చార్మి ఇక నిర్మాత మాత్రమే

చార్మి అంటే ఓ అందాల హీరోయిన్. మంచి డ్యాన్సర్. మంచి ఫిజిక్. మంచి స్మయిలింగ్ ఫేస్. కానీ ఇప్పుడు చార్మి ఓ నిర్మాత మాత్రమే. యాభై అయిదు సినిమాలు చేసిన చార్మి, చటుక్కున తన కెరీర్ కు తనే ఫుల్ స్టాప్ పెట్టేసారు. నిర్మాతగా మారిపోయారు. ఎందుకలా? చార్మి పుట్టినరోజు సందర్భంగా ఇదే విషయంపై ఆమె వివరణ, ఆమె మాటల్లోనే...

హాయ్ చార్మి గారూ..హ్యాపీ బర్త్ డే.
థాంక్యూ అండీ...

ఫుల్ హ్యాపీ అనుకంటా..
అవునండీ.. నిన్నటికి నిన్న విడుదల చేసిన ఇస్మార్ట్ శంకర్ టీజర్ కు మాంచి రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ హ్యాపీగా వుంది మా అందరికీ. సినిమా ప్రారంభించిన నాటి నుంచి తెలుసు మాకు. ఈ సినిమాకు, పూరి గారికి, రామ్ గారికి, అలాగే కంటెంట్ కు ఎంత అప్లాజ్ వస్తుందో. టీజర్ తో అది స్టార్ట్ అయింది.

ఆ సంగతి అంతా అలా వుంచండి.. చార్మి ఇక తెరపై కనిపించరా?
లేదు. నేను జ్యోతిలక్ష్మి సినిమాను ఆ ఉద్దేశంతోనే చేసాను. జ్యోతిలక్ష్మి ఫంక్షన్ లోనే నటిగా నా రిటైర్మెంట్ గా ప్రకటిద్దాం అని అనుకున్నా కూడా. కానీ నిర్మాత సి.కళ్యాణ్ గారు వద్దని వారించారు. నటిగా అలాంటి స్టేట్ మెంట్ లు ఇవ్వవద్దన్నారు.

అసలు నటన మానేయాలని ఎందుకు అనిపించింది?
ఎన్నాళ్లిలా? యాభై అయిదు సినిమాలు చేసాను. ఇంకా అలాగే పట్టుకుని వేలాడాలా? అందుకే ఇక చాలు అనుకున్నాను.

హీరోయిన్లు వయసు మీరాక అక్క, వదిన, ఇలా వస్తున్నారుగా?
అందుకే వద్దనుకున్నాను. చార్మి ఇలాగే వుండిపోవాలి. అంతే.

అంటే హీరోయిన్ గానే చార్మి గుర్తుండిపోవాలా? అక్క, వదిన క్యారెక్టర్లకు ఎవరైనా అడిగితే.
చచ్చినా చేయను. చేయమన్నా చేయను.

హీరోయిన్ సంగతి సరే, మాంచి అయిటమ్ సాంగ్ చేయచ్చుగా ఫ్యాన్స్ కోసం.
ఇదివరకు చేసానుగా.. చాలు.

నిర్మాణం అంటే ఎందుకు మీకు అంత ఆసక్తి?
మాది బిజినెస్ ఫ్యామిలీ, సోల్జర్స్ బ్లడ్. దేనికైనా పోరాడడం, కష్టపడడం మా రక్తంలోనే వుంది. మా ఫాదర్ కు బిజినెస్ లు వున్నాయి. నా చిన్నప్పటి నుంచి అవి చూస్తూ పెరిగాను. అందుకే ఇలా నిర్మాతగా మారాను.

కానీ పూరి అంతగా లైమ్ లైట్ లో లేరు. రామ్ గ్రాఫ్ మరీ గొప్పగాలేదు. మరి ఇస్మార్ట్ శంకర్ కు మీ కాలుక్యులేషన్లు ఎలా వుండబోతున్నాయి?
అవేమీ మేము ఆలోచించడం లేదు. మంచి కంటెంట్ తో సినిమా అందించాలన్నదే ప్రయత్నం. టీజర్ చూసారుగా. దాని రెస్సాన్స్ చూసారుగా.

కావచ్చు. కానీ ఫైనాన్షియల్ కాలుక్యులేషన్లు అవీ వుంటాయిగా?
అన్నీ వుంటాయి. మీరే చూస్తారుగా. మాసివ్ విడుదల వుంటుంది. మంచి సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం.

మే నెలాఖరు విడుదల అని అనుకున్నారు కదా ముందుగా?
అనుకున్నాం. హీరోయిన్ పాస్ పోర్ట్ ఫోవడం, వర్క్ వుండడంతో కాస్త డిలే అయింది. ఇప్పుడు గోవాలో భారీ సెట్ వేసి ఓ పాట తీస్తున్నాం, బాగా వస్తోంది. ఇంకొ పాటకు కూడా సెట్ వేస్తున్నాం.

విదేశాల్లో పాటలు మరి లేనట్లేనా?
కాదు. కాదు. ఆ పాటలు కూడా వుంటాయి. అవి కూడా చేస్తాం.

పూరి టైపు అయిటమ్ సాంగ్ కూడా వుంటుందా?
స్పెషల్ సాంగ్ నే కాదు, సినిమా అంతా స్పెషల్ గా వుంటుంది. సినిమానే ఓ ఐటమ్ గా వుండబోతోంది.

సో, సక్సెస్ కొడతారు. ఇక చార్మిని ఇలా వరుసగా నిర్మాతగా చూడొచ్చు అంటారు.
తప్పకుండా. ఇస్మార్ట్ శంకర్ నే కాదు, ఇంకా ఇంకా..

థాంక్యూ.. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే..
థాంక్యూ

-విఎస్ఎన్ మూర్తి

సెక్స్ కు మనిషిని దూరం చేస్తున్న ఇంటర్నెట్!

Show comments