగు మీడియా మూడు రకాలుగా విడిపోయింది. ఒకటి- వార్తల తాలూకు కరెక్టు ప్రాధాన్యాలు తెలిసినవాళ్లు. రెండు- ప్రాధాన్యాలు తమకు ఏమాత్రం తెలియకపోయినా.. ఇతరులను గమనిస్తూ.. వారు ఎలాపోతే.. తాము అలా నడుస్తుండేవాళ్లు. మూడు- ప్రాధాన్యాలు తెలిసినా, తెలియకపోయినా తమ వ్యాపార ప్రయోజనాల ప్రకారం మాత్రమే వ్యవహరించే వాళ్లు..!

ఇవన్నీ ఎప్పటినుంచో ఉన్న అనుమానాలే! అయితే తాజాగా మరోసారి ఆలోచనల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా ప్రత్యర్థి రాజకీయ కూటములకు సంబంధించి.. రెండు పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు వాటికి పత్రికలు ఇచ్చిన ప్రాధాన్యాలు ఈ అనుమానాలకు కారణం అవుతున్నాయి. ఒకే ఒక్క జీవోతో 1.98 లక్షల ఉద్యోగాలకు అర్హులను ఎంపిక చేయడం అనేది చారిత్రాత్మకమైన సంగతి. రాష్ట్రంలో సోమరి పోతులు ఉండాల్సిందే తప్ప.. పనిలేని వాళ్లు/ పని దొరకని వాళ్లు ఉండడానికి వీల్లేదు.. అన్నట్లుగా ముందుకు అడుగులు వేస్తున్న జగన్మోహన రెడ్డి ప్రభుత్వం అందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల వారందరూ కూడా.. 75శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలనే నిబంధన కూడా.. రాష్ట్రంలో నిరుద్యోగితను రూపుమాపే మంత్రమే.

ఇలాంటి నిర్ణయాలకు కూడా ప్రతిపక్షాలు కుళ్లు విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. అలాంటిది.. ఒకేసారి 1.98 లక్షల మందికి శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వోద్యోగాలు ఇవ్వడం అనేది చరిత్రలో లేని సంగతి. అలాంటి అరుదైన ఘనతను జగన్మోహన రెడ్డి ప్రభుత్వం రికార్డు చేసిన రోజున.. చంద్రబాబునాయుడు, ప్రభుత్వం మీద తన అక్కసును వెళ్లగక్కడానికి గవర్నరుతో భేటీ కావడంతో పాటు ఒక ప్రెస్‌మీట్‌ పెట్టారు. అయిదు నక్షత్రాల హోటల్లో విందుభోజనం ఏర్పాటు చేశారు. తెరవెనుక.. ఆయా పాత్రికేయ మాన్యులకోసం ఇంకా ఏమేం ఏర్పాట్లు చేసి ఉంటారో తెలియదు. ఇంత ఘనమైన రికార్డును తన ప్రభుత్వం నమోదు చేసినప్పటికీ.. జగన్మోహన రెడ్డి చాలా సింపుల్‌గా టీవీ ఛానెళ్ల కెమెరాలను కూడా అనుమతించకుండా ఒక ప్రెస్‌మీట్‌ పెట్టి.. అంతటితో చేతులు దులుపుకున్నారు. జగన్మోహన రెడ్డికి ప్రచారకాంక్ష లేకపోవచ్చు గాక..!

ప్రచారమే ప్రాణం అని ఆయన నమ్మకపోవచ్చు గాక.. కానీ.. మీడియా తెలివిడితనం ఏమైంది. ఏది ప్రధానమో గుర్తించడంలో మీడియా గుడ్డిగా వ్యవహరిస్తే ఎలా? చంద్రబాబు చక్కటి విందుభోజనం పెట్టించారు కదాని.. ఆయనకు బాకా ఊదడానికే ప్రధాన మీడియా స్రవంతి పోటీపడినట్లుగా వ్యవహారం సాగిపోయింది. (పత్రికలు- అంటూ తరచుగా వాడుతున్న పదం.. అటు పత్రికలకు, టీవీ చానళ్లకు కూడా జమిలిగా వర్తిస్తుందని గమనించాలి.)

