నాపై దుష్ప్ర‌చారం... వైసీపీ నుంచి సిద్ధం!

తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న వ‌స్తున్న వార్త‌ల్ని న‌ర‌సారావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస్‌రెడ్డి ఖండించారు. ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌పై ఉన్నందున తాను ఎక్క‌డికీ రావ‌డం లేద‌న్నారు. అంత మాత్రాన తన రాజ‌కీయ ప్ర‌స్థానంపై అస‌త్యాలు ప్ర‌చారం చేయ‌డం స‌రైంది కాద‌న్నారు.

కొత్త ప్ర‌భుత్వానికి కొంత స‌మ‌యం ఇవ్వాల్సిన అవ‌స‌రం వుంద‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వం తామిచ్చిన హామీల్ని నెర‌వేర్చాల‌న్నారు. ఒక‌వేళ హామీల్ని నెర‌వేర్చ‌క‌పోతే రోడ్డు మీద‌కి వ‌చ్చి ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడుతామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వం మారిన 12 రోజుల‌కే తానేదో పార్టీ మారుతున్న‌ట్టు ప్ర‌చారం చేయ‌డం విడ్డూరంగా వుంద‌న్నారు. మొద‌టి నుంచి వీళ్లే త‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న విమర్శించారు.

గ‌త నెల 30వ తేదీ నుంచి తాను ఇంట్లోనే వుంటున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. కార్య‌క‌ర్త‌ల కోసం ఎలాంటి పోరాటం చేయ‌డానికైనా తాను సిద్ధంగా ఉన్న‌ట్టు గోపిరెడ్డి శ్రీ‌నివాస్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. త‌మ‌ను న‌మ్ముకుని ఎన్నిక‌ల్లో ప‌ని చేసిన కార్య‌క‌ర్త‌ల కోసం సిద్ధంగా ఉంటామ‌ని ఆయ‌న చెప్పారు. క్రియాశీల రాజ‌కీయాల్లో వైసీపీ జెండా మోస్తూనే వుంటాన‌న్నారు. రానున్న రోజుల్లో కూడా వైసీపీ కోసం నిల‌బ‌డ‌తాన‌న్నారు.

ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్ర‌జ‌లు, వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు త‌మ కార్యాల‌యానికి రావాల‌ని, ఎప్పుడూ త‌లుపులు తెరిచే వుంటాయ‌ని గోపిరెడ్డి శ్రీ‌నివాస్‌రెడ్డి భ‌రోసా ఇచ్చారు. త‌న‌పై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, న‌ర‌సారావుపేట‌లో వైసీపీ త‌ర‌పున పోరాటానికి సిద్ధంగా ఉంటాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. Readmore!

Show comments