జ‌న‌సేన ఎమ్మెల్యే అన్న కుమారుడి పెత్త‌నం చూడ‌త‌ర‌మా!

నిన్న అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటిలో ర‌వాణాశాఖ మంత్రి రాంప్ర‌సాద్‌రెడ్డి భార్య హ‌రితారెడ్డి ఎస్ఐ ర‌మేశ్‌పై ద‌బాయింపు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించింది. ఇలాంటి ఘ‌ట‌న‌ల్ని ఉపేక్షించ‌న‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించిన‌ట్టు మీడియాలో చూశాం. అయితేనేం, కూట‌మి నేత‌ల పెత్త‌నం రోజురోజుకూ పెరుగుతోంది.

తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో క‌మిష‌న‌ర్ అదితిసింగ్‌తో స‌మానంగా జ‌న‌సేన ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు అన్నజ‌య‌రాం కుమారుడు శివ‌కుమార్ ద‌ర్జాగా అధికారం చెలాయించారు. చిత్తూరు వాసైన శివ‌కుమార్ తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో పెత్త‌నం చెలాయించ‌డం ఏంట‌ని అనుకుంటే పొర‌పాటే. చిత్తూరు వాసైన ఆర‌ణి శ్రీ‌నివాసులు తిరుప‌తి ఎమ్మెల్యే కావ‌డంతో ఆ ఆధ్మాత్మిక న‌గ‌రాన్ని త‌మ‌కు ప్ర‌జ‌లు రాయించార‌ని వారు అనుకోవ‌డంలో త‌ప్పేం వుంది?

అదితిసింగ్‌తో పాటు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులతో ఎమ్మెల్యే అన్న కుమారుడు స‌మావేశం పెట్టుకుని, కార్యాల‌యానికి సంబంధించి ఏదైనా త‌న‌కు తెలియాల్సిందే అని హుకుం జారీ చేశారు. మంచి మాట‌లు ఆయ‌న మాట్లాడిన‌ప్ప‌టికీ, ఏ అధికారంతో క‌మిష‌న‌ర్‌తో పాటు ఇత‌ర అధికారుల‌తో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. అయితే ఇప్పుడు ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు విలువ లేకుండా పోతోంది.

ఎందుకంటే ఎమ్మెల్యే అయితే ఆయ‌న పిల్ల‌ల‌తో పాటు బంధువులంద‌రికీ అధికారం క‌ట్ట‌బెట్టిన‌ట్టు అవుతోంది. అందుకే క‌దా మంత్రి భార్య హ‌రితారెడ్డి ఒక ఎస్ఐని ప‌ట్టుకుని న‌డిరోడ్లుపై క్లాస్ పీకింది. తిరుప‌తి ఎమ్మెల్యే అన్న కుమారుడు ద‌ర్జాగా తానే ఎమ్మెల్యే అయిన‌ట్టు భావించి, క‌మిష‌న‌ర్ మొద‌లుకుని సిబ్బంది అంతా మంచిగా ప‌ని చేస్తేనే, త‌మ‌కు రాజ‌కీయంగా మంచి జ‌రుగుతుంద‌ని హితోప‌దేశం చేశారు. Readmore!

త‌న బ‌దులు ఎమ్మెల్యేనే త‌న బంధువుల‌కు ప్ర‌భుత్వ కార్యాల‌యాల్ని అప్ప‌గించి, పెత్త‌నం చేయ‌మ‌న్నారా? లేక వాళ్ల‌కు వాళ్లే అధికారాన్ని చేత‌ల్లోకి తీసుకున్నారా? అనేది తేలాల్సి వుంది. ప్ర‌స్తుతానికి కూట‌మి నేత‌ల చ‌ర్య‌లు మాత్రం ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌ను నింపేలా ఉన్నాయి.

Show comments