తూకం తెలిసింది ఎందరికి?
జర్నలిజం విలువల్ని ప్రమాణాలను తూకం వేయగల దమ్ము ఇప్పుడు ఎందరు జర్నలిస్టులకు ఉంది. ఎన్ని సంస్థలకు ఉంది. ఆ సంస్థల్లోని నిర్ణయాత్మక శక్తులుగా వెలుగొందుతున్న వాళ్లు ఎందరు.. తూకంరాళ్లు తెలిసిన సమర్థులు ఉన్నారు? ఎందరు అమ్ముడుపోకుండా ఉంటున్నారు? తాము కెలక్కుండా.. జర్నలిస్టులకు స్వేచ్ఛఇచ్చి.. ప్రాధాన్యాల విషయంలో వారు సొంత, సబబైన నిర్ణయాలను తీసుకునేలా.. ఎంతమంది యజమానులు సహకరిస్తున్నారు?... ఇవన్నీ కూడా మిలియన్‌ డాలర్‌ ప్రశ్నలే.

ప్రాధాన్యాలను నిర్ణయించగల సామర్థ్యపు కోణంలోంచి.. జర్నలిస్టుల జాతి మూడు ముక్కలుగా విడిపోయిందని ముందే చెప్పుకున్నాం. నిజాయితీగా ప్రాధాన్యాలు తెలిసినవారు ఉన్నారు. కానీ... వారు రాజకీయ పార్టీలతో ముడిపడిపోయిన పత్రికలకు ప్రతినిధులుగా మాత్రమే కొనసాగుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల మీద తెలుగుదేశం అనుకూల ముద్ర ఉంది. ఇక సాక్షి విషయానికి వస్తే.. అది ప్రభుత్వ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కరపత్రంలాగా మాత్రమే ఉంటుందనే విషయంలో సందేహం లేదు. అంతర్జాతీయ వ్యవహారాలు, బిజినెస్‌, క్రీడలు, ఇతర ఫీచర్‌ అంశాల విషయంలో సాక్షి దినపత్రిక ఎంత అద్భుతమైన ప్రాధాన్యాలతో అలరారుతూ ఉంటుందో రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాల దగ్గరకు వచ్చేసరికి అంతే బాహాటంగా.. తమ జగన్‌ అనుకూల ప్రేమను ప్రదర్శించుకుంటూ ఉంటుంది.

దీనివలన ఆ పత్రిక జగన్‌కు చేస్తున్న మేలు కూడా ఏమీ ఉండదనేది సత్యం. ఈనాడు పత్రికది పిల్లి పాలు తాగే నీతి. ఒళ్లంతా పచ్చరంగు పులుముకుని నర్తిస్తూనే.. తమను ఎవరూ గుర్తించడం లేదని.. అనుకుంటూ ఉంటుంది. గుర్తించకూడదని కోరుకుంటుంది. ఆంధ్రజ్యోతి వ్యవహారం బరితెగింపు. పచ్చకూటమికి తైనాతీ పనిచేస్తూ దానికి దమ్మూ, ధైర్యం ఉన్న జర్నలిజం అంటూ పడికట్టు ముసుగులు వేసుకుని... పతనం వైపు వెళ్లిపోతుండడం వారికి మాత్రమే చెల్లిన విద్య. ఆ రకంగా  ఒకటో కేటగిరీకి చెందిన, ప్రాధాన్యాలు తెలిసిన, తూకం రాళ్లు ఉన్న వాళ్లంతా.. పార్టీలతో ముడిపడిన పత్రికల్లో ఉండిపోయారు. ఇకపోతే... రెండో కేటగిరీ వాళ్ల పరిస్థితి. వారికి ప్రాధాన్యాలు తెలియవు. అంతటి ఉద్ధండ జర్నలిస్టులు వారికి అందుబాటులో ఉండరు. ఉన్నవాళ్లు.. ఏదో  ఒకటిరెండు ఇతర సంస్థలను ఫాలో అయిపోతూ.. వారి బాటలో నడుస్తుంటారు.

