బాబు గారూ! ప్రత్యేక హోదాను మరిచిపోమంటారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది వస్తుందా లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గెలిచిన 21 మంది కూటమి ఎంపీలు రాష్ట్రం పురోగతి కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఢిల్లీలో ఆమేరకు ఒత్తిడి చేయగలరా లేదా? ఒత్తిడి చేతకాకపోతే కనీసం విజ్ఞప్తుల ద్వారానైనా హోదాను సాధించే ప్రయత్నం చేస్తారా లేదా? అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది!

ఒకవైపు బీహార్ రాష్ట్ర అసెంబ్లీ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి తీరాల్సిందేనని తీర్మానం చేసిన నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇంకా మౌనముద్రను విడకపోవడం పై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారూ.. ప్రత్యేక హోదా అనే ఆశను వదులుకోమంటారా అని వారు అడుగుతున్నారు.

చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలతో వ్యవహరిస్తారనేది అందరికీ తెలిసిన సంగతి. 2019 ఎన్నికలకు పూర్వం కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నంతకాలం హోదా అనే డిమాండ్ ను సర్వనాశనం చేసిన చంద్రబాబు, సరిగ్గా ఎన్నికల ముందు ధర్మ పోరాటం పేరుతో ఒక డ్రామా నడిపించారు. మోడీని దూషించారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు సైలెంట్ గా ఉండిపోయారు.

ఇప్పుడు అధికారంలోకి వచ్చి కేంద్రంలో భాగస్వామి అయిన తర్వాత కూడా మళ్లీ హోదా గురించి మాట్లాడడం లేదు. తెలుగుదేశం కంటే తక్కువ స్థానాల బలంతో ఉన్న జెడియు బీహార్ కు హోదా కావాలని డిమాండ్ చేస్తున్నది. ఈ కీలక సమయంలో ఆ మాత్రం ధైర్యం చంద్రబాబు నాయుడు చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. Readmore!

తాజాగా కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ ప్రత్యేక హోదాకు బదులుగానే ప్యాకేజీ ఇచ్చాము కదా అని వ్యాఖ్యానించడం హోదాను ఇక మరచిపోవచ్చు అన్నట్టుగా ప్రవర్తించడం ప్రజలకు అనుమానాలు కలిగిస్తోంది.

కేంద్రమంత్రి బిజెపికి చెందిన శ్రీనివాసవర్మ మాటలు ఏపీకి ప్రత్యేకహోదా హుళక్కి అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. చంద్రబాబునాయుడు కనీసం ఈ మాటలను ఖండిస్తే అయినా ప్రజల్లో కొంత ఆశ మిగిలి ఉంటుంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నందుకు తెలుగుదేశం హోదా సాధించగలదని ప్రజలు ఆశలు పెట్టుకోగా, ఇప్పుడు మన రాష్ట్రానికే చెందిన కేంద్రమంత్రి పలుకులు నిరాశలోకి నెట్టేస్తున్నాయి.

ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు అసలు కేంద్రాన్ని ప్రత్యేకహోదా గురించి అడుగుతారా లేదా అని అందరూ నిరీక్షిస్తున్నారు.

Show comments