తిరుమలలో ఈ నిర్ణయం భేష్!

తిరుమల గిరుల్లో శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో ఒక్కటొక్కటిగా ప్రశంసార్హమైన నిర్ణయాలు ప్రాణం పోసుకుంటున్నాయి. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న వెంటనే... ముందు ఎల్1 ఎల్2 వంటివి రద్దు చేసేశారు. ఇంకా పూర్తిస్థాయి బోర్డు ఏర్పడకపోయినప్పటికీ.. అనేకానేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. తిరుమలలో కాలుష్య నివారణకు బ్యాటరీ కార్లను ప్రవేశపెట్టే ఆలోచన కూడా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మరో గొప్ప నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ను పూర్తిగా నిషేధించాలని టీటీడీ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. తిరుమల గిరులపై ప్లాస్టిక్ కవర్ల వాడకం ఇప్పటికే నిషేధం. తిరుపతిలో కూడా ఇదే నిషేధాన్ని అమలు చేస్తున్నారు. సూపర్ మార్కెట్ లలో కూడా సరుకులు కొంటే గుడ్డ సంచులు ఇస్తున్నారు. చాలా స్ట్రిక్టుగా ప్లాస్టిక్ నిషేధం అమలవుతోంది. కానీ.. ప్యాకేజ్డ్ తాగునీరు పేరుతో.. వచ్చే ప్లాస్టిక్ సీసాలు పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి.

తిరుమలలో అతిథిభవనాలు, కాటేజీలకు పక్కగా వెనుకగా ఉండే నిర్మానుష్య ప్రాంతాలు ప్లాస్టిక్ సీసాలకు డంప్ యార్డుల్లాగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో టీటీడీ చేస్తున్న కొత్త ఆలోచన మరింత గొప్పదిగా కనిపిస్తోంది. తిరుమలలో ఎక్కడా.. తాగునీళ్లకు కూడా ప్లాస్టిక్ సీసాలు అనుమతించరాదని నిర్ణయం తీసుకోబోతున్నారు. భక్తులకు తాగునీటిపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ను టీటీడీనే అందించే కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తున్నారు.

భోజనం విషయంలో ఇలాంటి మంచి పరిణామం ప్రస్తుతం అమల్లో ఉంది. తరిగొండ వేంగమాంబ నిత్యాన్నదానసత్రంలో ఉదయం టిఫినుతో పాటు, మధ్యాహ్నం, రాత్రి వేళ్లలో భోజనం ఉచితంగా పెడుతున్నారు. ఉదయం టిఫిను తిరుమలలోని పలు ప్రదేశాల్లో కూడా టీటీడీ ఉచితంగానే భక్తులకు అందిస్తోంది. అదే తరహాలో.. తాగునీటిని కూడా పూర్తిగా టీటీడీ ద్వారా మాత్రమే అందించే  ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. తిరుమల గిరులు మరింతగా పర్యావరణ మైత్రితో పరిఢవిల్లుతాయని అనుకోవచ్చు.

జగన్నాటకంలో మంత్రులకు సీన్‌ సితారే?