మూడో కేటగిరీ వాళ్లకు అంతకు మించిన స్పష్టత ఉంటుంది. వాళ్లకు అసలు జర్నలిజం ప్రమాణాల తూకం రాళ్లు అవసరమే లేదు. వారు ప్రాధాన్యాల గురించి ఆలోచించరు పట్టించుకోరు. ఏం జరిగినా సరే సంబంధిత వ్యక్తులతో బేరంపెట్టడం మాత్రమే వారికి తెలిసిన విద్య. బేరంలో ఎవరు ఎక్కువ పాట పాడుకుంటే.. వారికి అనుకూల ప్రచారం నిర్వహించడం మాత్రమే. తాజాగా ప్రస్తావించిన గురువారం నాటి విషయాల్లో కూడా ఇలాంటి మూడురకాల నీతులే పెచ్చరిల్లాయి. జగన్మోహన రెడ్డి రెండులక్షల ఉద్యోగ నియామకాల గురించి.. సాదాసీదా కవరేజీ వచ్చింది. చంద్రబాబు నాయుడు వెళ్లగక్కిన పాచిపోయిన ఆవేదనకు అనల్పమైన ప్రాధాన్యం దక్కింది. ఎక్కడి మీడియా విలువలు, ప్రమాణాలు ఇవన్నీ?

శవరాజకీయం.. శవ జర్నలిజం..
శవరాజకీయం అనేమాట మనం తరచూ వింటూ ఉంటాం. ఎవరైనా చస్తేచాలు. ఆ చావునుంచి ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు పొందాలా? అని ఉబలాటపడిపోయే వాళ్ల గురించిన వ్యాఖ్యలు అలాంటి పదాలతో వినిపిస్తుంటాయి. కానీ శవ జర్నలిజం కూడా కొత్తగా మొదలైనట్లుగా మన రాష్ట్రంలో కనిపిస్తోంది. కోడెల హత్యోదంతం నుంచి ఇలాంటి అనుమానాలు పుడుతున్నాయి. నిజానికి పచ్చకామెర్లు సోకిన మీడియా సంస్థలు.. గోదావరి లాంచీ ప్రమాదం నాటినుంచే తమ పైత్యం ప్రదర్శించడం మొదలైంది. అచ్చంగా జగన్‌ చేతగానితనం వల్ల.. లాంచీ మునిగిపోయిందని ప్రజలు అనుకోవడం లక్ష్యంగా కథనాలకు ఎన్ని రంగులు పులిమి వండి వార్చారో అగణ్యం. కోడెల మరణించినప్పటి నుంచి అలాంటి వారంతా మరింత పెట్రేగిపోయారు. జగన్‌ స్వయంగా పురమాయించి.. ఆయనను ఆత్మహత్యకు ప్రోత్సహించాడు.. అని ప్రజలు అనుకోవాలి... అన్నదే లక్ష్యంగా కథనాలు వచ్చాయని మనకు అనిపిస్తే అతిశయోక్తి కాదు.

చంద్రబాబునాయుడు ఇవాళ తాను కోడెలను చిన్నచూపు చూసిన సంగతి బయటకు వచ్చేసరికి కంగారు పడుతున్నారు. సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్నిచర్‌ చోరీ, అక్రమ తరలింపు వ్యవహారానికి సంబంధించి నమోదైన కేసులపై ఇప్పుడు ఆయన కేసు నెంబర్లను, సెక్షన్లను కూడా పేర్కొంటూ గవర్నరుకు ఫిర్యాదు చేశారు. మంచిదే. మరి కేసులు పెట్టినప్పుడు ఆయన జ్ఞానం ఏమైపోయింది. చచ్చిపోయేంతగా ప్రభుత్వం ఒత్తిడికి గురిచేసిందని అంటున్న చంద్రబాబు... కోడెల చచ్చిపోయేవరకు, ఒక్కరోజైనా కోడెలకు మద్ధతుగా ప్రెస్‌మీట్‌ పెట్టారా? ఆయనతో కలిసి విలేకర్లతో మాట్లాడారా? ఇప్పుడు చెబుతున్న కల్లబొల్లి కబుర్లన్నీ ఆరోజు చెప్పగలిగారా? అంటే జవాబులేదు. ఆయన శవరాజకీయం చేస్తూ పెట్రేగుతోంటే.. శవ జర్నలిజం వంత పాడుతోంది. ఇక ఈ బురదగుంటల్లో ప్రమాణాలను ఎక్కడ వెతుక్కోవాలి?

