ఎమ్మెల్యేగా నెగ్గని పవన్ దగ్గరకా.. కాంగ్రెస్ దౌర్భాగ్యం!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్య పరిస్థితి మరో రకంగా హైలెట్ అవుతూ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేతిలో సీట్లు లేకపోవచ్చు. నేతలు అమ్ముడుపోయి ఉండొచ్చు. అయితే ఆ పార్టీకి అంటూ ఒక ఓటు బ్యాంకు ఉంది. కొన్ని సామాజికవర్గాల్లో పట్టుంది. భవిష్యత్తులో అయినా తెలంగాణలో కాంగ్రెస్  కోలుకుంటుందనే లెక్కలేఉన్నాయి. ఇలాంటి క్రమంలో అలాంటి ఆశలు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మాత్రం ఉన్నట్టుగా లేవు. అందుకే  వారు చివరకు పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

కాంగ్రెస్ వాళ్లే ఈ విషయంలో మండిపడిపోతూ ఉన్నారు. పవన్ కల్యాణ్ ఎంత..అతడి స్థాయెంత..అంటూ కొందరు కాంగ్రెస్ నేతలు కారాలూమిరియాలూ నూరుతున్నారట. కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన పవన్ కల్యాణ్.. అది కూడా రెండు చోట్ల పోటీ చేసిన అతడి దగ్గరకు కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఎగేసుకు వెళ్లారని, పవన్ పిలవగానే వీళ్లు ఉరికారని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే విమర్శలు చేస్తూ ఉన్నారు.

యూరేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అంటూ.. పవన్ కల్యాణ్ నిర్వహించిన మీటింగులో కాంగ్రెస్ వాళ్లు కనిపించారు. తెలంగాణలో పవన్ కు ఏం సంబంధం? ఆంధ్రా ఎన్నికల్లో అతడి సత్తా ఏమిటో బయటపడింది కదా.. అలాంటి వ్యక్తి  దగ్గరకు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్లడంపై కాంగ్రెస్ లోనే అసహనం కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో వారు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారట.

సినిమా హీరో అని..ఎగేసుకుని వెళ్లే సాదాసీదా జనాలకూ, వీళ్లకూ పెద్దగా తేడా లేదని వారు వాపోతూ ఉన్నారు. అలాగని పవన్ ఏ అంశం మీద ఎప్పుడు ఎలా స్పందిస్తారో ఎవరికీ తెలీదు. రేపోమాపో కేసీఆర్ ను గట్టిగా ప్రశంసిస్తూ అతడు మాట్లాడినా మాట్లాడవచ్చు. అప్పుడు వీళ్లు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారనే ప్రశ్నలూ వ్యక్తం అవుతున్నాయి. ఏపూటాకాపూట మాట్లాడే పవన్ ను నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్స్ పరువును తీసుకుంటోందని ఆ పార్టీ అభిమానులు వాపోతున్నారు!

Show comments