2 కంటే ఎక్కువ సిమ్ కార్డులుంటే మోత తప్పదా?

గడిచిన 24 గంటలుగా ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉంటే ఇకపై అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందనే ప్రచారం జోరుగా సాగింది.

అయితే ఇది కేవలం ప్రచారం మాత్రమే. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని ట్రాయ్ తాజాగా ప్రకటించింది. ఇది పూర్తిగా అసత్య ప్రచారమని, ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలామంది 2 లేదా అంతకంటే ఎక్కువ సిమ్ కార్డులు వాడుతున్నారు. వ్యక్తిగతంగా ఒకటి, ఆఫీస్ లేదా వ్యాపార అవసరాల కోసం ఇంకోటి వాడుతున్నారు. ఇలాంటి వాళ్లంతా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని భయపడ్డారు. కానీ ఈ ప్రచారంలో నిజం లేదని ట్రాయ్ చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం నడుస్తున్న విధానం ప్రకారం, రీచార్జి మాత్రం చేసుకుంటే సరిపోతుందని, అదనపు సిమ్ కార్డుకు ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని టెలికం రెగ్యులేటరీ సంస్థ - ట్రాయ్ స్పష్టం చేసింది. నిజానికి ఈ విధానం ఇప్పటికే పలు దేశాల్లో అమల్లో ఉంది. అందుకే దీన్ని ఇండియాలో కూడా అమలు చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని ట్రాయ్ స్పష్టం చేసింది. Readmore!

ఒకప్పుడు సిమ్ కార్డు కోసం వినియోగదారుడు డబ్బు చెల్లించాల్సి వచ్చేది. ఆ తర్వాత టెలికం కంపెనీల మధ్య పోటీ కారణంగా ఉచితంగా సిమ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉచితంగానే డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. కాబట్టి అదనపు సిమ్ పై అదనపు రుసుం లాంటి విధానం ఇప్పట్లో సరైనది కాదని ట్రాయ్ అభిప్రాయపడింది.

Show comments