అలాంటి నిషేధం తప్పే...
అనధికారిక ఉత్తర్వులతో అయినా.. ఏబీఎన్‌ ఛానెల్‌ ప్రసారాలు నిలిచిపోయేలా జగన్‌ ప్రభుత్వం వ్యవహరించి ఉంటే అది ఖచ్చితంగా తప్పే. మీడియా.. రాజకీయ రంగులు పులుముకోవడం కొత్త సంగతి కాదు. అందులో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతికి మరింత బరితెగింపు మాత్రమే. అలాగని వారి కథనాలకు జగన్‌ సర్కారు ఉలికిపడడం అనవసరం. ఆ కథనాలను కేవలం పచ్చ ప్రియత్వం ఉన్నవారు మాత్రమే చూస్తారు. కరడుగట్టిన తెలుగుదేశం అభిమానులు, ఉన్మాదులు తప్ప మరెవ్వరూ చూడని ఛానెల్‌ అది. అలాంటి దానిని నిషేధించడానికి జగన్‌ సర్కారు ప్రయత్నించడం కూడా దండగే. ప్రసారాలు ఆగిపోవడం వెనుక ప్రభుత్వం ఉంటే అది అనాలోచిత చర్యే. కానీ.. తాము జర్నలిజం విలువలను తుంగలో తొక్కేసి.. చెలరేగడానికి ఆ మీడియా సంస్థ అయినా.. ఈ సాకులను చూపించుకోవడం కరెక్టు కాదు.

గురువారం నాటి రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ విశ్లేషించడం.. కేవలం ఒక ఉదాహరణ కోసం మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పాలకపక్షం- ప్రతిపక్షం వార్తలకు దక్కుతున్న ప్రాధాన్యాల ఔచిత్యం ఏ సమయంలో గమనించినా.. ఈ విశ్లేషణ గుర్తుకువస్తుంది. పరిణామాలను తూకం వేయడంలో మీడియాకు  సొంత వివేచన ఉండాలి. ఎవరు ఎక్కువ నిడివిగల పెద్ద ప్రెస్‌నోట్‌ పంపారో.. ఎవరు ఎక్కువ బరువు గల కవరు ఇచ్చారో.. అదే ప్రధానమైన, ముఖ్యమైన వార్త అని అనుకుంటూ చెలరేగితే ఎలా? మీడియాలో పత్రికల్లో కథనాలు ప్రజల్లో ఆలోచనను పుట్టించేరోజులు ఎప్పుడో పోయాయి.

'ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక' అంటూ జర్నలిజానికి చెప్పుకున్న నిర్వచనాలు కేవలం గత వైభవం మాత్రమే. ఇవాళ్టి రోజుల్లో.. ప్రజల్లో కదలిక తేవడం కాదు కదా.. కనీసం వారి నమ్మకాన్ని పొందడం కూడా అసాధ్యమే. పత్రికలను ప్రజలు అభిప్రాయాల కోసం, ఆలోచనలకోసం చదవడం ఎన్నడో మానేశారు. కేవలం సమాచారం కోసం మాత్రమే చూస్తున్నారు. ఇప్పటికే ప్రజల దృష్టిలో నమ్మకం అంతగా దిగనాసిల్లిపోయింది. అలాంటప్పుడు సమాచారం అందించడంలో కూడా.. కురచబుద్ధుల ప్రదర్శిస్తే.. మీడియా పరువు మరింతగా పోతుంది.

న్యూస్‌ నోస్‌ అని పెద్దలు అంటుంటారు. అంటే వార్తను (దాని ప్రాధాన్యాన్ని) పసిగట్టగల, వాసన పట్టగల శక్తి సామర్థ్యాలు అన్నమాట. ఆ నిర్వచనం ప్రకారం చూస్తే.. ఇవాళ్టి మన మీడియా సహచరులకు 'న్యూస్‌ నోస్‌' కాదు కదా.. కేవలం 'న్యూస్‌ టంగ్‌' మాత్రమే ఉన్నట్లుగా కనిపిస్తోంది. వారికి ఘ్రాణగ్రంథులు పనిచేయవు. కేవలం నాలుక మీద గల రుచిగ్రంథుల మాత్రమే పనిచేస్తాయి! నాలుకకు ఎంత చక్కటి రుచి అందింది అనేదాన్ని బట్టి... అంత గొప్ప కవరేజీ దక్కుతుంది. ఆమ్యామ్యాల గడ్డిపెడితే గనుక మరింత చక్కటి అత్యద్భుతమైన కవరేజీ కూడా దక్కుతుంది. 

సినీ ఇండస్ట్రీలో ఈ ఫీలింగ్స్‌ మరింత ఎక్కువ

Show comments