లోకేషా.. ఏమిటీ శ్రీరంగ నీతులు.. మీరు మారరా!

చెప్పేవి శ్రీరంగనీతులు.. దూరేవి అవేవో కొంపలట! తనదాకా వస్తేకానీ.. నొప్పి తెలియదట.. తను చేస్తే శృంగారం వేరే వాళ్లు చేస్తే వ్యభిచారమట.. ఇదీ శ్రీమాన్ నారాలోకేష్ గారి తీరు. అందుకు నిదర్శనం ఆయన పెట్టిన తాజా పోస్టే. ఇంతకీ ఆయన ఏమంటారంటే..

'@ysjaganగారూ! అసలీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్టా లేనట్టా? మీ గుడ్డి సర్కారుకు ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు కనపడట్లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి పై ఇలాంటి పోస్టు పెట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోడానికి చేతులు రావట్లేదా? చట్టాలు లేవా? మీ చట్టాలన్నీ తెదేపా అభిమానులమీద కేసులు పెట్టడానికేనా?'

ఇదండీ కథ. మార్ఫింగ్ పోస్టుల గురించి లోకేష్ గారు మాట్లాడారు. బహుశా ఈ టాపిక్ గురించి మాట్లాడటానికి తెలుగు రాష్ట్రాల్లో అర్హతలేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ తప్ప మరెవరూ కాదు. ఫొటోలను మార్ఫింగ్ చేసి అడ్డంగా దొరికిపోయిన చరిత్ర ఉన్న లోకేష్, చంద్రబాబులు.. ఇప్పుడు ఇలా గగ్గోలు పెడుతూ ఉన్నారు.

ఇక ప్రతిపక్ష నేత ఫొటోలను మార్ఫింగ్ చేయడం గురించి లోకేష్ గగ్గోలు పెడుతూ ఉండటం మరో ప్రహసనం. వెనుకటికి జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు టీడీపీ అధికారిక ఫేస్ బుక్ పేజీల్లో ఎంతటి దారుణమైన మార్ఫింగ్ ఫొటోలు పెట్టారో అందరికీ తెలిసిన సంగతే. అలాంటి లత్కోర్ పనులు అధికారిక అకౌంట్ల నుంచి చేయించినప్పుడు లోకేష్ కు ఆనందం అనిపించింది.

ఇప్పుడు ఎవరో అనామకులు నడిపే పేజీల్లో మార్ఫింగ్ చేస్తే మాత్రం నొప్పి తీవ్రంగా ఉంది. తన తండ్రి మార్ఫింగ్ ఫొటోలను పెట్టి, తర్వాత డిలీట్ చేస్తే అది గొప్పగా రుచించింది. ఇప్పుడు మాత్రం నొప్పిగా ఉంది. ఇలా వ్యవహరిస్తే ఎలా తనను జనాలు ఆమోదిస్తారని లోకేష్ అనుకుంటున్నారో ఆయనకే తెలియాలి.

'మీ బాబు..' అనే లేకి మాటలు ఉపయోగిస్తూ ట్వీట్లు పెట్టే లోకేష్ నుంచి ఇంతకన్నా ఎక్స్ పెక్ట్ చేయడానికి కూడా ఏమీలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

జగన్... గారాబం చేయడం నేర్చుకోవాలి!