భ్రమరావతిపై జగన్ ఆరా.. ముగిసిన కీలక సమీక్ష

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమరావతి భూములపై జగన్ నిగ్గుతేలుస్తారని అంతా ఎదురుచూశారు. ఆ సమయం రానే వచ్చింది. ఇప్పటికే ఓసారి సీఆర్డీఏ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టిన జగన్, ఈరోజు మరింత లోతుగా ఈ అంశంపై చర్చించారు. రాజధాని పేరిట గత ప్రభుత్వం సాగించిన అక్రమాల్ని, పారించిన అవినీతిని అధికారులు సాక్ష్యాలతో సహా జగన్ ముందుంచినట్టు తెలుస్తోంది.

రాజధాని భూములపై తొలి నుంచి అభ్యంతరం వ్యక్తంచేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కొన్ని వందలసార్లు జగన్ ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రజల్లో చర్చ జరిగేలా చేశారు. వేలకోట్ల రూపాయల అవినీతి జరిగి ఉంటుందని అప్పట్లో అనుమానించిన జగన్, ఇప్పుడు సీఎం హోదాలో వాటిపై నిజానిజాల్ని వెలికితీసే పని ప్రారంభించారు.

జగన్ అనుమానానికి తగ్గట్టుగానే అధికారులు కీలకమైన పత్రాల్ని, నివేదికల్ని ముఖ్యమంత్రికి అందించినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా రాజధాని భూములు, ఆ భూముల లీజులకు సంబంధించి చంద్రబాబు సర్కార్ గతంలో జారీచేసిన చీకటి జీవోలకు సంబంధించి అధికారులు జగన్ కు కీలక సమాచారం అందించినట్టు తెలుస్తోంది. వీటిలో సింగపూర్ కన్సార్టియం మొదలుకొని, కొన్ని ప్రైవేటు సంస్థలకు ఎన్ని ఎకరాల భూములు కేటాయించారనే సమాచారం స్పష్టంగా ఉంది. అంతేకాదు, ఆ భూమిని ఎంత చవకగా కట్టబెట్టారనే విషయాలు కూడా ఉన్నాయి.

నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు అమరాతిని రాజధానిగా ప్రకటించకముందు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు ఏడాదికి కనీసం 2 పంటలు పండించేవారు. ఎక్కడ చూసినా బంగారం పండేది. అలాంటి భూముల్ని రైతుల నుంచి లాక్కున్నారు బాబు. రాజధాని కోసం స్వచ్ఛందంగా రైతులే ముందుకొచ్చి భూమి ఇచ్చారంటూ అనుకూల మీడియాతో కలరింగ్ ఇచ్చుకున్నారు. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 33వేల ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకొని, గట్లు తీసేసి చదునుచేసి రాళ్లు పాతేశారు.

అలా భూమిని కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు ఎంత పరిహారం అందింది, ప్రస్తుతం ఆ కుటుంబాల స్థితిగతులు ఎలా ఉన్నాయనే అంశంపై కూడా జగన్ సమీక్ష నిర్వహించారు. వీటితో పాటు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, రాష్ట్రం ఎంత ఖర్చుపెట్టింది, ఎన్ని ప్రైవేటు కంపెనీలకు ఎంత భూమి ఇచ్చారనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సమీక్ష సమావేశంలో అధికారులు చెప్పిన వివరాలు విని ఒకదశలో జగన్ ఆశ్చర్యపోయారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఒక్క శాశ్వత నిర్మాణం కూడా జరగకుండా వేల కోట్ల రూపాయల్ని ఎలా విడుదల చేశారు, వాటిని ఎలా మళ్లించారనే అంశంపై లెక్కలు తెలుసుకొని అవాక్కయ్యారు జగన్. త్వరలోనే రాజధాని అంశానికి సంబంధించి అసలైన లెక్కలు, జరిగిన పనుల వివరాల్ని ముఖ్యమంత్రి హోదాలో బయటపెట్టబోతున్నారు జగన్.

తెలుగుదేశం కథ ముగిసిందా?.. బడాయికి పోతున్న బీజేపీ

Show comments