బాబు కోరిందేదీ కేంద్రం కాద‌న‌దా?

ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు ఏది కోరినా కేంద్ర ప్ర‌భుత్వం కాదు, లేదు అన‌ద‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు.  కేంద్రంలో చంద్ర‌బాబు, నితీశ్‌కుమార్ అండ‌దండ‌ల‌తోనే మోదీ స‌ర్కార్ ఏర్పాటైన విష‌యాన్ని టీడీపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. నిజ‌మే మ‌రి. తుమ్మితే ఓడిపోయేంత బ‌ల‌హీనంగా మోదీ స‌ర్కార్ ఉంది.

ఈ నేప‌థ్యంలో సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత మొద‌టిసారి చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ త‌దిత‌ర కేంద్ర మంత్రుల్ని ఆయ‌న క‌ల‌వ‌నున్నారు. అమ‌రావ‌తి, పోల‌వ‌రం నిర్మాణాల‌తో పాటు ఏపీకి ఉదారంగా నిధులు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు అభ్య‌ర్థించ‌నున్నారు. చంద్ర‌బాబు కోరితే, కేంద్రం కాద‌నే ప‌రిస్థితి వుండ‌ద‌నే న‌మ్మ‌కంతో టీడీపీ నేత‌లున్నారు.

ఎందుక‌నో చంద్ర‌బాబు వెంట ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెళ్ల‌లేదు. తాను, చంద్ర‌బాబు క‌లిసి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబ‌డుతామ‌ని బుధ‌వారం పిఠాపురం ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు. బాబుతో పాటు ప‌వ‌న్ వెళ్లి ప్ర‌ధాని, హోంమంత్రి, ఆర్థిక మంత్రితో భేటీ అయ్యి వుంటే... నిధులు క‌థ వేరే లెవెల్‌లో వుండేద‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు. ప‌వ‌న్ ఢిల్లీకి వెళ్ల‌క‌పోవ‌డం వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఒక పెద్ద అవ‌కాశాన్ని కోల్పోయిన‌ట్టే అని జ‌న‌సేన నాయ‌కుల భావ‌న‌.  

అయినా న‌ష్టం లేదు. ప‌వ‌న్ చెప్పిన‌ట్టు చంద్ర‌బాబు ప‌రిపాల‌న ప‌రంగా అనుభ‌వ‌జ్ఞుడు. రాష్ట్రానికి నిధులు ఎలా రాబ‌ట్టాలో బాగా తెలుసు. 2014 -19 మ‌ధ్య ఇదే రకంగా ఎన్డీఏలో భాగ‌స్వామిగా చంద్ర‌బాబు ఉన్న‌ప్పుడు రాష్ట్రానికి నిధులు వెల్లువెత్తించిన సంగ‌తిని ఇంకా ఎవ‌రూ మ‌రిచిపోలేదు. నిధులు రాబ‌ట్టుకోడానికి బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న జ‌స్ట్ ట్రైల‌ర్ మాత్ర‌మే. రానున్న రోజుల్లో భారీగా నిధులు రాబ‌ట్టి పోల‌వ‌రం, అమ‌రావ‌తి నిర్మాణాల‌తో పాటు సూప‌ర్ సిక్స్ లాంటి సంక్షేమ ప‌థ‌కాల్ని విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తార‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. తిన‌బోతు రుచి చూడ‌డం ఎందుకు? Readmore!

Show comments